Krishna Vamsi: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు సమాధి (Alluri Samadhi)ని సందర్శించారు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ (Director Krishnavamsi), ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాధ్ (Yandamoori Veerendranath). ఈ సందర్భంగా కృష్ణవంశీ భావోద్వేగానికి గురయ్యారు. విశేషం ఏమిటంటే.. యండమూరితో కలిసి దర్శకుడు కృష్ణవంశ ఈ సోమవారం అనకాపల్లి జిల్లాలోని గోలుగొండ మండలం మేజర్ పంచాయితీ ఏజెన్సీకి చెందిన లక్ష్మీపురం గ్రామానికి వెళ్లారు. అక్కడే ‘నేను సైతం చారిటబుల్ ట్రస్ట్’ ఫౌండేషన్ వ్యవస్థాపకుడైన కుసిరెడ్డి శివతో కలిసి అల్లూరి సీతారామరాజు, గంటం దొర సమాధులు ఉన్న పార్కును సందర్శించి, అల్లూరి సమాధికి ప్రత్యేకంగా నివాళులు అర్పించారు.
అనంతరం యండమూరి వీరేంద్రనాధ్ మాట్లాడుతూ.. అల్లూరి నడయాడిన ఈ ప్రదేశానికి రావడం ఎంతో గర్వంగా ఉంది. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ తెలిసిన కథే. కానీ కృష్ణవంశీ వంటి గొప్ప దేశభక్తుడు, అల్లూరి సమాధి వద్ద మోకాళ్లపై నిలబడి శిరస్సు వంచి నమస్కారం చేయడం చూసి నాకు ఎంతో గొప్పగా అనిపించింది. అల్లూరిపై ఆయనకున్న భక్తి భావానికి ఇది నిదర్శనం. కృష్ణవంశీని ఒక్కసారిగా అలా చూసి, ఆయన దర్శకత్వం వహించిన ‘ఖడ్గం’ సినిమా గుర్తొచ్చింది. అల్లూరి చరిత్ర ఎప్పటికీ నిలిచే ఉంటుంది. అలాగే దేశభక్తి నిండిన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు కృష్ణవంశీ కూడా ఎప్పటికీ గుర్తింపును కలిగి ఉంటారని అన్నారు.

దర్శకుడు కృష్ణవంశీ మాట్లాడుతూ.. ‘‘ఇది నాకు దక్కిన ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఎన్నో ఏళ్లుగా అల్లూరి నడయాడిన ప్రాంతాలను సందర్శించాలనే తపన, కోరిక ఉండేవి. నాకొక డ్రీమ్ ఇది. నా కళ ఇన్నాళ్లకు నెరవేరింది. అప్పట్లో గోకరాజు నారాయణ రావు అనే ఒక పత్రిక ఎడిటర్ అల్లూరి చరిత్రపై 20 సంవత్సరాలు రీసెర్చ్ చేసి ‘ఆకుపచ్చ సూర్యోదయం’ అనే పుస్తకం రాశారు. అది చదివిన తర్వాత అల్లూరి సీతారామరాజు పోరాటం, ఆ పోరాటాన్ని కొనసాగించిన ప్రదేశాలను ఎలాగైనా సందర్శించాలనే పట్టుదల పెరిగింది. ఎప్పటికప్పుడు ఏదో ఒక వర్క్‌తో వాయిదా పడుతూనే వచ్చింది. కానీ ఈసారి ఆ అవకాశాన్ని వదులుకోలేదు. అందులోనూ యండమూరి వంటి గొప్పవారితో నాకు ఈ అవకాశం లభించడం ఎప్పటికీ మరిచిపోలేను. ఇప్పుడు చెబుతున్నాను.. అవకాశం ఉన్నంత మేర అల్లూరి చరిత్రతో ఒక మంచి చిత్రాన్ని తెరకెకెక్కించడానికి ప్రయత్నిస్తాను’’ అని తెలిపారు.
Also Read- Betting App Owners: బెట్టింగ్ యాప్స్ కేసులో అదిరిపోయే ట్విస్ట్.. ఏకంగా 19మందిపై..
అల్లూరి, గంటం దొర సమాధులకు నివాళులను అర్పించిన అనంతరం యండమూరితో కలిసి ‘నేను సైతం చారిటబుల్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో కొయ్యురు మండలంలో నివాసం ఉంటున్న అల్లూరి ప్రధాన అనుచరుడు గంటం దొర కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి వస్త్రాలు పంపిణీ చేశారు కృష్ణవంశీ. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు