HHVM Pre Release: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు అంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘వైజాగ్ అనేది నా హృదయానికి దగ్గరగా ఉండే ఊరు. నేనొక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని కదా.. రకరకాల ఊళ్ళకు ట్రాన్స్ ఫర్ లు అవుతాయి. అందుకే ఎన్నో ఊళ్ళతో నాకు అనుబంధం ఉంటుంది. అందుకే నేను ఎక్కడకు వెళ్లినా అది నా ఊరే అని చెప్పుకుంటాను. అన్నయ్య నన్ను సత్యానంద్ దగ్గర నటనలో శిక్షణ కోసం విశాఖపట్నం పంపించారు. అలా విశాఖతో పరిచయం. ఉత్తరాంధ్ర ఆట పాటను సత్యానంద్ నా గుండెల్లో అణువణువునా నింపారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. పాలన పరంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా సమయాన్ని కేటాయించి షూటింగ్ పూర్తి చేశాను. కోహినూర్ వజ్రం నేపథ్యంలో సాగే ఈ కథలో సనాతన ధర్మం గురించి కూడా ఉంటుంది. నాకు తెలిసిన మార్షల్ ఆర్ట్స్ ఈ సినిమాకి ఉపయోగపడ్డాయి.’ అని అన్నారు.
Read also- Pavan Kalyan: పవన్ కళ్యాణ్ దెబ్బకు బాక్సాఫీస్ బద్దలే.. ఫస్ట్ షో ఎక్కడో తెలుసా?
సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి మాట్లాడుతూ, ‘ఎవరైనా ఒక మాట చెప్పినప్పుడు బల్లగుద్ది చెప్తున్నా అంటారు. ఈ వేదికగా నేను బల్లగుద్ది చెప్తున్నాను. హరి హర వీరమల్లుతో పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు పండుగ రాబోతుంది.’ అని అన్నారు. దర్శకుడు జ్యోతికృష్ణ మాట్లాడుతూ, ‘నాన్న గారికి, పవన్ కళ్యాణ్ గారికి మంచి అనుబంధం ఉంది. ఈ సినిమాని నాన్న గారు తన మొదటి సినిమాలా ఎంతో కసితో చేశారు.’ అని అన్నారు. నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. ‘పవన్ కళ్యాణ్ తో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా కోసం మేమందరం ఎంతో కష్టపడి పనిచేశాం’ అని అన్నారు.
Read also- Indira Mahila Shakti: మహిళా శక్తిని గుర్తించింది కాంగ్రేస్ ప్రభుత్వమే
ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. జూలై 24న విడుదలవుతోన్న ‘హరి హర వీరమల్లు’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు, పాటలకు విశేష స్పందన లభించింది. జూలై 23(బుధవారం) సాయంత్రం వైజాగ్ లో చిత్రం బృందం ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. అభిమానుల కోలాహలం నడుమ వైభవంగా జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.