iBomma Ravi: ఐ బొమ్మ వెబ్ సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి (Immadi Ravi)కి నాంపల్లి కోర్టు (Nampally Court) షాకిచ్చింది. ఇప్పటికే అతను దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు మరో నాలుగు కేసుల్లో 12 రోజుల కస్టడీకి అనుమతిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో కేసులో మూడు రోజుల పాటు విచారణ జరపాలని పోలీసులకు సూచించింది. దమ్ముంటే పట్టుకోండి అని సవాల్ విసిరిన రవిని కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే రవిని రెండుసార్లు కస్టడీకి తీసుకున్న సైబర్ క్రైం పోలీసులు విచారణ జరిపారు.
Also Read- Gurram Paapi Reddy: సినిమాను హిట్ చేయండి.. మంచి భోజనం పెడతా! ఈ మాటంది ఎవరంటే?
కేసు పక్కదారి పట్టే అవకాశం
ఈ విచారణలో రవి ఎలాంటి కీలక వివరాలు వెల్లడించలేదు. దాంతో పోలీసులు ఇటీవల రవిపై మరో నాలుగు కేసులు ఉన్నాయని, వాటిలో విచారణ చేసేందుకు కస్టడీకి అనుమతించాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. అదే సమయంలో రవి బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. రవి తరపున వాదనలు వినిపించిన న్యాయవాది ఇప్పటికే రవిని రెండుసార్లు కస్టడీకి తీసుకుని పోలీసులు ప్రశ్నించారని చెప్పారు. విచారణ పేర రవిని ఇబ్బందులు పెడుతున్నారన్నారు. కస్టడీకి అనుమతించకుండా బెయిల్ మంజూరు చేయాలని అడిగారు. కాగా, రవికి బెయిల్ మంజూరు చేస్తే కేసును పక్కదారి పట్టించే అవకాశాలు ఉన్నాయంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పారు.
Also Read- Boyapati Sreenu: సెప్టెంబర్ 25కే మొదటి కాపీ రెడీ.. ‘ఓజీ’ కోసం బాలయ్యే ఆపమన్నారు
12రోజులపాటు పోలీస్ కస్టడీకి
ఈ నేపథ్యంలో కోర్టు రవి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. రవిపై ఉన్న నాలుగు కేసుల్లో కస్టడీకి అనుమతిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో కేసుకు సంబంధించి మూడు రోజులపాటు ప్రశ్నించాలని సూచించింది. ఈ నేపథ్యంలో రవి మరో 12రోజులపాటు పోలీస్ కస్టడీని ఎదుర్కోనున్నాడు. ఈనెల 18న రవిని కస్టడీకి తీసుకుని విచారణ ప్రారంభిస్తామని పోలీసులు తెలిపారు. పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ (IBomma) వెనుక ఉన్న కీలక వ్యక్తి ఇమ్మడి రవిని సైబర్ క్రైమ్ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. టాలీవుడ్‌తో పాటు ఇతర సినిమా పరిశ్రమలకు భారీ నష్టాన్ని కలిగించిన పైరసీ కార్యకలాపాలు, భారీ ఎత్తున అక్రమంగా డబ్బు సంపాదించడం, నిధులను మళ్లించడం వంటి ఆరోపణలపై రవిని అరెస్ట్ చేశారు. నిందితుడు రవి గత 5 ఏళ్లలో సుమారు రూ. 100 కోట్ల వరకు అక్రమంగా సంపాదించినట్టు ఇప్పటికే జరిగిన విచారణలో గుర్తించారు. ఈ సంపాదనకు సంబంధించి రూ. 30 కోట్ల మేర బ్యాంక్ లావాదేవీలను కూడా పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు 12 రోజుల కస్టడీలో అతడి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నించే అవకాశం ఉంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

