Actor Mohanlal: భారతీయ సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నట దిగ్గజం, ‘సంపూర్ణ నటుడి’గా అభిమానులను అలరిస్తున్న మలయాళ నటుడు మోహన్‌లాల్‌ను (Actor Mohanlal) మరో ప్రతిష్టాత్మక అవార్డ్ వరించింది. కేంద్ర ప్రభుత్వం ఆయనను ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు-2023కి ఎంపిక చేసింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఎంపిక కమిటీ సిఫారసు మేరకు ఎంపిక చేసినట్టు కేంద్ర సమాచార, బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది.
మోహన్‌లాల్ సినీ ప్రయాణం అనేక తరాలకు ప్రేరణగా నిలుస్తుందని కేంద్రం ప్రశంసల జల్లు కురిపించింది. దిగ్గజ నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా భారతీయ సినిమాకు అందించిన విశేష సేవలకుగాను ఆయనకు ఈ గౌరవాన్ని అందిస్తున్నామని తెలిపింది. మోహన్‌లాల్ అసమాన అద్వితీయమైన నటన, బహుముఖ ప్రతిభ, నిరంతర కఠోర శ్రమ.. భారతీయ సినిమా చరిత్రలో ప్రమాణాలు నిలిచిపోయాయని కేంద్రం కొనియాడింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును 2025 సెప్టెంబర్ 23న 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల కార్యక్రమంలో మోహన్‌లాల్‌కు ప్రదానం చేయనున్నట్టు వివరించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వ శాఖ శనివారం ట్వీట్ చేసింది.
Read Also- Press Meet Cancel: రేపే భారత్‌తో మ్యాచ్.. ప్రెస్‌మీట్ రద్దు చేసుకున్న పాకిస్థాన్.. కారణం ఇదే!
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటనపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ, మోహన్‌లాల్‌కు అభినందనలు తెలిపారు. అందమైన కేరళ రాష్ట్రంలోని అడిపోలీ గడ్డ నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారని మెచ్చుకున్నారు. ఆయన నటన భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పిందని కొనియాడారు. మోహన్‌లాల్ నటనా వారసత్వం భారతీయ ప్రతిభను ఎల్లప్పుడూ ప్రేరేపిస్తూనే ఉంటుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు.
మరిచిపోలేని క్షణాలు: మోహన్‌లాల్
తనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ దక్కడంపై మోహన్‌లాల్ స్పందించారు. తన సినీ ప్రయాణంలో మరిచిపోలేని క్షణాల్లో ఇదొకటి అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ అవార్డు దక్కడం పట్ల చాలా ఆనందంగా ఉంది. అందరికీ ప్రేమతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదొక కలలా అనిపిస్తోంది. ఇంతటి గౌరవం వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు’’ అని ఆయన అన్నారు. కాగా, మోహన్‌లాల్ వివిధ భాషలలో కలిపి 350కి పైగా సినిమాల్లో నటించారు. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించారు. ఎన్నో మైలురాళ్లు అందుకున్నారు. కాగా, భారతీయ సినిమా రంగంలో అత్యున్నత గౌరవ పురస్కారమే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.ఈ నెల 23న జరగనున్న 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల వేడుకలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ఈ అవార్డును స్వీకరించనున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ అభినందనలు
ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ పురస్కారానికి ఎంపికైన ప్రముఖ నటుడు మోహన్ లాల్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఆయనకు ప్రతిష్టాత్మక అవార్డు దక్కడం సంతోషకరమని వ్యాఖ్యానించారు. మోహన్ లాల్‌కు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు. నటనా అభినయంలో సహజత్వానికి ప్రాధాన్యం ఇచ్చే నటుడాయన అంటూ పవన్ కళ్యాణ్ కొనియాడారు. కథానాయకుడిగా విభిన్న పాత్రలు పోషించారని గుర్తుచేసుకున్నారు. ఐదు జాతీయ అవార్డులు పొందాదని మెచ్చుకున్నారు. తెలుగులో ఆయన నటించిన సినిమాలు తక్కువేగానీ, అనువాద సినిమాల ద్వారా ఇక్కడి ప్రేక్షకులను మెప్పించారని అన్నారు. ఇద్దరు, కంపెనీ, జనతా గ్యారేజ్ వంటి సినిమాలు తెలుగు వారికి బాగా గుర్తుండిపోతాయని అన్నారు. మోహన్ లాల్ మరిన్ని విభిన్న పాత్రలు పోషించాలని ఆకాంక్షిస్తున్నట్టు పవన్ చెప్పారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.