AB4: సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు కుమారుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న కొడుకు జయ కృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni) హీరోగా అరంగేట్రం చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను డైరెక్ట్ చేసే దర్శకుడు ఎవరో కూడా అధికారికంగా ప్రకటన వచ్చేసింది. అలాగే ఈ సినిమాను నిర్మించేవారి, సమర్పించేవారి వివరాలు కూడా అధికారికంగా వచ్చేశాయి. హీరోయిన్ విషయంలో కూడా కొన్ని వార్తలు వచ్చాయి కానీ, అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా ఆ ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమాకు ‘RX 100, మంగళవారం’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల విజనరీ ఫిల్మ్ మేకర్ అజయ్ భూపతి దర్శకత్వం చేయబోతున్నారు. జయకృష్ణ వెండితెర అరంగేట్రం అజయ్ భూపతి (Ajay Bhupathi) చేతుల్లో పెట్టేశారు. అలాగే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను వైజయంతి మూవీస్ అశ్విని దత్ సమర్పిస్తున్నారు. మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి స్టార్స్ ఎందరినో అశ్విని దత్ పరిచయం చేశారనే విషయం తెలియంది కాదు. అందుకే మరోసారి ఆ సెంటిమెంట్‌ని ఘట్టమనేని ఫ్యామిలీ ఫాలో అవుతోంది. అశ్విని దత్ (Ashwini Dutt) సమర్పణలో చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు.
Also Read- NBK: బాలయ్య ఫ్యాన్స్ వర్సెస్ మాజీ సీపీ సీవీ ఆనంద్.. ముగిసిన వివాదం.. అసలేం జరిగిందంటే?
హీరోయిన్ విషయానికి వస్తే..
మొదటి నుంచి అనుకుంటున్నట్లుగా బాలీవుడ్ భామే ఈ సినిమాలో నటించబోతుంది. జయ కృష్ణ ఘట్టమనేని సరసన రషా తడాని నటించబోతున్నట్లుగా ఇప్పటికే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ.. ఆమె పేరునే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. జయ కృష్ణ ఘట్టమనేని సరసన చేస్తున్న ఈ సినిమాతోనే నేషనల్ సెన్సేషన్ రషా తడాని (National Sensation Rasha Thadani) కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. రషా తడాని ఎవరో కాదు.. బాలయ్య సరసన ‘బంగారు బుల్లోడు’ చిత్రంలో నటించిన రవీనా టాండన్ కుమార్తె. నార్త్ ఇండియన్ డిస్ట్రిబ్యూసర్, AA Films India యజమాని అనిల్ తడాని, రవీనా టాండన్‌ల కుమార్తె రషా తడాని ఈ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతుంది. రషా ‘అజాద్’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి, “Uyi Amma” అనే పాటతో ఇంటర్నెట్‌ను షేక్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అజయ్ భూపతి నాల్గవ చిత్రంతో తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది.
Also Read- Varanasi: తప్పిదం మానవుడిది.. నింద దేవుడిపై.. ఏంటిది రాజమౌళి?
రషా కోసం ఇంటెన్స్ క్యారెక్టర్
జయ కృష్ణ, అజయ్ భూపతి కాంబోకు సంబంధించి కొన్నిరోజుల క్రితమే అనౌన్స్‌మెంట్ వచ్చింది. అద్భుతమైన కొండల మధ్య సాగే సినిమాగా, మనసుకు హత్తుకునే ప్రేమకథగా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ఇందులో భావోద్వేగాలు, నిజాయితీ, రియలిజం కలగలిపిన కొత్త తరహా ప్రేమకథగా అజయ్ భూపతి కథను సిద్ధం చేశారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అలాగే తన చిత్రాల్లో మహిళా పాత్రలకు బలమైన క్యారెక్టరైజేషన్స్ రాసే దర్శకుడు అజయ్ భూపతి.. ఈ సినిమాలోని రషా కోసం ఇంటెన్స్ క్యారెక్టర్‌ని డిజైన్ చేసినట్లుగా సమాచారం. ఈ నెలలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. టైటిల్‌తో పాటు మరిన్ని వివరాలను త్వరలోనే మేకర్స్ రివీల్ చేయనున్నారు. న్యూ ఏజ్ లవ్ స్టొరీగా రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు మొదలయ్యాయి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
