Mohan Babu University: మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థుల నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేయడం, అలాగే ఆదాయాన్ని వెల్లడించకపోవడంతో పాటు, విద్యార్థుల హాజరు విషయంలో సరైన వివరాలు లేకపోవడం, విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇవ్వకుండా వేధిస్తూ అంటూ వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడిదో పెద్ద కాంట్రవర్సీగా (Mohan Babu University Controversy) మారింది. వీటన్నింటిని గమనించి రూ.15 లక్షల జరిమానా విధించినట్లుగా, అలాగే విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన సుమారుగా రూ.27 కోట్లను వెంటనే తిరిగి చెల్లించాలని గత నెల 17న ఈ యూనివర్సిటీపై ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఆదేశాలు జారీ చేయడమే కాకుండా, ఆ వివరాలను వెబ్‌సైట్‌లో సైతం ఉంచింది. దీంతో మరోమారు మోహన్ బాబు ఫ్యామిలీ వార్తలలో హైలెట్ అవుతోంది. అయితే ఈ వార్తలపై మోహన్ బాబు యూనివర్సిటీ ప్రో-ఛాన్సలర్ మంచు విష్ణు (Manchu Vishnu) అధికారికంగా ఓ ప్రకటనను విడుదల చేశారు. కొద్దిమంది సభ్యులతో ఏర్పడిన కమిటీ, ఇబ్బందులు ఎదుర్కొంటున్న అనేక విశ్వవిద్యాలయాల అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన సమయంలో స్వల్ప పరిపాలన అంశాలను పెంచి చూపి అనవసర వివాదాన్ని సృష్టించడం దురదృష్టకరమని అన్నారు. APHERMC యొక్క సదరు సిఫార్సులకు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయానికి అనుకూలంగా ‘స్టే’ ఉత్తర్వును హైకోర్టు వారు జారీ చేసి ఉండగా, APHERMC వారు కోర్టు ఉత్తర్వును ధిక్కరించి పోర్టల్లో పెట్టడం.. కోర్టు ఉత్తర్వును ధిక్కరించినట్లేనని ఆయన చెప్పుకొచ్చారు. ఇటువంటి నిరాధారమైన వార్తలను నమ్మవద్దని తల్లిదండ్రులకు, మీడియాకు, భాగస్వాములందరికీ తెలియజేస్తున్నామని ఆయన ఈ ప్రకటనలో వెల్లడించారు.
మంచు విష్ణు విడుదల చేసిన లేఖ యథావిధిగా..
‘‘మోహన్ బాబు విశ్వవిద్యాలయానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ (APHERMC) చేసిన కొన్ని సిఫార్సుల గురించి వివిధ మీడియా మాధ్యమాలలో ప్రచారమవుతున్న వార్తలను ఉద్దేశించి ఈ ప్రకటన జారీ చేయబడింది. మోహన్ బాబు విశ్వవిద్యాలయం ఈ సిఫార్సులను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అవి కేవలం సిఫార్సులు మాత్రమేనని మరియు ఆ సిఫార్సులు ప్రస్తుతం గౌరవనీయ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో విచారణలో (సబ్-జ్యుడిస్) ఉన్నాయని దయచేసి గమనించగలరు. ఈ విషయాన్ని పరిశీలించిన హైకోర్టు, APHERMC యొక్క సదరు సిఫార్సులకు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయానికి అనుకూలంగా ‘స్టే’ ఉత్తర్వును హైకోర్టు వారు జారీ చేసి ఉండగా, APHERMC వారు కోర్టు ఉత్తర్వును ధిక్కరించి పోర్టల్లో పెట్టడం దురదృష్టకరం. APHERMC చేసిన సిఫార్సులు సరికాదని మోహన్ బాబు విశ్వవిద్యాలయం గట్టిగా విశ్వసిస్తోంది మరియు ఈ విషయంపై విచారణ జరుపుతున్న గౌరవనీయ హైకోర్టు న్యాయం చేకూరుస్తుందని విశ్వాసంతో ఉంది. విషయాన్ని తీవ్రతరం చేసి, విశ్వవిద్యాలయ ప్రతిష్ఠను దిగజార్చడానికి ఉద్దేశపూర్వకంగా ఎంపిక చేసిన సమాచారాన్ని మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి నిరాధారమైన వార్తలను నమ్మవద్దని తల్లిదండ్రులకు, మీడియాకు మరియు మా భాగస్వాములందరికీ తెలియజేస్తున్నాము.
