Barabar Premistha: టాలీవుడ్ టాప్ నిర్మాత, టీఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు ‘బరాబర్ ప్రేమిస్తా’ టీమ్‌కు సపోర్ట్ అందించారు. యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న సరి కొత్త సినిమా ‘బరాబర్ ప్రేమిస్తా’. సంపత్ రుద్ర దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఏవిఆర్ మూవీ వండర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి గెడా చందు, గాయత్రి చిన్ని, ఏవిఆర్ నిర్మాతలు. హీరో చంద్రహాస్ సరసన మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్‌గా నటిస్తోంది. ‘ఇష్టంగా’ ఫేమ్ అర్జున్ మహీ విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్ మంచి స్పందనను రాబట్టుకోగా, తాజాగా మేకర్స్ సినిమాలోని ‘రెడ్డి మామ’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ని నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సాంగ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Also Read- Tallest Heroine: సినీ ఇండస్ట్రీలో హైట్ హీరోయిన్ ఎవరో తెలుసా?
‘రెడ్డి మామ’ పాట విషయానికి వస్తే.. మాస్ బీట్‌గా ఈ సాంగ్‌ను ఆర్ఆర్ ధృవణ స్వరపరిచారు. సురేష్ గంగుల సాహిత్యం అందించగా.. నకాష్ అజిజ్, సాహితి చాగంటి ఆలపించారు. ఈ మాస్ బీట్ సాంగ్ హుషారుగా ఉండటమే కాకుండా, హీరో స్టెప్స్ కూడా సాంగ్ గురించి మాట్లాడుకునేలా చేస్తున్నాయి. కచ్చితంగా ఈ పాట హీరో చంద్రహాస్ కెరీర్‌లో నిలిచిపోతుందనేలా మేకర్స్ రిచ్‌గా తెరకెక్కించారు. ఈ పాటను విడుదల చేసిన అనంతరం నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ఇన్‌స్టంట్ చార్ట్ బస్టర్‌గా ఈ పాట ఉందని మెచ్చుకుంటూ, చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
హీరో చంద్రహాస్ విషయానికి వస్తే, ఈటీవీ ప్రభాకర్ కుమారుడే ఈ చంద్రహాస్. ‘రామ్ నగర్ బన్నీ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన చంద్రహాస్‌కు ఆ సినిమా అనుకున్నంత పేరు తీసుకురాలేకపోయినా, ఆయన యాటిట్యూడ్ పరంగా స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. మీడియా సమావేశాల్లో చంద్రహాస్ మాట్లాడే మాటలు, కాన్ఫిడెన్స్ ఆయన చేసే సినిమాలపై ఆసక్తిని కలిగించినా, సరైన కంటెంట్ లేకపోవడంతో ఆయనకు రావాల్సిన పేరు రావడం లేదు. కానీ ఈ ‘బరాబర్ ప్రేమిస్తా’ మాత్రం తన కోరికను తీరుస్తుందని, తనకు కావాల్సిన హిట్‌ని ఇస్తుందని చంద్రహాస్ నమ్మకంగా ఉన్నాడు. అర్జున్ మహి, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, మధునందన్ వంటివారు ‘బరాబర్ ప్రేమిస్తా’లో ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.