Bomb Threat: శుక్రవారం (అక్టోబర్ 3, 2025) బాంబ్ బెదిరింపు కాల్స్‌తో (Bomb Threat) చెన్నై (Chennai) మహానగరంలో కలకలం మొదలైంది. హీరోయిన్ త్రిషతో పాటు పలువురు ప్రముఖులకు ‘మీ ఇంటిలో బాంబు పెట్టాం’ అంటూ బెదిరింపు కాల్స్ రావడంతో తమిళనాడు (Tamil Nadu) రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన మొదలైంది. శుక్రవారం ఉదయం చెన్నైలోని త్రిష నివసించే ప్రాంతానికి సంబంధించి పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఈ బెదిరింపు సమాచారం అందినట్లుగా తెలుస్తోంది. ఇంట్లో బాంబు పెట్టారనే సమాచారం అందగానే, పోలీసులు వెంటనే అప్రమత్తమై చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న వెంటనే, బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDDS) బృందాలు, స్థానిక పోలీసులు, స్నిఫర్ డాగ్స్ (Spiffer Dogs)తో సహా భద్రతా సిబ్బంది త్రిష నివాసానికి చేరుకున్నారు. ఆమె ఇంట్లో ఉన్నప్పుడే, పోలీసులు ఆమె నివాసంలో, చుట్టు పక్కల పరిసర ప్రాంతాలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. సుదీర్ఘ సెర్చింగ్ అనంతరం, పోలీసులకు ఎలాంటి పేలుడు పదార్థాలను లభించలేదు. దీంతో ఇది బెదిరింపు కాల్ మాత్రమేనని పోలీసులు తేల్చారు. దీంతో త్రిష్ అండ్ ఫ్యామిలీ ఊపిరి పీల్చుకుంది.
Also Read- Kiran Abbavaram: పెళ్లికి.. రైట్ ఏజ్, రైట్ టైమ్ ఎప్పుడని అడిగితే.. కిరణ్ ఏం చెప్పారో తెలుసా?
త్రిషతో పాటు పలువురి ప్రముఖుల ఇళ్లకు..
ఈ సంఘటన కేవలం త్రిష ఇంటికి మాత్రమే పరిమితం కాలేదు. గత వారం రోజులుగా తమిళనాడులో వరుసగా ఇలాంటి బాంబు బెదిరింపుల పరంపర కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నివాసం, గవర్నర్ ఆర్‌ఎన్ రవి నివాసం (రాజ్‌భవన్), నటుడు – రాజకీయ నాయకుడు విజయ్ నివాసం, బీజేపీ రాష్ట్ర హెడ్ క్వార్టర్స్‌తో పాటు ఇంకా పలువురు ప్రముఖుల నివాసాలకు కూడా బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయని, సుధీర్ఘ సెర్చింగ్ అనంతరం ఇవన్నీ ఫేక్ కాల్స్‌గా పోలీసులు నిర్థారించారు. ఈ వరుస ఘటనల నేపథ్యంలో, చెన్నై పోలీసులు అప్రమత్తమై, ముఖ్యమంత్రితో పాటు ఇతర ప్రముఖుల నివాసాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. సైబర్ క్రైమ్ విభాగం ఈ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులను గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టింది. ఇటువంటి తప్పుడు సమాచారంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ సంఘటన కారణంగా త్రిష అభిమానులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురైనట్లుగా తెలుస్తోంది.
Also Read- Nani Sujeeth: ‘బ్లడీ రోమియో’.. ‘ఓజీ’ దర్శకుడి నెక్ట్స్ సినిమాకు క్లాప్ పడింది
ప్రజలు భయపడవద్దు
మరోవైపు, ఏపీలోని తిరుపతి రైల్వే స్టేషన్‌కు కూడా సేమ్ టైమ్‌లో బాంబు బెదిరింపులు వచ్చినట్లుగా తెలుస్తోంది. తిరుపతి రైల్వే స్టేషన్‌లో కూడా బాంబు స్క్వాడ్ పూర్తి స్థాయిలో సెర్చింగ్ జరిపి, ఫేక్ కాల్‌గా కొట్టేశారు. మొత్తంగా అయితే, గత వారం రోజులుగా తమిళనాడు రాష్ట్రంలో ఇలాంటి ఫేక్ కాల్స్ అధికంగా వస్తున్నాయని, త్వరలోనే ఈ కాల్స్‌కు కారణమైన వారిని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌లతో పాటు, ఆ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నారు. ఈ సందర్భంగా.. ప్రజలు భయపడవద్దని, అనుమానంగా ఏం కనిపించినా వెంటనే సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. అంతా ఫేక్ అని తెలియడంతో ప్రజలు కూడా ఊపిరి పీల్చుకున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
