Gamblers: సంగీత్ శోభన్.. ఈ పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు. ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సంగీత్ శోభన్.. ఇప్పుడు నిజంగానే అందరికీ పిచ్చెక్కిస్తున్నాడు. అవును, తనదైన కామెడీ టైమింగ్‌తో వెండితెరపై చెలరేగిపోతున్న ఈ యువ నటుడు.. ఎంచుకునే సబ్జెక్ట్స్ చూస్తుంటే.. నిజంగా ఆయన చేసిన సినిమాల వలే మ్యాడ్ ఎక్కేస్తుంది. తాజాగా సంగీత్ శోభన్ చేస్తున్న నూతన చిత్రాన్ని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమా టైటిల్ చూసి అంతా వావ్ అనేస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ చేసిన ‘గ్యాంబ్లర్’ పేరును తలపించేలా, ఈ చిత్రానికి ‘గ్యాంబ్లర్స్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ చిత్ర వివరాల్లోకి వెళితే..
Also Read- Kiran Abbavaram: పండంటి బాబుకు జన్మనిచ్చిన కిరణ్ అబ్బవరం భార్య
సంగీత్ శోభన్ సరసన ప్రశాంతి చారులింగా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ‘కేసీఆర్’ ఫేమ్ రాకింగ్ రాకేష్, పృథ్వీరాజ్, సాయి శ్వేత, జస్విక, భరణి శంకర్, మల్హోత్త్ర శివ, శివారెడ్డి వంటివారు ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ రచయిత, దర్శకుడు విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీవల్లి’ అనే సైన్స్ ఫిక్షన్ సినిమాను నిర్మించిన నిర్మాతలు సునీత, రాజ్‌కుమార్ బృందావనం.. ఈ సినిమాను రేష్మాస్ స్టూడియోస్, స్నాప్ అండ్ క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. కేఎస్‌కే చైతన్య ఈ చిత్రానికి దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్న ఈ చిత్రాన్ని జూన్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. శుక్రవారం చిత్ర ఫస్ట్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ చూసిన వారంతా సంగీత్ శోభన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. వైవిధ్యమైన పాత్రలను ఎన్నుకుంటూ, హీరోగా ఒక్కో మెట్టు ఎక్కుతున్న సంగీత్ శోభన్‌కు ఈ సినిమా కూడా భారీ విజయం సాధించాలని కోరుతున్నారు.
Also Read- Vijay Kanakamedala: మెగాభిమానులకు క్షమాపణలు చెప్పిన ‘భైరవం’ దర్శకుడు
చిత్ర ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘ఇదొక మిస్టరీ ఎంటర్‌టైనర్. ఇందులో కొత్త సంగీత్ శోభన్‌ను చూడబోతున్నారు. ఆయన నటనలోని మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రమిది. ఇందులో ఉండే థ్రిల్లింగ్ అంశాలు, ట్విస్ట్‌లు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. పూర్తి వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలున్నాయి. ఇటీవల ‘కేసీఆర్’ చిత్రంతో అందరి ప్రశంసలు అందుకున్న రాకింగ్ రాకేష్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్ర అందరినీ అలరించేదిగా ఉంటుందని అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ.. ‘మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్’ చిత్రాలతో సంగీత్ శోభన్‌కు యూత్‌లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గత చిత్రాలకు సంబంధం లేకుండా పూర్తి భిన్నమైన పాత్రను ఇందులో చేస్తున్నారు. కొత్త కాన్సెప్ట్‌తో పూర్తి థ్రిల్లింగ్ అంశాలతో రూపొందిన ఈ ‘గ్యాంబ్లర్స్’ తప్పకుండా అందరినీ అలరిస్తుందనే నమ్మకముందని, జూన్ 6న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాను అందరూ ఆదరించాలని కోరారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు