Dragon: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పేరు వినబడితే చాలు, కొందరికి పూనకాలు వస్తాయి. ఈ పేరంటే వారికి అంత ఇష్టం. అందుకే సోషల్ మీడియాలో ఎన్టీఆర్‌ని ఎవరైనా చిన్నమాట అన్నా వారు ఓ మోస్తరు యుద్ధమే ప్రకటిస్తారు. తద్వారా ఎన్టీఆర్‌పై తమ ప్రేమను అలా చూపిస్తుంటారు. ఆయన కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వస్తే.. ఇక వారిని ఆపడం ఎవరితరం కాదు. ఆ అప్డేట్‌తో సోషల్ మీడియా వేడెక్కి, బ్లాస్ట్ అయ్యే వరకు వారి మైండ్‌లో నుంచి ఆ అప్డేట్ పోదు. అట్టా ఉంటది ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తోటి. ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ ‘వార్ 2’ మూవీ షూటింగ్‌కు గ్యాప్ ఇచ్చి, ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వేచి చూస్తున్న ‘డ్రాగన్’ షూట్‌లో జాయిన్ అయ్యేందుకు కర్ణాటకకు బయలు దేరారు.
Also Read- Pravasthi Aaradhya: సింగర్ సునీత పై సంచలన ఆరోపణలు చేసిన ప్రవస్తి ఆరాధ్య
మాస్ యాక్షన్ ఎపిక్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమాపై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలను పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్‌పైకి వెళుతుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఆ సమయం వచ్చేసింది. ఈ సినిమా షూట్‌లో పాల్గొనేందుకు ఎన్టీఆర్ ఆల్రెడీ కర్ణాటకకు చేరుకున్నారు. ఆ విజువల్స్ ఆదివారం సోషల్ మాధ్యమాలలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రశాంత్ నీల్‌తో సముద్రపు ఒడ్డున ఎన్టీఆర్ సంభాషిస్తున్న ఫొటో ఒకటి మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. ఈ ఫొటోతో సోషల్ మీడియాని ఫ్యాన్స్ తగలెట్టేస్తున్నారు. ఇది కదా మాకు కావాల్సింది అంటూ లైక్స్, షేర్స్‌తో డ్రాగన్ పేరును వైరల్ చేస్తున్నారు.
Two MASS ENGINES ready to wreck it all from tomorrow 💥💥#NTRNeel will shake the shorelines of Indian cinema 🔥🔥
MAN OF MASSES @tarak9999 #PrashanthNeel @MythriOfficial @NTRArtsOfficial @NTRNeelFilm @TSeries @tseriessouth pic.twitter.com/psHgfYWuF1
— Mythri Movie Makers (@MythriOfficial) April 21, 2025
ఈ పిక్ చూసిన ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవంటే నమ్మాలి మరి. ఎన్టీఆర్ ఈ సినిమా షూట్‌లో ఏప్రిల్ 22 నుంచి పాల్గొంటారు. ఈలోపు దర్శకుడితో చేస్తున్న ముందస్తు సంభాషణ చూస్తుంటే, ఈ సినిమా ఓ రేంజ్‌లో తెరకెక్కబోతుందనేది అర్థమవుతుంది. ఈ కాంబోపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే అనేలా ఈ పిక్ గురించి ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి జస్ట్ మాట్లాడుకుంటున్న పిక్‌కే ఇలా మంట పెట్టేస్తుంటే.. నిజంగా సినిమా షూటింగ్‌కు సంబంధించిన పిక్ వస్తే, ఇక సునామీ పక్కా అనేలా ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్స్, ఈ సినిమాపై వారి నమ్మకాన్ని తెలియజేస్తున్నాయి. ఆ నమ్మకాన్ని నిజం చేసేలా, చాలా గ్రాండియర్‌గా, హై ఓల్టేజ్ యాక్షన్‌తో ఈ సినిమాను ప్రశాంత్ నీల్ రూపొందించబోతున్నారు.
ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై నందమూరి కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు భారీ బడ్జెట్‌తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. వీరితో పాటు ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ చిత్రంలో భాగం కానున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు