Padma Awards 2026: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు 2026 (Padma Awards 2026) జాబితాను విడుదల చేసింది. ఇందులో కళలు, సామాజిక సేవ, శాస్త్ర సాంకేతికం, సాహిత్యం, క్రీడలు ఇలా పలు రంగాలకు సంబంధించి పద్మ విభూషణ్ (Padma Vibhushan) కేటగిరిలో 5గురికి, పద్మ భూషణ్ (Padma Bhushan) కేటగిరీలో 13 మందికి, పద్మశ్రీ (Padma Shri) కేటగిరీలో 113 మందికి పురస్కారాలను ప్రకటించింది. ఇందులో అగ్ర నటుడు, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టిని పద్మ భూషణ్ వరించింది. అలాగే తెలుగు వాళ్లైన అగ్ర నటులు మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్‌లను పద్మశ్రీ వరించింది.
ఐదు దశాబ్దాలుగా వెండితెరను ఏలుతున్న నటుడు
మలయాళ చిత్ర పరిశ్రమలో దిగ్గజ నటుడిగా పేరుగాంచిన మమ్ముట్టి (Mammootty), కేవలం నటుడిగానే కాకుండా తన అద్భుతమైన వ్యక్తిత్వంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. గత ఐదు దశాబ్దాలుగా వెండితెరపై విభిన్నమైన పాత్రలను పోషిస్తూ, నటనలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఒరవడిని సృష్టించారు. దాదాపు 400కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన, మూడు జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాలను అందుకున్నారు. ఈ వయస్సులోనూ ఆయన ఫిట్‌నెస్ పాటిస్తూ, నటుడిగా సరికొత్త ప్రయోగాలు చేస్తూ నేటి తరం యువ నటులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ నటించి తన నటనతో అందరినీ మంత్రముగ్ధులను చేశారు. ఆయన ఒక నటుడిగానే కాకుండా, సమాజ సేవలోనూ చురుగ్గా పాల్గొంటూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఆయనకు పద్మ భూషణ్ ప్రకటించగానే అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
‘మా’కు ముఖ్యం మురళీ మోహన్
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సీనియర్ నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా మురళీ మోహన్ (Murali Mohan)కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దాదాపు 350కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన, వెండితెరపై ఎంతో హుందాతనంతో కూడిన పాత్రలను పోషించి సుప్రసిద్ధ నటుడుగా పేరు తెచ్చుకున్నారు. కేవలం నటుడిగానే కాకుండా జయభేరి ఆర్ట్స్ పతాకంపై అనేక విజయవంతమైన సినిమాలను నిర్మించి, పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. నటనతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలోనూ, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఆయన, ఎంతో మంది సినీ కార్మికులకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటారు. ముఖ్యంగా ‘మా’ (MAA) అసోసియేషన్ అభివృద్ధిలో ఆయన పోషించిన పాత్ర ఎంతో కీలకం. అటువంటి నటుడికి ఆలస్యంగానైనా ‘పద్మశ్రీ’ వరించినందుకు తెలుగు చిత్ర పరిశ్రమ గర్విస్తోంది.
Also Read- Nara Rohith Wedding Video: ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తూ.. నారా రోహిత్, సిరి వెడ్డింగ్ వీడియో చూశారా?
రాజేంద్రునికి తగిన గౌరవం
తెలుగు సినిమా చరిత్రలో కామెడీకి కొత్త అర్థాన్ని చెప్పి, తన విలక్షణ నటనతో ‘నటకిరీటి’ బిరుదును అందుకున్న గొప్ప నటుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ (Gadde Babu Rajendra Prasad). కేవలం హాస్యానికే పరిమితం కాకుండా, భావోద్వేగాలను పండించడంలోనూ ఆయన కింగ్ అని చెప్పుకోవచ్చు. 80, 90వ దశకాల్లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలు అందుకుని, తెలుగు ప్రేక్షకుల ఫ్యామిలీలలో ఒక సభ్యుడిగా మారిపోయారు. జంధ్యాల, వంశీ వంటి దిగ్గజ దర్శకుల కాంబినేషన్‌లో ఆయన చేసిన సినిమాలు నేటికీ క్లాసిక్స్‌గా నిలిచిపోయాయి. ‘ఎర్ర మందారం’, ‘ఆ నలుగురు’, ‘మీ శ్రేయోభిలాషి’ వంటి చిత్రాల ద్వారా తనలోని పరిణతి చెందిన నటుడిని ప్రపంచానికి పరిచయం చేసి నంది అవార్డులను గెలుచుకున్నారు. ప్రస్తుతం సీనియర్ ఆర్టిస్ట్‌గా విలక్షణమైన తండ్రి, తాత పాత్రలను పోషిస్తూ నేటి తరం నటులకు సరిసమానంగా గుర్తింపును పొందుతున్నారు. రాజేంద్రుడికి కూడా ఈసరికే ‘పద్మశ్రీ’ వచ్చి ఉండాలి. కానీ, ఆలస్యమైనా, తగిన గుర్తింపు లభించినందుకు తెలుగు చిత్ర పరిశ్రమ సంతోషం వ్యక్తం చేస్తోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

