Casting Couch: టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి’కాస్టింగ్ కౌచ్’పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో ‘కాస్టింగ్ కౌచ్’ అనేది ఎప్పుడూ ఒక వివాదాస్పద అంశమే. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా వేడుకలో మాట్లాడుతూ, పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదనే అర్థం వచ్చేలా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతున్నాయి. చిరంజీవి చేసిన ఈ ప్రకటనపై ప్రముఖ దర్శకుడు గీతాకృష్ణ తీవ్రస్థాయిలో స్పందించారు. చిరంజీవి లాంటి పెద్ద స్టార్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం “కామెడీ”గా ఉందని ఆయన విమర్శించారు.
Read also-Shruti Haasan: దమ్ము కొడుతూ.. దుల్కర్ సినిమాలో మరో తార లుక్ అదిరింది
వాస్తవాలను కప్పిపుచ్చడం సాధ్యమా? గీతాకృష్ణ తన వీడియోలో ప్రధానంగా చిరంజీవి అనుభవాన్ని ప్రశ్నించారు. సుమారు 46-47 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో అగ్రస్థానంలో ఉన్న చిరంజీవికి ఇక్కడి చీకటి కోణాలు తెలియవనుకోవడం నమ్మశక్యంగా లేదన్నారు. తన కుమార్తె సుస్మిత కొణిదెల మరియు అశ్విని దత్ కుమార్తెలు నిర్మాతలుగా ఉన్న వేదికపై, వారిని ప్రోత్సహించే క్రమంలో చిరంజీవి వాస్తవాలను పక్కన పెట్టారని ఆయన అభిప్రాయపడ్డారు. పరిశ్రమలో అవకాశాల కోసం వచ్చే వారిని ఎక్స్‌ప్లాయిట్ చేసే నిర్మాతలు, మేనేజర్లు ఉన్నారన్నది జగమెరిగిన సత్యమని ఆయన గుర్తు చేశారు.
కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినిమా రంగానికే పరిమితం కాలేదని గీతాకృష్ణ వివరించారు. అడ్వర్టైజింగ్ రంగం నుండి సాఫ్ట్వేర్ కంపెనీల వరకు, ఎక్కడైతే అధికారం ఒకరి చేతిలో ఉంటుందో, అక్కడ బలహీనులను వాడుకోవడం అనేది జరుగుతూనే ఉందన్నారు. పురుషులు స్త్రీలను మాత్రమే కాకుండా, నేటి కాలంలో స్త్రీలు కూడా పురుషులను ట్రాప్ చేసే పరిస్థితులు ఉన్నాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అవకాశాల కోసం “దేనికైనా రెడీ” అనే వాళ్ళు 50 శాతం ఉంటే, వారిని వాడుకునే వారు మరో 50 శాతం ఉన్నారని ఆయన విశ్లేషించారు.
గతంలో సంచలనం సృష్టించిన ‘మీటూ’ ఉద్యమం మరియు ‘సుచి లీక్స్’ వంటి అంశాలను గీతాకృష్ణ ప్రస్తావించారు. ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం జరిగిన విషయాలను ఇప్పుడు బయటపెట్టడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని, ఆ సమయంలో ప్రయోజనాలు పొంది ఇప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ ప్రభుత్వం గనుక నిధులు ఇచ్చి విచారణ జరిపించమంటే, ఏ నటుడు ఎక్కడ ఎవరితో ఉన్నారో కూడా ఆధారాలతో సహా బయటపెట్టగలనని ఆయన సవాలు విసిరారు.
Read also-Telugu Releases: ఈ వారం థియేటర్లో విడుదలవుతున్న తెలుగు సినిమాలు ఇవే.. ఎంటర్టైన్మెంట్ లోడింగ్..
సినిమా రంగంలోకి రావాలనుకునే యువతీ యువకులకు ఆయన ఒక ముఖ్యమైన సూచన చేశారు. పరిశ్రమలో అందరూ చెడ్డవారు కాకపోయినా, మోసగాళ్లు ఉంటారని గుర్తించాలన్నారు. ఎవరితో ఎలా మసలుకోవాలో, తమను తాము ఎలా కాపాడుకోవాలో తెలివితేటలు ఉండాలని హితవు పలికారు. కేవలం అందం చూపిస్తే అవకాశాలు వస్తాయని అనుకోవడం పొరపాటని, స్మార్ట్‌గా వ్యవహరించాలని కోరారు. చిరంజీవిపై గౌరవం ఉన్నప్పటికీ, ఆయన చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని గీతాకృష్ణ కుండబద్దలు కొట్టారు. పరిశ్రమలో ఉన్న లోపాలను ఒప్పుకున్నప్పుడే మార్పు సాధ్యమవుతుందని, లేదని అబద్ధాలు చెప్పడం వల్ల ఎవరికీ ప్రయోజనం లేదని ఆయన తన విశ్లేషణను ముగించారు.

