AP Minister: సినిమా విడుదలకు ముందే హిట్లో ప్లాపో చెప్పేంత దైవాంశ సంభూతుడివా? అంటూ వైసీపీ మాజీ మంత్రిని ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. రాజమహేంద్రవరంలోని హుకుంపేట క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. సినీ రంగంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై మంత్రి దుర్గేష్ మాట్లాడారు. ఈ సమస్యను చూపిస్తూ.. పవన్ కళ్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’ సినిమాపై వైసీపీ నేత ఒకరు షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ వైసీపీ నేత పేరు చెప్పుకుండా మంత్రి దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ..
Also Read- Manchu Manoj: మెగా ఫ్యాన్స్‌కు నేను సారీ చెబుతున్నాను..
‘‘సినీ ప్రముఖులు ప్రభుత్వాన్ని కలవలేదని చెప్పి, ఎప్పుడైనా పరిశ్రమకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నామా అని ఆయన ప్రశ్నించారు. డీజీపీని తామేదో అరెస్ట్‌లు చేయమన్నామని వక్రభాష్యాలు చెప్పేవాళ్లు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. సినిమా విడుదల సమయంలో ఇలాంటి వాతావరణం ఏంటని ప్రశ్నించామని వెల్లడించారు. తాము కేవలం విచారణ మాత్రమే చేయమన్నామని, అరెస్ట్ చేయాలని ఎక్కడా చెప్పలేదని మరోసారి ఆయన స్పష్టతనిచ్చారు. సినిమా విషయాలపై పరిజ్ఞానం లేకుండా అజ్ఞానంతో మాట్లాడటం సరికాదని, అది జంతు సమాన మూర్ఖత్వానికి నమూనా అని జంద్యాల వ్యాఖ్యలను ఉదహరించారు. రాజకీయ లబ్ధి పొందాలనుకున్న వైసీపీ మాజీమంత్రి ఒకరు వాస్తవాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం తగదని హెచ్చరించారు. మాజీ మంత్రి ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఆయన ఆలోచన విధానమేంటి? ఆయనకు కనీస మానవత్వం ఉందా? అన్నారు. ఒక స్వాతంత్ర్య సమరయోధుడి కథతో తెరకెక్కిన ‘హరిహర వీరమల్లు’ సినిమా ప్లాప్ అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారా? ఇది ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. పిచ్చి ప్రేలాపనలు తగదని హెచ్చరించారు. సినిమా అంటే ఆషామాషీ విషయం కాదు.. దాని వెనుక ఎంతో మంది కృషి ఉంటుందనే విషయం గ్రహించాలన్నారు. సినిమా విడుదల కాకముందే ఒక రకమైన జడ్జిమెంట్ ఇవ్వడమంటే వేలాది కుటుంబాల జీవితాలతో ఆడుకోవడమేనని ఫైర్ అయ్యారు. నాడు బాధ్యత గల మంత్రిగా పనిచేశావా అసలు? అని ప్రశ్నించారు. సినిమా విడుదలకు ముందే హిట్టో ప్లాపో చెప్పేంత దైవాంశ సంభూతుడివా?. ఒక అంశంలో మీ పార్టీకి సంబంధించిన వ్యక్తే చనిపోతే ఫర్వాలేదనే రాజకీయం నడుపుతున్నారంటే, ఆయన చావును బట్టే ఈ ప్రభుత్వ పతనం ప్రారంభం అవుతుందని అన్నారంటే.. ఆయన చనిపోవాలని మీరు కోరుకుంటున్నారా? ఆయన చనిపోవడం ద్వారా మీరు రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తున్నారా? అని ప్రశ్నించారు. ఎక్కడైనా తప్పు ఉంటే చట్టపరంగా శిక్షించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని మరోసారి బల్లగుద్ది మరీ చెప్పారు. అంతే తప్ప, ఎవరూ చనిపోవాలని కోరుకోవడం లేదన్నారు. సినిమా రంగంపై మిడిమిడి జ్ఞానంతో మాట్లాడితే, అర్థరహితంగా వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
Also Read- Dil Raju: సమస్య మొదలైంది అక్కడే! పవన్ కళ్యాణ్ సినిమాను ఆపే దమ్ము ఎవరికీ లేదు
టాలీవుడ్‌పై కక్ష సాధింపు చర్యలు ఉండవు
సినిమా రంగాన్ని తామంతా ఉన్నతంగా చూస్తామన్నారు. అది ప్రజలకు వినోదాన్ని కలిగించే మాధ్యమంగా భావిస్తున్నామన్నారు. అంతేతప్ప గత ప్రభుత్వంలా తాము సినిమా హీరోలను, సినీ పెద్దలను కించపరచాలని భావించడం లేదని అన్నారు. సినీ రంగంపై ఏ దశలోనూ కక్ష సాధింపు చర్యలు తీసుకోబోమని స్పష్టతనిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సినీ రంగ ప్రముఖులతో సమావేశాన్ని నిర్వహించిన విషయం మరోమారు ఆయన గుర్తు చేశారు. సినీ రంగ సమస్యలను పరిష్కరించేందుకు తాము కట్టుబడి ఉంటామని, సినిమా వాళ్లకు ఎప్పుడూ అందుబాటులో ఉంటామని భరోసానిచ్చామన్నారు. సినీ ఇండస్ట్రీలో కొందరు ఏ ప్రయోజనాన్ని ఆశించి తమ సమస్యలు తామే పరిష్కరించుకుంటామని అంటున్నారో అర్థం కావడం లేదన్నారు. థియేటర్ల బంద్ అనే అంశం తెరపైకి వచ్చినప్పుడే ఈ విషయంపై సినిమా వారు స్పష్టతనిచ్చి ఉంటే ఈ సమస్య ఉత్పన్నమయ్యేది కాదన్నారు. సినిమా పరిశ్రమ, ప్రభుత్వం మధ్య అనుకూలమైన వాతావరణం ఉన్న సమయంలో తమకు ఎవరితో ఏ అవసరం లేదని ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ అనడం ఎంతవరకు సరైనదో ఆలోచించుకోవాలి. థియేటర్ల బంద్ వ్యవహారంపై హోంశాఖ విచారణ కొనసాగుతోందన్నారు. సినీ పరిశ్రమకు సంపూర్ణ మద్దతు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మరోసారి స్పష్టం చేస్తున్నానని తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు