Manchu Manoj: మంచు ఫ్యామిలీలో అందరూ ఇష్టపడే హీరో ఎవరయ్యా? అంటే, వెంటనే వినవచ్చే పేరు మంచు మనోజ్. గత కొంత కాలంగా మంచు మనోజ్ ఎటువంటి పరిస్థితులను ఫేస్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రి మోహన్ బాబు (Manchu Mohan Babu), అన్న మంచు విష్ణు (Manchu Vishnu) లతో గొడవలు పడుతూ.. కుటుంబ పరువును బజారులో పెట్టేశారు. మంచు మనోజ్‌తో వేగలేక మోహన్ బాబు కూడా కామ్‌గా ఉంటున్నారు. అలాంటి మంచు మనోజ్.. తన తండ్రి, అన్న చేసిన ‘కన్నప్ప’ సినిమా విషయంలో ముందు కాస్త నెగిటివ్‌గా మాట్లాడినా, ఆ తర్వాత ఒక్కసారిగా మనసు మార్చుకున్నారు. ఆ సినిమాలో చాలా మంది స్టార్స్ ఉన్నారని, వారి కోసమైనా ఈ సినిమా సక్సెస్ సాధించాలని కోరారు. అప్పటి నుంచి మళ్లీ మంచు మనోజ్ తన ఫ్యామిలీతో గొడవ పడిన సందర్భాలు లేవు. ప్రస్తుతం అంతా కామ్‌గానే నడుస్తుంది. ప్రస్తుతం మంచు మనోజ్ కూడా తన సినిమాలపై దృష్టి సారించాడు.
Also Read- Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ ముందు హాజరైన విజయ్ దేవరకొండ
వాస్తవానికి మంచు మనోజ్ చేసింది తక్కువ సినిమాలే అయినా, హీరోగా మంచి పేరును సొంతం చేసుకున్నారు. అలాగే, యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తూ మల్టీ టాలెంటెడ్ హీరోగానూ ఆయన పేరు గడించారు. అలాంటి మంచు మనోజ్ సడెన్‌గా సినిమాలు బంద్ చేయడంతో ఆయన ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. చాలా గ్యాప్ తర్వాత శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో ‘అహం బ్రహ్మస్మి’ టైటిల్‌తో ఓ సినిమా ప్రకటించి, పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కానీ ఆ సినిమా కూడా ఏమైందో తెలియదు. ఇప్పుడు లైన్‌లో ఉందో, లేదో కూడా తెలియదు. ఆ సినిమా ఓపెనింగ్ తర్వాత వరుసగా రెండు మూడు సినిమాలు ప్రకటించినా, ఏదీ కార్యరూపం దాల్చలేదు. మళ్లీ గ్యాప్. ఈ గ్యాప్‌లో గొడవలు, అల్లర్లు.. రచ్చ రచ్చ. ఇప్పుడా గొడవలకు స్వస్తి చెప్పి.. పూర్తిస్థాయిలో సినిమాలు చేసేందుకు రెడీ అయ్యారు. ఇంకా చెప్పాలంటే రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు.
ఈ రెండో ఇన్నింగ్స్‌లో ఆయన చేసిన ‘భైరవం’ చిత్రం ఇటీవల విడుదలై మంచి స్పందనను రాబట్టుకుంది. ‘భైరవం’ (Bhairavam) చిత్రం మల్టీ హీరోల చిత్రం. అలాగే సూపర్ హీరో తేజ సజ్జా హీరోగా చేస్తున్న ‘మిరాయ్’లో మంచు మనోజ్ విలన్‌గా ఓ విలక్షణమైన పాత్రను చేస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత మంచు మనోజ్ సోలో హీరోగా చేయబోతున్న సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది. సినిమా అనౌన్స్‌మెంట్ మాత్రమే కాదు.. టైటిల్ కూడా ప్రకటించారు. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ తన పాత్రలను, స్క్రిప్ట్‌లను సెలెక్టివ్‌గా ఎంచుకుంటూ ముందుకెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఓ హిస్టారికల్ యాక్షన్ డ్రామాకు ఓకే చెప్పారు.
Also Read- Allu Arjun: ఆ వీడియోతో మోసపోయిన అల్లు అర్జున్.. వెలుగులోకి సంచలన నిజాలు
వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వంలో మోతుకూరి భరత్, నల్లగంగుళ వెంకట్ రెడ్డి నిర్మించనున్న ఈ హిస్టరీ, రెబెలియన్‌తో కూడిన చిత్రం.. తెలుగు సినిమాకి ఓ మైల్ స్టోన్ కానుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. 1897 నుంచి 1922 వరకూ జరిగే కథతో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి ‘డేవిడ్ రెడ్డి’ (David Reddy) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మంచు మనోజ్ ఇప్పటి వరకు ఎన్నడూ చూడని పవర్ఫుల్ రోల్‌లో కనిపించనున్నారని.. కుల వ్యవస్థ ఒత్తిడుల నుంచి తిరగబడి, బ్రిటిష్ సామ్రాజ్యంపై తిరుగుబాటు చేసిన ఓ రెబల్ కథ ఇదని మేకర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌లో ఉన్న ఈ చిత్ర టైటిల్ పోస్టర్‌ని బుధవారం మేకర్స్ విడుదల చేశారు. టైటిల్ డిజైన్‌ని మనోజ్ ఫేస్‌గా మార్చడం క్రియేటివ్‌గానూ, ఆసక్తికరంగానూ ఉంది. దీనికి ‘మద్రాస్ ప్రెసిడెన్సీలో పుట్టాడు, ఢిల్లీలో పెరిగాడు, ఇప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికిస్తున్నాడు’ అనే ట్యాగ్‌లైన్.. ఈ సినిమా ఏ రేంజ్‌లో రూపుదిద్దుకోనుందో తెలియజేస్తోంది. త్వరలోనే ఇతర వివరాలను తెలియజేస్తామని ఈ సందర్భంగా నిర్మాతలు తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు