Book My Show: ఈ వారం బాక్సాఫీస్ వద్ద రాజమౌళి (SS Rajamouli) ‘బాహుబలి ది ఎపిక్’ (Bahubali The Epic), రవితేజ ‘మాస్ జాతర’ (Mass Jathara)ల మధ్య తీవ్రమైన పోరు నెలకొంది. ఈ శుక్రవారం ఈ రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి. వీటిలో ఒకటి ఇప్పటికే దేశవ్యాప్తంగా ఘన విజయాన్ని సాధించి, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన ‘బాహుబలి’ సిరీస్ చిత్రాలను కలిపి ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో మళ్లీ విడుదల చేస్తుండగా.. రెండోది, మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) నటించిన కొత్త సినిమా ‘మాస్ జాతర’. రవితేజకు ఈ చిత్రం విజయం చాలా అవసరం. ఎందుకంటే ఆయన గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించినంతగా రాణించలేదు. అయితే, సినిమా విడుదల కాకముందే ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ‘బుక్ మై షో’ (Book My Show)లో నమోదైన ఆసక్తి చూస్తుంటే, రవితేజ అభిమానులకు మళ్లీ నిరాశ ఎదురయ్యేలా ఉంది.
Also Read- Tollywood: టాలీవుడ్‌లో పవన్ నామ స్మరణ.. వారికి వరమా? శాపమా?
మరీ ఇంత దారుణమా?
బుక్ మై షో గణాంకాల ప్రకారం, ‘బాహుబలి ది ఎపిక్’ సినిమా చూడాలని ఆసక్తి చూపిస్తూ లైక్ కొట్టిన వారి సంఖ్య 3 లక్షల 65 వేలుగా ఉంది. దీనికి పోటీగా వస్తున్న మాస్ మహారాజా రవితేజ ‘మాస్ జాతర’ చిత్రంపై ఆసక్తి వ్యక్తం చేస్తూ లైక్ కొట్టిన వారి సంఖ్య కేవలం 57 వేలు మాత్రమే. ఈ భారీ తేడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘బాహుబలి’ వంటి చరిత్ర సృష్టించిన సినిమా ముందు రవితేజ ‘మాస్ జాతర’ను విడుదల చేయడం సరైన నిర్ణయం కాదని, సినిమాను రాంగ్ టైమ్‌లో రిలీజ్ చేస్తున్నారనేలా కామెంట్స్ మొదలయ్యాయి. వాస్తవానికి ఈ సినిమా పలుమార్లు వాయిదా పడి, ఎట్టకేలకు ఈ 31 సాయంత్రం నుంచి అఫీషియల్‌గా విడుదల కాబోతోంది. మళ్లీ వాయిదా అంటే, ఆ ఉన్న క్రేజ్ మొత్తం పోయే అవకాశం ఉందని మేకర్స్ భావించి ఉండవచ్చు.
పాన్ ఇండియా వర్సెస్ రీజనల్
ఇదిలా ఉంటే, రవితేజ అభిమానులు ఈ బుక్ మై షో గణాంకాలను కొట్టిపారేస్తున్నారు. ‘బాహుబలి ది ఎపిక్’ పాన్-ఇండియా స్థాయిలో విడుదలవుతోంది కాబట్టి.. అన్ని రాష్ట్రాల, అన్ని భాషల ప్రేక్షకుల ఆసక్తి కలిసి 3.65 లక్షల లైక్స్ నమోదయ్యాయని వారు వాదిస్తున్నారు. కానీ, రవితేజ సినిమా ‘మాస్ జాతర’ కేవలం ప్రాంతీయ (రీజనల్) సినిమా కాబట్టి, లైక్స్ సంఖ్య తక్కువగా ఉండటం సహజమని వారు పేర్కొంటున్నారు. ఈ లైక్స్ సంఖ్యతో సినిమా భవిష్యత్తును అంచనా వేయడం సరికాదనేది వారి వాదన.
Also Read- Rahul Ravindran: ‘ది గర్ల్ ఫ్రెండ్’కు మొదట అనుకున్న హీరోయిన్ ఎవరంటే?
జాతర భవిష్యత్ టాక్ పైనే..
ఏది ఏమైనప్పటికీ, ‘మాస్ జాతర’ చిత్ర భవిష్యత్.. చిత్ర విడుదల తర్వాత వచ్చే టాక్ మీదే పూర్తిగా ఆధారపడి ఉంటుంది. మొదటి రోజు ప్రేక్షకుల స్పందన, రివ్యూలు సానుకూలంగా ఉంటేనే, బాహుబలి సునామీని తట్టుకుని నిలబడగలిగే అవకాశం ఉంటుంది. లేదంటే, రవితేజకు మరోసారి బాక్సాఫీస్ పరాభవం తప్పదనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం. మాస్ మహారాజా తన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను మెప్పించగలిగితేనే, ఈ క్లిష్టమైన పోటీలో విజయం సాధించగలుగుతారు. లేదంటే కష్టమే. మరోవైపు రెండు సినిమాలను ఎలా కలిపారా? ఏమేం సీన్స్ ఉంచారు? ఏమేం తీసేశారు? అనే ఆసక్తి కూడా ‘బాహుబలి ది ఎపిక్’ను లైక్ చేయడానికి కారణంగా చెప్పుకోవచ్చు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
