Homebound Movie: ఆస్కార్స్ 2026 రేసులో భారతదేశం నుంచి పంపిన ‘హోమ్‌బౌండ్’ (Homebound) చిత్రం అద్భుతమైన ఘనతను సాధించింది. ప్రముఖ దర్శకుడు నీరజ్ ఘైవాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, 98వ అకాడమీ అవార్డుల్లో ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ విభాగంలో షార్ట్‌లిస్ట్ చేయబడిన 15 చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
Read also-Rowdy Janardhan: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు ట్రీట్ రెడీ.. టీజర్ ఎప్పుడంటే?
భారతీయ సినిమా మరోసారి అంతర్జాతీయ స్థాయిలో మెరిసింది. 2026 ఆస్కార్ అవార్డుల కోసం ఉత్తమ అంతర్జాతీయ చిత్ర విభాగంలో పోటీపడుతున్న సినిమాల షార్ట్‌లిస్ట్‌ను అకాడమీ తాజాగా ప్రకటించింది. మొత్తం 86 దేశాల నుండి వచ్చిన ఎంట్రీలలో కేవలం 15 చిత్రాలను మాత్రమే తదుపరి దశకు ఎంపిక చేయగా, అందులో భారతదేశం నుండి అధికారికంగా పంపబడిన ‘హోమ్‌బౌండ్’ చోటు దక్కించుకోవడం గర్వకారణం.
నీరజ్ ఘైవాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఉత్తర భారతదేశంలోని ఒక గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. సమాజంలో గౌరవం, స్థిరత్వం కోసం నేషనల్ పోలీస్ ఎగ్జామినేషన్ (పోలీస్ ఉద్యోగం) కోసం సిద్ధమవుతున్న ఇద్దరు ప్రాణ స్నేహితుల చుట్టూ కథ తిరుగుతుంది. వారి లక్ష్యం దిశగా ప్రయాణించే క్రమంలో ఎదురయ్యే సవాళ్లు, ఆ ప్రయాణంలో వారి స్నేహం ఎదుర్కొనే ఒడిదుడుకులను ఈ సినిమా కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. కరోనా మహమ్మారి సమయంలో వలస కార్మికులు పడ్డ కష్టాలు, ఒక ఆంగ్ల పత్రికలో వచ్చిన వ్యాసం ఆధారంగా ఈ కథను రూపొందించారు. కేవలం ఉద్యోగం లేదా డబ్బు కోసం మాత్రమే కాకుండా, అస్తిత్వ పోరాటం కోసం మనుషులు తమ స్వస్థలాలను వదిలి ఎందుకు వలస వెళ్తారనే లోతైన కోణాన్ని దర్శకుడు ఇందులో ఆవిష్కరించారు.
Read also-Boyapati Sreenu: సెప్టెంబర్ 25కే మొదటి కాపీ రెడీ.. ‘ఓజీ’ కోసం బాలయ్యే ఆపమన్నారు
ఈ చిత్రంలో యువ నటులు ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. వారి నటన భావోద్వేగాలు సినిమాకు ప్రాణం పోశాయి. ‘మసాన్’ వంటి సున్నితమైన చిత్రాలను అందించిన నీరజ్ ఘైవాన్, ఈ సినిమాను కూడా అంతే సహజత్వంతో తెరకెక్కించారు. భారతదేశంతో పాటు అర్జెంటీనా, బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, స్పెయిన్, దక్షిణ కొరియా వంటి దేశాల చిత్రాలు కూడా ఈ షార్ట్‌లిస్ట్‌లో ఉన్నాయి. అకాడమీ సభ్యులు ఈ 15 చిత్రాలను వీక్షించిన తర్వాత, ఫైనల్ నామినేషన్ల కోసం 5 చిత్రాలను ఎంపిక చేస్తారు. ‘హోమ్‌బౌండ్’ షార్ట్‌లిస్ట్ కావడంతో భారతీయ సినీ అభిమానుల్లో ఆశలు చిగురించాయి. గతంలో ‘లాస్ట్ ఫిల్మ్ షో’, ‘ఆర్ఆర్ఆర్’ (నాటు నాటు పాట ద్వారా) వంటి చిత్రాలు ఆస్కార్ వేదికపై సత్తా చాటగా, ఇప్పుడు ఈ చిత్రం కూడా ఫైనల్ నామినేషన్ దక్కించుకుని ఆస్కార్ అవార్డును గెలుచుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.

