Natti Kumar: నటుడు, కామెడీ విలన్ ఫిష్ వెంకట్ (Fish Venkat) కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఎవరైనా ఆదుకోవాలని, కుటుంబ సభ్యులు రోదించారు. దాదాపు ఆయన చికిత్సకు రూ. 50 లక్షలు అవసరం అవుతాయని డాక్టర్స్ చెప్పడంతో.. కుటుంబ సభ్యులు ఎంతగానో వేడుకున్నారు. కానీ ఎవరూ ముందుకు రాలేదు. ఒకరిద్దరు చిన్న హీరోలు మినహా.. ఆయనకు సాయం చేయడానికి స్టార్ హీరోలెవరూ అడుగు వేయలేదు. మధ్యలో ప్రభాస్ (Prabhas), రామ్ చరణ్ (Ram Charan) పేర్లు వినిపించాయి కానీ.. వారి పేర్లపై వచ్చిన వార్తల్లో ఎటువంటి నిజం లేదని, ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులే తెలిపారు. ఈ నేపథ్యంలో తెలుగు సినీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ, మాజీ ప్రొడ్యూసర్స్ సెక్టార్ చైర్మన్, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఫిలిం డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ అయిన నట్టి కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. సాయం అనేది వాళ్లు చేస్తే తీసుకోవాలి కానీ, డిమాండ్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటి వరకు ఆయనకు చాలా మంది సాయం చేశారు. ఆయన సరైన రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయకపోవడంతో పాటు, కమ్యూనికేషన్ గ్యాప్ కూడా నివాళులు అర్పించడానికి ఎవరూ రాకపోవడానికి కారణం అని నట్టి కుమార్ తెలిపారు.
ఈ సందర్భంగా నట్టి కుమార్ (Producer Natti Kumar) మాట్లాడుతూ.. ‘‘ఇండస్ట్రీ నుంచి ఎవరూ ముందుకు రాలేదని అంటున్నారు. అసలు ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే.. ఆర్టిస్ట్ అనేవారు రెగ్యులర్‌గా టచ్‌లో ఉండాలి. అలా ఉంటే, ఒక టీమ్ ఉంటుంది. ఎవరైనా సాయం చేయడానికి ముందుకు వస్తారు. ఎప్పుడైతే సినిమా ఫీల్డ్ వదిలి దూరంగా ఉంటారో.. వారికి ఏమైనా అయినప్పుడు ఎవరూ కూడా వెళ్లలేదు. ఇంకోటి కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ ఉండొచ్చు. ఈయన ఒకప్పటి హీరోలతో బాగా కలిసి ఉండొచ్చు. ఇప్పటి వారితో అంతగా రాపో ఉండకపోవచ్చు. ఫిష్ వెంకట్ కూడా రోజుకి 3 వేల నుంచి 35 వేలు సంపాదించే స్థాయికి వెళ్లిన ఆర్టిస్ట్. ఆయనకు కూడా అప్పట్లో ఒక మేనేజర్ ఉండేవాడు. కాకపోతే.. ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీ వదిలి దూరంగా వెళ్లాడో.. అప్పుడెవరూ పట్టించుకోరు.
Also Read- Telangana Govt: పారిశ్రామికవేత్తలుగా మహిళలు.. సీఎం రేవంత్ రెడ్డి ఆమోదమే తరువాయి!
ఇదంతా బిజీ ప్రపంచం.. ఇక్కడ ఎవరి పనిలో వారు బిజీగా ఉంటారు. ఎవరెలా ఉన్నారనేది ఎవరూ పట్టించుకోరు. ఇక్కడ నిరంతరం టచ్‌లో ఉండాలి, లేదంటే ఎవరూ పట్టించుకోరు. ఆయన ఎవరితో అయితే రిలేషన్ షిప్ మెయింటైన్ చేశారో.. వాళ్లే వచ్చారు. ‘గబ్బర్ సింగ్’ బ్యాచ్‌తో ఆయనకు రిలేషన్‌షిప్ ఉంది.. అందుకే వాళ్లే వచ్చారు. మిగతావాళ్లతో పెద్దగా ఆయన రిలేషన్ మెయింటైన్ చేయలేదు. వాళ్ల ఫ్యామిలీ ఏమైనా అనుకోనివ్వండి. ఇక్కడ అయ్యో పాపం అని అనుకునేవారు ఎవరూ ఉండరు. ఎవరి పని వారు చేసుకుని ఇళ్లకు వెళ్లిపోతారు. రిలేషన్‌షిప్స్ అంతగా మెయింటైన్ చేయరు. ఫిల్మ్ నగర్, మణికొండ పరిధిలో ఉన్నవారికి మాత్రమే ఇక్కడ సంబంధాలు కలిగి ఉంటారు. అందులోనూ ఆయన అసోసియేషన్ మెంబర్ కూడా కాదు.