Also Read- War 2 OTT: అఫీషియల్.. ఇంకొన్ని గంటల్లోనే ఓటీటీలోకి ‘వార్ 2’
ప్రభుత్వ లేదా ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు సాధ్యపడని రికార్డు
మోహన్ బాబు విశ్వవిద్యాలయం నేడు భారతదేశంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థలలో ఒకటిగా నిలుస్తూ, రాయలసీమను ఉన్నత విద్యకు గుర్తింపు పొందిన కేంద్రంగా మారుస్తోంది. గత కొన్నేళ్లుగా, MBU ఆంధ్ర ప్రదేశ్లోని విద్యార్థులకు అత్యధిక ప్లేస్మెంట్లు మరియు వేతన ప్యాకేజీలను స్థిరంగా సాధిస్తోంది. ఇది దేశంలోని అనేక ప్రభుత్వ లేదా ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు సాధ్యపడని రికార్డు. 1992లో శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ స్థాపించబడినప్పటి నుండి, ఈ విశ్వవిద్యాలయం బలమైన సామాజిక నిబద్ధతను కొనసాగిస్తోంది. ఎంతోమందికి ఉచిత విద్యను అందించడం, సాయుధ దళాలు మరియు పోలీసు సిబ్బంది పిల్లలకు పూర్తి స్కాలర్షిప్పులు ఇవ్వడం మరియు అనాథలను దత్తత తీసుకుని వారికి పూర్తి విద్య మరియు సంరక్షణ అందించడం వంటివి చేస్తోంది. విద్య మరియు సమాజ సేవలో మా సహాయ సహకారాలు బహిరంగ రికార్డులలో ఉన్నప్పటికీ, దురుద్దేశంతో కొంతమంది పదే పదే మా ప్రయత్నాలను విమర్శిస్తున్నారు. మా అకడమిక్ శ్రేష్ఠత అంతర్జాతీయ స్థాయిలో ప్రతిబింబిస్తున్నది. QS 100 ర్యాంకు పొందిన పెన్ స్టేట్ యూనివర్శిటీ (USA)తో జాయింట్ డిగ్రీ ప్రోగ్రామును ప్రవేశపెట్టిన భారతదేశపు మొదటి విశ్వవిద్యాలయం MBU. మాకు RWTH ఆకెన్ విశ్వవిద్యాలయం (జర్మనీ) మరియు విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం (USA)తో కూడా అవగాహన ఒప్పందాలు ఉన్నాయి. ఈ భాగస్వామ్యాల ద్వారా విద్యార్థులు భారతదేశంలో తమ డిగ్రీలను కొనసాగిస్తూనే విదేశి యూనివర్శిటిలలో సెమిస్టర్ మరియు పరిశోధన కార్యక్రమాలను అభ్యసించడానికి వీలు కలుగుతుంది.
ఎలాంటి తప్పు జరగలేదు
కొద్దిమంది సభ్యులతో ఏర్పడిన కమిటీ, ఇబ్బందులు ఎదుర్కొంటున్న అనేక విశ్వవిద్యాలయాల అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన సమయంలో స్వల్ప పరిపాలన అంశాలను పెంచి చూపి అనవసర వివాదాన్ని సృష్టించడం దురదృష్టకరం. విచారణ సమయంలో మోహన్ బాబు యూనివర్శిటీ బృందం మాకు పూర్తిగా సహకరించిందని అదే కమీషన్ తన నివేదికలో పేర్కొనడం ఎలాంటి తప్పు జరగలేదనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది.
మాకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ వస్తున్న వేలాది మంది తల్లిదండ్రులకు, విద్యార్థులకు హృదయపూర్వక ధన్యవాదములు. మా గౌరవనీయ ఛాన్సలర్ డాక్టర్ ఎమ్. మోహన్ బాబు గారి మార్గదర్శకత్వంలో మేము ప్రపంచ స్థాయి సమగ్ర విద్యను అందిస్తూ యువతను శక్తివంతం చేసే ప్రయత్నాన్ని కొనిసాగిస్తున్నామని తెలియజేస్తున్నాము.
విష్ణు మంచు
ప్రో-ఛాన్సలర్,
మోహన్ బాబు యూనివర్శిటీ’’
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
