Kantara Chapter 1: కన్నడ చిత్రం ‘కాంతార ఛాప్టర్ 1’ బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తున్న సంచలనం దేశవ్యాప్తంగా సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఊహకందని రీతిలో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ చిత్రం, ఆల్‌టైమ్ రికార్డులను బద్దలు కొడుతూ ముందుకు దూసుకుపోతోంది. మైథాలజీ, జానపద కథనం, ఉత్కంఠభరితమైన యాక్షన్ అంశాల మేళవింపుతో రూపొందిన ఈ దృశ్య కావ్యం.. నాల్గవ వారం కూడా ప్రేక్షకుల ఆదరణను అందుకుంటోంది. దేశవ్యాప్తంగా పలు థియేటర్లలో ఇప్పటికీ హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తుండటం ఈ సినిమా ప్రభావాన్ని తెలియజేస్తోంది. హోంబలే ఫిలిమ్స్ (Hombale Films) వంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ నిర్మించిన ఈ మాగ్నమ్ ఓపస్.. ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల పరంగా చరిత్ర సృష్టించింది. ఇప్పటికే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రూ. 818 కోట్ల మార్కును దాటి సరికొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పింది. దీనితో, ఈ సంవత్సరం అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా ‘కాంతార ఛాప్టర్ 1’ అగ్రస్థానంలో నిలిచింది.
Also Read- Karimnagar: నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ షాపుల దందా.. ఫార్మసిస్ట్ లేకుండా జోరుగా మందుల విక్రయాలు!
డబ్బింగ్ సినిమాగా సరికొత్త రికార్డ్
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఈ చిత్రం సాధించిన విజయం అసాధారణమైనదనే చెప్పుకోవాలి. ఇక్కడి ప్రేక్షకుల ఆదరణతో, ‘కాంతార ఛాప్టర్ 1’ (Kantara Chapter 1) కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 110 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి, ఒక డబ్బింగ్ సినిమాగా సరికొత్త రికార్డును లిఖించింది. ‘KGF ఛాప్టర్ 2’ (KGF Chapter 2) తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయిలో వసూళ్లు సాధించిన డబ్బింగ్ చిత్రం ఇదే కావడం విశేషం. ఈ అద్భుతమైన విజయం రిషబ్ శెట్టి నటనకు, దర్శకత్వ ప్రతిభకు తెలుగు ప్రేక్షకులు ఇచ్చిన పట్టాభిషేకం అనడంలో సందేహం లేదు. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ చిత్ర దూకుడు కొనసాగుతోంది. అమెరికాలో ఇప్పటికే 5 మిలియన్ల (సుమారు రూ. 40 కోట్ల) మార్కుకు చేరువలో ఉన్న ఈ సినిమా, అంతర్జాతీయ స్థాయిలోనూ తన ప్రభావాన్ని చూపుతోంది.
ఇంగ్లీష్ డబ్ వెర్షన్ వస్తోంది
ఈ విజయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి, చిత్ర నిర్మాతలు అక్టోబర్ 31న ఇంగ్లీష్ డబ్ వెర్షన్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. షార్ప్ రన్‌టైమ్‌తో రాబోతున్న ఈ ఇంగ్లీష్ వెర్షన్, విదేశీ ప్రేక్షకులను సైతం బలంగా ఆకర్షించి, కలెక్షన్లను మరింత పెంచే అవకాశం ఉందని చిత్రయూనిట్ అభిప్రాయపడుతోంది. రిషబ్ శెట్టి (Rishab Shetty) టేకింగ్, విజువల్స్ ప్రపంచ సినిమా అభిమానులకు ఒక గొప్ప అనుభూతిని అందిస్తున్నాయని విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. తాజాగా ఈ సినిమాపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరుతుందని ట్రేడ్ నిపుణులు సైతం చెబుతున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
