OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) నటించిన ‘ఓజీ’ సినిమా (OG Movie) థియేటర్లలో ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దర్శకుడు సుజీత్ (Sujeeth) తెరకెక్కించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా పవన్ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించి, దాదాపు రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో సరికొత్త రికార్డును నెలకొల్పింది. థియేట్రికల్ రన్ ముగియకముందే, ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అంతర్జాతీయ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix)లోకి అడుగుపెట్టి, అక్కడ కూడా తన సత్తా చాటుతోంది. అక్టోబర్ 23న ఈ చిత్రాన్ని ఓటీటీ స్ట్రీమింగ్‌కు తెచ్చారు. ఓటీటీలోకి వచ్చిన 3 రోజుల వ్యవధిలోనే ‘ఓజీ’ దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రం ఇండియా సహా ప్రపంచంలోని 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. అంతేకాకుండా, గ్లోబల్‌గా టాప్ 10 ట్రెండింగ్ చిత్రాలలో ఒకటిగా నిలవడం పవన్ కళ్యాణ్ క్రేజ్, తెలుగు సినిమా స్థాయిని మరోసారి ప్రపంచానికి చాటి చెబుతోంది.
Also Read- Sankranthi Movies: సంక్రాంతి రేసు నుంచి రాజు తప్పుకుంటున్నాడా? కారణం ఆ తమిళ హీరోనేనా?
ఓజీ సినిమా హైలెట్స్ ఇవే..
‘ఓజీ’ సినిమాకు ఈ స్థాయిలో ఆదరణ లభించడానికి ప్రధాన కారణం దర్శకుడు సుజీత్ అనే చెప్పాలి. తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్‌ను తనలాగే అభిమానులు కోరుకున్న విధంగా అత్యంత స్టైలిష్‌గా, పవర్ ఫుల్ పాత్రలో చూపించడంతో అంతా పండగ చేసుకున్నారు. ‘ఓజస్ గంభీరా’ అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో పవన్ నటన, యాక్షన్ సన్నివేశాలు, అలాగే తమన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాను విజయతీరాలకు చేర్చాయి. హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తగ్గని విజువల్స్, ఆర్ట్ వర్క్, గ్యాంగ్‌స్టర్ కథాంశం భారతీయేతరులను కూడా ఆకర్షించడంలో విజయం సాధించాయి. సాధారణంగా భారతీయ సినిమాలు ఓటీటీలో విడుదలైనప్పటికీ, గ్లోబల్ స్థాయిలో టాప్ 10లో నిలవడం అరుదైన విషయం. కానీ ‘ఓజీ’ కేవలం థియేటర్లలోనే కాక, ఓటీటీలో కూడా తన ప్రభావాన్ని కొనసాగించడం చూస్తుంటే పవన్ కళ్యాణ్ సినిమాకున్న పవర్ ఏంటో అర్థమవుతోంది.
Also Read- Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!
నిర్మాత చేసిన తప్పిదమిదే..
ఈ చిత్రం ఇతర భాషల్లో ప్రచారం అంతగా లేకపోయినా, ఓటీటీలో ఆదరణ లభిస్తుండడంతో, ‘ఓజీ’ నిజంగానే ఒక పాన్-ఇండియా గ్లోబల్ హిట్ అని నిరూపించుకుంటోంది. ఈ రికార్డులతో పవన్ ఫ్యాన్స్ మరోసారి సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమా విషయంలో మేకర్స్ కూడా మిస్టేక్ చేశారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసి ఉంటే, పవన్ కళ్యాణ్ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసేది. ముఖ్యంగా హిందీ బెల్ట్‌లో ఈ తరహా కథాంశాలకు బాగా ఆదరణ లభిస్తుంది. దానిని క్యాష్ చేసుకోవడంతో నిర్మాత ఫెయిలయ్యారు. ప్రస్తుతం ఓటీటీలో హిందీ వెర్షన్ కూడా అందుబాటులో ఉండటంతో.. ఈ సినిమాకు భారీగా ఆదరణ లభిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, దాసరి కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
