HBD Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. ఆయన 1955 ఆగస్టు 22న ఆంధ్రప్రదేశ్‌లోని మొగల్తూరు గ్రామంలో జన్మించారు. తండ్రి కొణిదెల వెంకటరావు ఒక పోలీస్ కానిస్టేబుల్, తల్లి అంజనాదేవి గృహిణి. చిరంజీవి మధ్యతరగతి కుటుంబంలో జన్మించి సినిమాలపై ఎంతో ఆసక్తితో ఈ రంగంలోకి అడుగుపెట్టారు. చెన్నైలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో నటనలో డిప్లొమా పూర్తి చేశారు. 1978లో “పునాదిరాళ్లు” సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. అయితే “మనవూరి పాండవులు” (1978) సినిమా ఆయనకు మొదటి విజయాన్ని తెచ్చిపెట్టింది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఇండస్ట్రీలో ఎదురైన ప్రతి కష్టాన్ని తాను ఎదిగే విధంగా మలుచుకుని మెగాస్టార్ అయ్యారు. ఆయన నటన, డాన్స్, యాక్షన్ డైలాగ్ డెలివరీ స్టైల్ అభిమానుల హృదయాల్లో నిలిపేలా చేశాయి.
Read also- Komatireddy venkat reddy: లక్షల కోట్లు అవినీతి చేసిన వాళ్లు నీతులు చెప్తారా?.. మంత్రి ఫైర్?
చిరంజీవి తన 40 ఏళ్ల సినిమా కెరీర్‌లో 150కి పైగా సినిమాల్లో నటించారు. 1983 లో విడుదలైన ఖైదీ చిత్రం చిరంజీవిని యాక్షన్ హీరోగా స్థిరపరిచింది. 1988లో విడుదలైన రుద్రవీణ ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు అందించింది. ఇదే సినిమా జాతీయ అవార్డును గెలుచుకుంది. తెలుగులోనే కాకుండా హిందీ సినిమాల్లో కూడా నటించారు. “ప్రతిబంధ్” (1990), “ఆజ్ కా గుండారాజ్” (1992) వంటి సినిమాలతో బాలీవుడ్‌లో కూడా గుర్తింపు పొందారు. అదే సమయంలో ఖాన్ త్రయాన్ని, అమితాబ్ బచన్ ను పక్కకు నెట్టి భారత దేశంలో మొట్టమొదటి సారి కోటి రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్న నటుడిగా చరిత్రలోకి ఎక్కారు. ఆపద్భాంధవుడు సినిమాకు రూ.1.25 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఇది అప్పట్లో సంచలనంగా మారింది. చిరంజీవి చిన్నప్పుడు సినిమాలపై ఆసక్తి ఉన్నప్పటికీ, తొలుత చార్టర్డ్ అకౌంటెన్సీ చదవాలని అనుకున్నారు. కెరీర్ ప్రారంభంలో “రక్త సంబంధం” (1980) వంటి సినిమాల్లో ఆయన విలన్‌గా నటించారు. చిరంజీవి అనేక సినిమాల్లో హాలీవుడ్ సినిమాల నుండి ప్రేరణ పొందారు. ఉదాహరణకు, “ఖైదీ” సినిమా స్టాలోన్ నటించిన “ఫస్ట్ బ్లడ్” సినిమా నుండి కొంత ప్రేరణ పొందిందే. కానీ దానిని తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా మార్చారు.
Read also–Arjun Chakravarthy Trailer: “అర్జున్ చక్రవర్తి” ట్రైలర్ వచ్చేసింది.. ఆ డైలాగులు ఏంటి బాసూ..
సామాజిక సేవ
చిరంజీవి సామాజిక సేవలో కూడా గణనీయమైన కృషి చేశారు. 1998లో ఆయన “చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్” (CCT) స్థాపించారు. దీని ద్వారా రక్తదానం, నేత్రదాన కార్యక్రమాలను ప్రోత్సహించారు. ఈ ట్రస్ట్ ద్వారా లక్షలాది మంది ప్రజలకు రక్తం, కంటి చికిత్సలు అందాయి. ఆయన సామాజిక సేవకు గుర్తింపుగా 2006లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించబడ్డారు. ఆయన సేవలకు గుర్తించిన భారత ప్రభుత్వం 2024లో భారతదేశం రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మ విభూషణ్’ తో గౌరవించబడ్డారు. ఒకానొక సందర్భంలో తెలుగు సినిమా నిర్మాత, ప్రముఖ నటుడు మురళీ మోహన్ చిరంజీవి భారతదేశ అత్యున్నత పురస్కారం అయిన ‘భారతరత్న’ ఇవ్వాల్సిన వ్యక్తి అన్నారు. దీనిని బట్టి చూస్తుంటే ఆయన కీర్తి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. చిరంజీవి కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, ఒక సామాజిక శక్తి, దాతృత్వం చిహ్నం, తెలుగు సినిమాకు గర్వకారణం. ఆయన నటన, సామాజిక సేవ ఆయనను ఒక బహుముఖ వ్యక్తిగా నిలిపాయి.