అన్ని సినిమాలు చేశాడు.. చివరి చూపు చూడటానికైనా రావాలి కదా? చూడాలి కదా? అని ప్రశ్నించడానికి లేదు. ఎందుకంటే ఎవరిష్టం వాళ్లది. పెద్ద పెద్ద నిర్మాతలు, డైరెక్టర్స్ ఎవరైనా చనిపోతే స్టార్స్ వచ్చారు. కానీ ఆ పెద్ద పెద్ద వారి పిల్లలు ఎవరైనా చనిపోతే ఈ స్టార్స్ ఎవరైనా వచ్చారా? వాళ్లని ఇండస్ట్రీలో ఎవరైనా గుర్తిస్తారా? ఇంకా ఉదాహరణ చెప్పాలంటే.. ఒక పెద్ద నిర్మాత స్టార్ హీరోలతో ఓ 30 సినిమాలు చేసి ఉంటాడు. వాళ్ల అబ్బాయి ఫారిన్‌లో చదువుకుని వచ్చి, ఏదో ఫేవర్ కావాలని ఆ హీరోల ఇంటికి వెళితే మొదటి రోజు.. చేద్దాం అంటారు.. రెండో రోజు సెక్యూరిటీ అతనిని రానివ్వరు. అలాంటి ఇండస్ట్రీ ఇది. అలాంటి సినీ ప్రపంచంలో ఉన్నాం. అదే ఒక స్లమ్‌లోకి వెళ్లి అక్కడ ప్రాబ్లమ్ ఉంది అంటే.. అక్కడ పని చేసుకునే వారంతా కలిసి కొంత అమౌంట్ వేసుకుని సాయం చేస్తారు. ఉన్నవాడికి డబ్బు మీద ప్రేమ.. లేని వాడికి ప్రాణం మీద ప్రేమ. ఇది ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. ప్రతి చోటా ఉంది. ఇది అంతా గుర్తు పెట్టుకోవాలి. దయచేసి సినిమా ఇండస్ట్రీలో ఎక్స్‌పెక్ట్ చేయవద్దు. పలానా వాళ్లు ఉన్నారు మాకు అని చెప్పుకోవడానికి ఉండదు. పాలిటిక్స్‌లో ‘మాజీ’ అయితే మీరు ఎవరండి అని అడిగే పరిస్థితి వస్తుంది. ఇది కూడా అలాంటిదే. ఫిష్ వెంకట్‌కి చాలా మంది హెల్ప్ చేశారు. కానీ రాలేదు అంటే.. ఎవరి బిజీ వారిది. రేపు నేను పోయినా ఎవరూ రారు. ఎందుకంటే.. నేను కూడా ఇండస్ట్రీలోని వారితో పెద్దగా కలవను. ఓ నలుగురైదుగురు సినిమా వాళ్లతో, మీడియా వాళ్లతో మాత్రమే నేను టచ్‌లో ఉంటాను.
Also Read- Rahul Sipligunj: మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. రాహుల్ సిప్లిగంజ్ కు కోటి రూపాయల నజరానా
ఫిష్ వెంకట్ బాడీని ఫిల్మ్ ఛాంబర్‌కు తీసుకురాకపోవడానికి అసోసియేషన్ మెంబర్ కాకపోవడం వల్లే అనే దానిలో నిజం లేదు. ఇక్కడ నాలుగైదు అసోసియేషన్స్ ఉంటాయి. మృత దేహాన్ని అక్కడ పెట్టేందుకు రెంట్ కట్టాల్సి ఉంటుంది. అసోసియేషన్ మెంబర్ అయితే వాళ్లు చూసుకుంటారు. ఒకవేళ కాకపోతే.. కుటుంబ సభ్యుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే, ఇది ఉచిత సేవ కాదు, ఎవరు చనిపోయినా, అక్కడకు తీసుకురావాలంటే.. అక్కడ రెంట్ కట్టాల్సి ఉంటుంది. అన్ని బాడీలను ఫిల్మ్ చాంబర్‌కు తీసుకురావడానికి అనుమతి ఉండదు. ముందు కుటుంబ సభ్యుల అనుమతి ఉండాలి. తర్వాత అసోసియేషన్ అనుమతి తీసుకోవాలి. అక్కడ రెంట్ కట్టాలి. ఇవన్నీ ఓకే అయిన తర్వాత అసోసియేషన్ చూసుకుంటుంది.
ఫిష్ వెంకట్ కుటుంబానికి సినీ పరిశ్రమ, ముఖ్యంగా పెద్ద హీరోలు మద్దతు ఇవ్వడానికి లేదా నివాళులర్పించడానికి రాలేదని వారి సినిమాలను బహిష్కరించాలని కొందరు పిలుపునిస్తున్నట్లుగా నా దృష్టికి కూడా వచ్చింది. కానీ ఆ మాట ఎవరైతే అంటారో వాళ్లే.. రేపు థియేటర్లలో ముందుంటారు. సినిమా హీరోల పట్ల ప్రజలకు అంత పిచ్చి ప్రేమ ఉంది. కాబట్టి.. బహిష్కరణలనేవి ఇక్కడ పాటించబడవు. ఫిష్ వెంకట్ మృతి విషయంలో నేను చెప్పదలచుకున్నది ఏంటంటే.. సరైన రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయకపోవడం, గత ఆరు నెలలుగా ఆయన ఇండస్ట్రీ వదిలి పెట్టి ఆస్పత్రిలోనే ఉండటం, ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరంగా ఉండటం, సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్లే.. స్టార్ హీరోలు ఎవరూ రాలేదు తప్పితే.. వేరే కారణం ఏమీ లేదు. నాకు ఆ ఫ్యామిలీ తెలుసు. ఆ ఫ్యామిలీకి నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను..’’ అని నట్టి కుమార్ చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు