Megastar Chiranjeevi: ఇప్పటి వరకు హీరోయిన్స్ డీప్ ఫేక్ (Deepfake) బారిన పడటం గురించి అంతా విన్నారు. రష్మిక మందన్నా (Rashmika Mandanna) నుంచి బాలీవుడ్‌కు చెందిన హీరోయిన్లు ఎందరో డీప్ ఫేక్ బారిన పడి, ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇప్పుడు హీరోల వంతు వచ్చినట్లుగా ప్రస్తుత పరిస్థితులు తెలియజేస్తున్నాయి. అందులోనూ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) వంటి హీరోపై డీప్ ఫేక్ వీడియోలు తయారు చేసి, సోషల్ మాధ్యమాలలో, అశ్లీల వైబ్ సైట్లలో వైరల్ చేస్తున్నారంటే.. పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో అభివృద్ధి బాటలో ఉన్నామని అంతా అనుకుంటున్నారు. కానీ, ఎంత అభివృద్ధి ఉందో.. అంత వినాశనం కూడా ఉందని ఇలాంటి వీడియోలను చూసినప్పుడు మరింతగా స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఈ టెక్నాలజీతో సెలిబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉందని ఇప్పటికే ఎన్నో సంఘటనల ద్వారా వెల్లడవుతోంది.
Also Read- Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి
చిరంజీవి ఆగ్రహం
ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి డీప్ ఫేక్ బారిన పడ్డారు. చిరంజీవి గౌరవ మర్యాదలకు భంగం కలిగించేలా ఆయన ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల కంటెంట్‌ను క్రియేట్ చేసి సోషల్ మీడియాలలో వైరల్ చేస్తున్నారు. ఇది గమనించిన చిరంజీవి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తనపై ఇలాంటి కంటెంట్ రావడం గమనించిన చిరు.. వెంటనే సైబర్ క్రైమ్‌ని సంప్రదించారు. తన పేరు ప్రతిష్టలను దిగజార్చేలా కొందరు పని గట్టుకుని చేస్తున్న ఈ వీడియోలపై ఆయన ఫైర్ అవుతూ.. సీపీ సజ్జనార్ (CP Sajjanar)కు కూడా ఆయన ఫిర్యాదు చేశారు. మెగాస్టార్, చిరు, అన్నయ్య వంటి పేర్లను ఈ వీడియోలకు వాడుతూ, చాలా అసభ్యకరంగా తనపై వీడియోలు చిత్రీకరిస్తున్నారని, వెంటనే యాక్షన్ తీసుకోవాలని కొన్ని లింక్స్‌ను ఆయన సైబర్ క్రైమ్‌కు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. చిరంజీవి వంటి వ్యక్తి స్వయంగా ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ కూడా అలెర్టయింది. వెంటనే యాక్షన్‌లోకి దిగి, దీని వెనుక ఉన్నవారిని కనిపెట్టే పనిలో పోలీసులు దర్యాప్తు ముమ్మురం చేశారనేలా సమాచారం అందుతోంది.
Also Read- Haryana: సిస్టర్స్ డీప్ ఫేక్ వీడియోలు.. సోదరుడు ఆత్మహత్య.. వెలుగులోకి షాకింగ్ నిజాలు
ప్రత్యేక టీమ్ ఏర్పాటు
చిరంజీవి ఫిర్యాదుపై సీపీ సజ్జనార్ స్పందిస్తూ.. ‘‘చిరంజీవి డీప్ ఫేక్ కేసులో విచారణ చేస్తున్నాం. అశ్లీలంగా మార్ఫింగ్ చేసిన కేటుగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. కచ్చితంగా దీని వెనుక ఎవరు ఉన్నా, మూలాల్లోకి వెళ్లి మరీ నిందితులను అరెస్ట్ చేస్తాం. ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలపై సెలబ్రిటీల కేసులు పెరిగే అవకాశం ఉంది. దీనిపై ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి విచారణ చేస్తాం. త్వరలో నిందితులను పట్టుకుని అన్ని వివరాలు వెల్లడిస్తాం’’ అని అన్నారు. ఇదిలా ఉంటే.. ఇది ఒక్క చిరంజీవి సమస్యే కాదు.. ఇవాళ చిరంజీవి ఫేస్ చేశారు. రేపు ఇంకో హీరోపై ఇలాంటి వీడియోలు వచ్చే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి.. ఈ విషయంలో ఇండస్ట్రీ అంతా కలిసి వచ్చి, ఈ సమస్యను దూరం చేసుకోవాలి. ఇలాంటివి ఉంటాయనే, చిరంజీవి ఇటీవల కోర్టును ఆశ్రయించగా.. ఇకపై తన పేరు, ఫొటో, వాయిస్ వంటి వాటిని ఎవరైనా అనుమతి లేకుండా అడ్డగోలుగా వాడితే.. వారిపై కఠిన చర్యలు తీసుకునేలా కోర్టు ఇంటరిమ్ ఇంజంక్షన్ మంజూరు చేసింది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
