Parasakthi Controversy: తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియా యుద్ధాలు సర్వసాధారణం. అయితే ఈసారి ఈ గొడవలు హద్దులు దాటుతున్నాయంటూ ‘పరాశక్తి’ చిత్ర నటుడు, క్రియేటివ్ ప్రొడ్యూసర్ దేవ్ రామ్నాథ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నటుడు శివకార్తికేయన్ నటించిన తాజా చిత్రం ‘పరాశక్తి’పై కావాలనే నెగటివ్ రివ్యూలు ఇస్తూ, ఐఎండిబి (IMDb) వంటి సైట్లలో రేటింగ్స్ తగ్గించేలా విజయ్ అభిమానులు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. దీంతో ఇరు వర్గాల మధ్య సోషల్ మీడియా వేదికగా వివాదం పెరుగుతోంది.
Read also-YouTube Controversy: ఏయ్ జూడ్‌కి దిమ్మతిరిగే వార్నింగ్ ఇచ్చిన నా అన్వేషణ.. ఎందుకంటే?
నెగటివ్ రివ్యూలపై ఆగ్రహం
సినిమా విడుదలైనప్పటి నుండి సోషల్ మీడియాలో ‘పరాశక్తి’ని టార్గెట్ చేస్తూ పెయిడ్ నెగటివిటీ నడుస్తోందని దేవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సినిమా నచ్చకపోతే విమర్శించడంలో తప్పు లేదని, కానీ కావాలనే తప్పుడు రేటింగ్స్ ఇవ్వడం ద్వారా సినిమా భవిష్యత్తును దెబ్బతీస్తున్నారని ఆయన మండిపడ్డారు. “మేము ఎప్పుడైనా ‘జననాయకన్’ (విజయ్ సినిమా) విడుదలను అడ్డుకున్నామా? మరి మా సినిమా విషయంలో ఇలా ఎందుకు చేస్తున్నారు?” అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. ఒక నటుడిని ఇష్టపడటం అంటే మరో నటుడిని ద్వేషించడం కాదని దేవ్ రామ్నాథ్ స్పష్టం చేశారు. విజయ్ వంటి స్టార్ హీరోల సినిమాలతో పోటీ పడటం అసాధ్యమని తెలిసినా, చిన్న సినిమాలకు కనీస గౌరవం ఇవ్వాలని ఆయన కోరారు. “ఒకరిని తక్కువ చేయడం వల్ల మీ హీరో గొప్పవాడు అయిపోడు” అంటూ అభిమానులకు హితవు పలికారు.
అలా చేయడం సరికాదు
ఈ గొడవల్లోకి కేవలం నటులనే కాకుండా, వారి కుటుంబ సభ్యులను వ్యక్తిగత జీవితాలను లాగడం అత్యంత దారుణమని చిత్ర బృందం పేర్కొంది. శివకార్తికేయన్ కూడా గతంలో ఇదే విషయంపై స్పందిస్తూ, విజయ్ గారి ఆశీస్సులతోనే తాము ముందుకు వెళ్తున్నామని, అభిమానులు సంయమనం పాటించాలని కోరారు. చివరగా, “సినిమా అనేది ఎంతో మంది శ్రమ. రేటింగ్స్ ద్వారా ఒక సినిమాను చంపేయాలని చూడటం సినీ పరిశ్రమకే ప్రమాదకరం” అని దేవ్ రామ్నాథ్ హెచ్చరించారు.

