Kichcha Sudeepa: కన్నడ చిత్ర పరిశ్రమకు గ్లోబల్ గుర్తింపు తెచ్చిన అతికొద్ది మంది హీరోల్లో కిచ్చా సుదీప్ ఒకరు. కేవలం కన్నడలోనే కాకుండా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారాయన. అయితే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో సుదీప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇతర ఇండస్ట్రీల స్టార్ హీరోల ప్రవర్తనపై ఆయన బహిరంగంగానే తన అసహనాన్ని, ఆవేదనను వ్యక్తం చేశారు. సుదీప్ మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీల మధ్య ఉండాల్సిన పరస్పర సహకారం కేవలం ఒక వైపు నుంచే జరుగుతోందని అభిప్రాయపడ్డారు. ‘నేను తెలుగులో ‘ఈగ’, హిందీలో ‘దబాంగ్ 3’, తమిళంలో ‘పులి’ వంటి చిత్రాల్లో నటించాను. కొన్ని సినిమాల్లో అతిథి పాత్రలు చేశాను. మరికొన్ని సినిమాలకు అయితే అసలు రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదు. కేవలం ఆయా హీరోలతో, దర్శకులతో ఉన్న స్నేహం కోసమే పనిచేశాను’ అని గుర్తు చేశారు.
Also Read- iBomma Ravi: రవి ప్రహ్లాద్‌ని పిలిపించిన అధికారులు.. ఐ బొమ్మ రవి కేసులో కీలక అప్డేట్!
మేము అడిగినా ఎందుకు రావడం లేదు?
నిజానికి సౌత్ సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా లెవల్‌లో దూసుకుపోతున్నాయి. కానీ కన్నడ సినిమాల విషయానికి వచ్చేసరికి ఇతర భాషల స్టార్స్ అంతగా ఆసక్తి చూపడం లేదని సుదీప్ వాపోయారు. ‘మా సినిమాల్లో చిన్న పాత్రలు లేదా అతిథి పాత్రలు చేయమని నేను స్వయంగా ఇతర ఇండస్ట్రీ స్టార్లను అడిగాను. కానీ ఎవరూ ముందుకు రాలేదు’ అని సుదీప్ బాంబు పేల్చారు. ఇండస్ట్రీల మధ్య ‘గివ్ అండ్ టేక్’ పాలసీ ఉండాలని, కానీ అది ఇప్పుడు లోపించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కన్నడ నటులు ఇతర భాషల్లోకి వెళ్లి సపోర్ట్ చేస్తున్నప్పుడు, ఇతర భాషా నటులు కన్నడ పరిశ్రమను ఎందుకు చిన్నచూపు చూస్తున్నారనేది ఆయన ప్రశ్న.
Also Read- Aadi Saikumar: ‘శంబాల’ సక్సెస్ జోష్.. హిట్ బ్యానర్‌లో ఆదికి బంపరాఫర్!
సుదీప్ ఆవేదన వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి?
కన్నడ సినిమా అంటే ఒకప్పుడు కేవలం ఆ రాష్ట్రానికే పరిమితం అనుకునేవారు. కానీ ‘KGF, కాంతార’ వంటి సినిమాల తర్వాత సీన్ మారిపోయింది. ఇప్పుడు కన్నడ సినిమాలు కూడా వందల కోట్లు వసూలు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇతర భాషా స్టార్స్ కూడా కన్నడ సినిమాల్లో కనిపిస్తే, ఆ మార్కెట్ మరింత పెరుగుతుందని సుదీప్ భావిస్తున్నారు. స్నేహం కోసం తాము ఎంతైనా తగ్గుతామని, మరి అవతలి వారు ఎందుకు తగ్గడం లేదని ఆయన అడిగిన ప్రశ్న ఇప్పుడు చాలా మంది స్టార్ హీరోలకు తగిలేలా ఉంది. సుదీప్ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ‘సుదీప్ చెప్పింది అక్షర సత్యం.. స్నేహం అంటే ఇద్దరి వైపు ఉండాలి’ అని కొందరు అంటుంటే.. ‘స్టార్ హీరోలు డేట్స్ అడ్జస్ట్ చేయలేక రాకపోయి ఉండొచ్చు’ అని మరికొందరు సర్దిచెబుతున్నారు. ఏది ఏమైనా, తన మనసులోని మాటను మొహమాటం లేకుండా చెప్పే సుదీప్ ధైర్యాన్ని మాత్రం అందరూ మెచ్చుకుంటున్నారు. సినిమాకి భాషా ఎల్లలు లేవని చెప్పుకునే ఈ రోజుల్లో, సుదీప్ లేవనెత్తిన ఈ పాయింట్ చాలా సీరియస్ అయింది. మరి కిచ్చా కామెంట్స్ పై ఇతర ఇండస్ట్రీల బడా స్టార్స్ ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

