Naga Vamsi: ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీలో ఉంటారు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాత నాగవంశీ. కాదు కాదు.. ఆయన మాటలే కాంట్రవర్సీగా మారుతుంటాయి. ఈ మధ్య దివంగత నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్‌తో జరిగిన ఇంటర్వ్యూపై ఏ విధంగా కాంట్రవర్సీ నెలకొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘గుంటూరు కారం’ సినిమా టైమ్‌లో కూడా ఆయన వ్యాఖ్యలు కాస్త కఠోరంగా అనిపించి, ఆ సినిమాను ట్రోల్ అయ్యేలా చేశాయి. ఇక ఇటీవల వచ్చిన ‘డాకు మహారాజ్’ మూవీ ప్రమోషన్స్‌లో కూడా ఆయన మాట్లాడిన మాటలు దుమారంగా మారాయి. నందమూరి హీరోలను అభిమానించే నాగవంశీ.. ఆ కుటుంబంలోని బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం అని చెబుతుంటారు.
Also Read- Betting Apps: బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షో.. రూ. 80 లక్షలు నష్టపోయిన బెట్టింగ్ బాధితుడు
అలా మెగాభిమానుల ఆగ్రహానికి గురవుతూ ఉండే నాగవంశీ, వారిని ప్రసన్నం చేసుకోవడానికి పవన్ కళ్యాణ్‌పై ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమని మాత్రం ఎక్కడా చెప్పలేదు. ఆయన సినిమా ఉందని తెలిసినా, పోటీకి సినిమా వదలడానికి కూడా నాగవంశీ వెనుకాడరు. పైకి మాత్రం, కళ్యాణ్‌గారి సినిమా ఉంటే మేము ఎందుకు వస్తాం. మరో డేట్ చూసుకుంటాం అంటూ అటెన్షన్‌ని బాగానే రాబడుతుంటారు. ప్రస్తుతం ఆయన నటించిన ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా విడుదలకు సిద్ధమైంది. మార్చి 28న విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర ప్రమోషన్స్‌ని చిత్రయూనిట్‌తో కలిసి నాగవంశీ నిర్వహిస్తున్నారు. పలు మీడియా సమావేశాలలో, అలాగే ఇంటర్వ్యూలలో ఆయన కూడా పాల్గొంటున్నారు.
ఇలా ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ నాగవంశీ ఏమన్నారని అనుకుంటున్నారు కదా! ఆ విషయంలోకి వస్తే.. ‘మీ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో 50వ సినిమా చేస్తున్నారని అనుకోండి. మీకు ఇద్దరు హీరోలు మాత్రమే ఆప్షన్ ఉంది. ఒకటి పవన్ కళ్యాణ్, రెండు జూనియర్ ఎన్టీఆర్. వీరిద్దరిలో ఎవరితో సినిమా చేస్తారు? అని చిత్ర హీరో సంతోష్ శోభన్ అడిగిన ప్రశ్నకు ఆయన అటు మెగా, ఇటు నందమూరి ఫ్యాన్స్ హర్ట్ కాకుండా సమాధానమిచ్చి.. పెద్ద కాంట్రవర్సీ అయ్యే ప్రశ్నకు సమయస్ఫూర్తితో సమాధానమిచ్చారు. ఇంతకీ నాగవంశీ ఏం చెప్పాడని అనుకుంటున్నారా?
Also Read- Gautham Ghattamaneni: గౌతమ్ యాక్టింగ్ ఇరగదీశాడు.. ఇంకో వారసుడు రెడీ!
‘‘కళ్యాణ్ గారు పాలిటిక్స్‌లో పెద్ద పెద్ద పొజిషన్‌కు వెళ్లాలని కోరుకోవాలి కానీ, ఇంకా ఆయనతో సినిమా చేయాలని కోరుకోకూడదు. ఆయన మన రాష్ట్రానికి ఏం చేస్తారు? దేశానికి ఏం చేస్తారు? అనేది కోరుకోవాలి. ఎందుకంటే, ఆయన ఆ పొజిషన్‌కు వెళ్లిపోయారు కాబట్టి. 50వ సినిమా అంటూ సితారలో జరిగితే.. అది తారక్ అన్నతోనే ఉండాలని కోరుకుంటాను.’’ అని నాగవంశీ తప్పించుకున్నాడు. అయితే, నెటిజన్లు మరీ ముఖ్యంగా కొందరు మెగాభిమానులు మాత్రం రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
ఇక ‘మ్యాడ్ స్క్వేర్’ విషయానికి వస్తే.. ‘మ్యాడ్’కి సీక్వెల్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, విష్ణు ఓఐ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాకు కళ్యాణ్ శంకర్ దర్శకుడు. శ్రీకర స్టూడియోస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. భారీ అంచనాల నడుమ మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు ఈ సినిమా సిద్ధమైంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు