Bigg Boss Telugu 9: కింగ్ నాగార్జున (King Nagarjuna) హోస్ట్ చేస్తున్న రియాలిటీ షో ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9) కు సమయం ఆసన్నమైంది. ఇప్పటి వరకు 8 సీజన్లు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు 9వ సీజన్‌లోకి ఎంటరవుతోంది. ఈ మధ్య బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హోస్ట్ విషయంలో రకరకాలుగా వార్తలు వైరలైన విషయం తెలిసిందే. నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna), రానా దగ్గుబాటి (Rana Daggubati), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) పేర్లు హోస్ట్ విషయంలో వినిపించాయి. బాలయ్య అయితే దాదాపు కన్ఫర్మ్ అయినట్లుగా రూమర్స్ వ్యాపించాయి. ఆ రూమర్స్ అన్నింటికీ చెక్ పెడుతూ.. ఈసారి సీజన్ కూడా కింగ్ నాగార్జునే హోస్ట్ చేయబోతున్నాడంటూ.. ‘చదరంగం కాదు.. ఈసారి రణరంగం’ అంటూ అధికారికంగా బిగ్ బాస్ యాజమాన్యం ప్రకటించింది. ఈ మేరకు వారు విడుదల చేసిన టీజర్ కూడా ఇంకా టాప్‌లో ట్రెండ్ అవుతూనే ఉంది.
అలాగే ఈసారి హౌస్‌లోకి వెళ్లే పార్టిసిపెంట్స్ విషయంలో కూడా కొన్ని పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఫైనల్‌గా ఎవరు హౌస్‌లోకి అడుగుపెడతారో తెలియదు కానీ, ప్రస్తుతానికైతే చాలానే పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా కింగ్ నాగార్జున ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో ఈసారి నిజంగానే హౌస్‌లో రణరంగం ఉంటుందనేది అర్థమైపోతుంది. ఏంటా స్టేట్‌మెంట్ అనుకుంటున్నారా? పల్లవి ప్రశాంత్ అనే వాడిని హౌస్‌లోకి తీసుకొచ్చినందుకే పెద్ద రచ్చ రచ్చ అయింది. ఈసారి అలాంటి వాళ్లకి ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారు కింగ్ నాగార్జున. ఈసారి ఎవరైనా పార్టిసిపేట్ చేయవచ్చు.. అందుకు ఏం చేయాలంటే? అంటూ తాజాగా బిగ్ బాస్ టీమ్ విడుదల చేసిన వీడియోలో కింగ్ నాగార్జున వివరంగా చెప్పుకొచ్చారు. ఈ వీడియోలో..
Also Read- Manchu Vishnu: రామ్ గోపాల్ వర్మ మెసేజ్‌తో దాదాపు ఏడ్చేసిన మంచు విష్ణు.. మరీ ఇలానా టీజ్ చేసేది?
‘‘ఇప్పటివరకూ మీరు బిగ్‌బాస్ షోను ఎంతో ప్రేమించారు. ఇంత ప్రేమను ఇచ్చిన మీకు.. రిటర్న్ గిఫ్ట్‌గా ఏమివ్వాలి? మీరు ఎంతగానో ప్రేమించిన బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీయే రిటర్న్. ఈ సారి హౌస్‌లోకి సెలబ్రిటీస్ మాత్రమే కాదు. మీకూ అవకాశం ఉంది. సో.. కమాన్. బిగ్‌బాస్ సీజన్ 9 తలుపులు తెరుచుకుని మీకోసం ఎదురు చూస్తున్నాయి’’ అని నాగార్జున ఈ వీడియోలో పేర్కొన్నారు. ఇక రిటర్న్ గిఫ్ట్‌గా నాగ్ చెప్పిన ఈ షోలో ‘‘సామాన్యులు పార్టిసిపేట్ చేయాలంటే జియో హాట్‌స్టార్ సైట్‌లో రిజిస్టరై.. ఈ షో లో పార్టిసిపేట్ చేయడానికి రీజన్ చెబుతూ వీడియోను అప్లోడ్ చేయండి. హౌస్ మేట్ అయ్యే ఛాన్స్ మీదే కావచ్చు’’ అని ప్రకటించారు. ఇంతకు ముందు విడుదల చేసిన టీజర్ గ్లింప్స్‌లో ‘ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు.. ఆ గెలుపు రావాలంటే, యుద్ధం చేస్తే సరిపోదు.. ప్రభంజనం సృష్టించాలి. ఈసారి చదరంగం కాదు. రణరంగమే’ అంటూ కింగ్ నాగార్జున సీజన్ 9ని పరిచయం చేశారు. ఈ టీజర్‌లో సీజన్ 9 లోగోని కూడా రివీల్ చేశారు. ఇప్పుడు సామాన్యులకే.. అంటూ బిగ్ బాస్ టీమ్ ఇచ్చిన పిలుపుతో.. నిజంగానే ఈసారి సీజన్ రసవత్తరంగా ఉంటుందని అంతా భావిస్తున్నారు. మరెందుకు ఆలస్యం.. వీడియో అప్లోడ్ చేసేయండి.. హౌస్‌లోకి వెళ్లే ఛాన్స్ పట్టేయండి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు