Eesha: టాలీవుడ్‌లో చిన్న చిత్రంగా విడుదలై, పెద్ద సంచలనాలు సృష్టించడం అరుదుగా జరుగుతుంటుంది. ఈ మధ్య ఇలా అద్భుతాలు చాలానే జరుగుతూ వస్తున్నాయి. తక్కువ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న చిత్రాలు బాక్సాఫీస్‌ని షేక్ చేసి కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇప్పుడా జాబితాలోకి క్రిస్మస్ బరిలో నిలిచిన ‘ఈషా’ (Eesha) చిత్రం కూడా చేరింది. హారర్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూ కేవలం మూడు రోజుల్లోనే బ్రేకీవెన్ మార్కును చేరుకుని ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇటీవల కాలంలో ‘లిటిల్ హార్ట్స్’ (Little Hearts), ‘రాజు వెడ్స్ రాంబాయి’ (Raju Weds Rambai) వంటి వరుస విజయాలతో జోరు మీదున్న బన్నీవాస్, వంశీ నందిపాటి ద్వయం, ‘ఈషా’తో తమ విజయ పరంపరను కొనసాగించారు. నందిపాటి ఎంటర్టైన్‌మెంట్స్, బన్నీవాస్ వర్క్స్ బ్యానర్లపై విడుదలైన ఈ చిత్రం, ఈ మిత్రద్వయానికి మరపురాని హ్యాట్రిక్ విజయాన్ని అందించింది. కథా బలం ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ఈ సినిమా మరోసారి నిరూపించింది.
Also Read- Maruthi Emotional: నేను రాశాను.. తీశాను.. వెనకాల ఉన్నది మాత్రం ప్రభాస్.. మారుతీ..
లాభాల బాటలో ‘ఈషా’
ఈ సినిమా విడుదలకు ముందు పడిన పెయిడ్ ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అది కంటిన్యూ అవుతూ మొదటి రోజు నుంచే థియేటర్ల వద్ద సందడి మొదలుపెట్టింది. ఫస్ట్ వీకెండైన మూడు రోజులకుగానూ.. ఈ సినిమా దాదాపు రూ. 4 కోట్ల 80 లక్షల గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. మూడు రోజుల్లోనే బ్రేకీవెన్ సాధించిన ఈ చిత్రం.. విడుదలైన నాలుగో రోజు నుంచే పూర్తిస్థాయిలో లాభాల బాటలోకి అడుగుపెట్టినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అలా ఈ ఏడాది క్రిస్మస్ రేసులో విడుదలైన చిత్రాల్లో ‘ఈషా’ నెంబర్ వన్ స్థానంలో నిలిచి, బాక్సాఫీస్ విన్నర్‌గా నిలిచింది. అఖిల్ రాజ్, త్రిగుణ్ హీరోలుగా.. గ్లామరస్ బ్యూటీ హెబ్బా పటేల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్ తమ నటనతో మెప్పించారు. దర్శకుడు శ్రీనివాస్ మన్నె హారర్ ఎలిమెంట్స్‌ను డీల్ చేసిన విధానం, ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెట్టాయి. ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో, హేమ వెంకటేశ్వరరావు (హెచ్.వి.ఆర్ ప్రొడక్షన్స్) ఈ చిత్రాన్ని అత్యున్నత నిర్మాణ విలువలతో నిర్మించారు.
సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్
ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తుంటే, రానున్న రోజుల్లో ‘ఈషా’ మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సెలవుల సీజన్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ థ్రిల్లర్‌ను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మొత్తంగా చూస్తే.. ‘ఈషా’ రూపంలో టాలీవుడ్ ఇయర్ ఎండ్ ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్‌తో ముగిసిందని చెప్పుకోవచ్చు. చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకున్న ఈ చిత్రయూనిట్‌కు ప్రస్తుతం అన్ని వైపుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ చిత్ర ఏ మేరకు నిర్మాతలకు లాభాలను తెచ్చిపెడుతుందో తెలియాలంటే మాత్రం ఇంకో వీకెండ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్స్ స్టడీగా ఉన్నట్లుగా మేకర్స్ ఈ అప్డేట్‌లో తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

