Dil Raju: శ్రీరాముడు అంతటి వానికే 14 ఏళ్ల వనవాసం తప్పలేదు.. సినిమా ఇండస్ట్రీకి 14 ఏళ్లు అంటే తప్పదు. ఒక్కోసారి కాలం కూడా పరీక్షిస్తుంటుంది. విషయం ఏమిటని అనుకుంటున్నారా? ఏముంది.. సినిమా ఇండస్ట్రీలోని కళాకారులకు ప్రభుత్వం ఇచ్చే అవార్డులకు గ్యాప్ వచ్చి 14 సంవత్సరాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిభావంతులైన కళాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ‘నంది’ అవార్డులను ఇచ్చేది. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిందో.. అప్పటి నుంచి ఈ అవార్డుల సంస్కృతి కూడా అటకెక్కింది. మధ్యలో నంది ప్లేస్‌లో సింహా అన్నారు. ఏదీ కూడా కార్యరూపం దాల్చలేదు. ఏ ప్రభుత్వానికైనా ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉంటే.. ఇది ఏమంత పెద్ద విషయం కానే కాదు. ఆ విషయాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిరూపించారు. అంతేనా, ఎప్పుడైతే ఈ అవార్డులు ఆగిపోయాయో.. అప్పటి నుంచి లెక్క పెట్టి మరీ ఈ అవార్డులను ఆయన ఇస్తుండటం నిజంగా అభినందించాల్సిన విషయం. దాదాపు 14 సంవత్సరాల విరామం అనంతరం సినిమా నటీనటుల, సాంకేతిక నిపుణుల ప్రతిభను ప్రోత్సాహించే సంప్రదాయ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం మళ్లీ శ్రీకారం చుట్టింది. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ (Telangana Gaddar Film Awards) పేరుతో కళాకారులను, సాంకేతిక నిపుణులను సత్కరించబోతుంది. ఈ అవార్డ్స్ ఎప్పుడు, ఎక్కడ అనే విషయాలను తెలిపేందుకు ఎఫ్‌డిసి ఛైర్మన్ దిల్ రాజు మీడియా సమావేశం నిర్వహించారు. ఎఫ్‌డిసి, మీడియా కలిసి ఈ అవార్డుల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.
Also Read- King Nagarjuna: ‘కూలీ’లో నా పాత్రకి విజిల్స్ పడతాయి.. నేనే ఆశ్చర్యపోయా!
2024లో విడుదలైన ఉత్తమ చిత్రాలకు.. ఆయా చిత్రాలలో నటించి ఉత్తమ ప్రతిభను కనబరిచిన నటీనటులకు, సాంకేతిక నిపుణులతో పాటు.. 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకు సెన్సారు జరుపుకున్న చిత్రాల్లోని ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి ఇందులో భాగంగా అవార్డ్స్ ఇవ్వనున్నారు. ఇటీవల విజేతల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అపూర్వ వేడుక కోసం హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదిక సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. జూన్ 14న అంగరంగ వైభవంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడానికి భారీ స్థాయిలో సన్నాహాలు చేస్తోంది. ఈ వేడుకను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటి రెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు అత్యంత ఘనంగా జరిపించడానికి తగు ఏర్పాట్లు చేయిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక వేడుకకు తెలుగు తారాలోకమంతా తరలి రాబోతోంది. జూన్ 14న హైటెక్స్ వేడుక తారళ తళుకులతో ప్రకాశవంతం కాబోతోంది.
Also Read- Trivikram Srinivas: ట్విస్ట్ అదిరింది.. అల్లు అర్జున్, రామ్ చరణ్ అవుట్.. ఎన్టీఆర్ ఫిక్స్!
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎఫ్‌డిసి ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘‘ఈ నెల 14న హైటెక్స్ వేదికగా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. 14 సంవత్సరాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సిన బాధ్యత సినీ పరిశ్రమపై కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు కార్యక్రమానికి ఐ అండ్ పీఆర్ ద్వారా అన్ని మీడియా సంస్థలకు లైవ్ ప్రసారం ఇవ్వడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఈవెంట్ అందరికీ రీచ్ అవ్వాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది. సాయంత్రం ఆరు గంటలకు ఈ వేడుక ప్రారంభమవుతుంది. 2014 నుంచి 2023 వరకు విడుదలైన సినిమాల్లో ప్రతి ఏడాది నుంచి మూడు ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి, ఆ చిత్రాల హీరో, హీరోయిన్, నిర్మాత, దర్శకులకు ఈ వేడుకలో అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి ఓ మంచి సాంప్రదాయాన్ని గద్దర్ ఫిల్మ్ అవార్డులతో పరిచయం చేస్తుంది. 2024లో విడుదలైన ఉత్తమ చిత్రాలకు, ఉత్తమ సాంకేతిక నిపుణులకు కూడా అవార్డులు అందజేస్తున్న సంగతి తెలిసిందే. 14 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ వేడుకను తెలుగు సినీ పరిశ్రమలోని వారంతా హాజరై విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. ఎఫ్‌డిసి, మీడియా కలిసి ఈ వేడుకను మోత మోగేలా చేయాలని కోరుతున్నాను’’ అని తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు