AR Rahman: ఏఆర్ రెహమాన్ అనగానే ఆస్కార్, ఇంకా ఆయన సంగీతం అందించిన అనేక చిత్రాలలోని పాటలు గుర్తుకు వస్తాయి. ప్రస్తుతం ఆయన సినిమాలు చేయడం తగ్గించినా, పెద్దగా వివాదాల్లోకి వెళ్లినట్లుగా అయితే ఎక్కడా కనిపించలేదు. ఇస్లాం తీసుకునే సమయంలో, ఆ తర్వాత ఒకటి రెండు సందర్భాల్లో ఆయన పేరు వైరల్ అయింది కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం ఆయన చాలా కామ్‌గానే ఉంటున్నారు. కానీ తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు మాత్రం విస్ఫోటనంలా సోషల్ మీడియాను, ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ఇందులో విక్కీ కౌశల్ హీరోగా నటించిన భారీ చారిత్రక చిత్రం ‘ఛావా’ (Chhaava) గురించి ఆయన చేసిన కామెంట్స్ వివాదమవుతున్నాయి. విశేషం ఏంటంటే, ఈ చిత్రానికి సంగీతం అందించింది స్వయంగా రెహమానే కావడం!
సమాజాన్ని విభజించేలా ‘ఛావా’
‘ఛావా’ సినిమాపై రెహమాన్ (AR Rahman) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇది సమాజాన్ని విభజించేలా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న సన్నివేశాల్లో ‘సుభానల్లా’, ‘అల్హమ్దులిల్లా’ వంటి పవిత్రమైన పదాలను వాడటం తనకు చాలా ‘క్రింజ్’గా అనిపించిందని ఆయన బాంబు పేల్చారు. ఒక వర్గాన్ని కించపరిచేలా లేదా విభజనను ప్రోత్సహించేలా కంటెంట్ ఉండటం తనను బాధించిందని ఆయన కుండబద్దలు కొట్టారు. తాను మ్యూజిక్ ఇచ్చిన సినిమా గురించి ఇంత ఓపెన్‌గా విమర్శించడం సినిమా ఇండస్ట్రీలో మునుపెన్నడూ చూడని విషయం. అయినా ఆ సినిమా థియేటర్లలో కూడా లేదు. ఈ విషయం అప్పుడే చెప్పి ఉండవచ్చు కదా? అని ప్రశ్నించేవారు లేకపోలేదు.
Also Read- Ram Charan: తారక్‌తో స్నేహంపై మరోసారి చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
బాలీవుడ్‌లో కమ్యూనల్ పాలిటిక్స్
గత ఎనిమిదేళ్లుగా హిందీ చిత్ర పరిశ్రమలో (Bollywood) పవర్ షిఫ్ట్ జరిగిందని రెహమాన్ సంచలన ఆరోపణ చేశారు. ఇప్పుడు క్రియేటివిటీ ఉన్నవారి చేతుల్లో అధికారం లేదని, కేవలం వ్యాపార కోణం లేదా ఇతర అజెండాలు ఉన్నవారి చేతుల్లోనే ఇండస్ట్రీ నడుస్తోందని ఆయన విమర్శించారు. తనకు బాలీవుడ్‌లో అవకాశాలు తగ్గడానికి ‘కమ్యూనల్’ పరమైన కారణాలు ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ‘ఎవరూ నేరుగా నా మొహాన చెప్పలేదు కానీ, వారి మాటలు, ప్రవర్తన ద్వారా ఆ విషయం నాకు అర్థమవుతోంది’ అని ఆయన చెప్పడం పెద్ద దుమారం రేపుతోంది. ఒకప్పుడు హిందీ పరిశ్రమను ఏలిన రెహమాన్‌కు ఇలాంటి అనుభవం ఎదురవడం నిజంగా విడ్డూరమనే చెప్పుకోవాలి. ఈ వివక్ష పట్ల తానూ ఏమీ కుంగిపోలేదని రెహమాన్ చెప్పారు. బాలీవుడ్ నుంచి తనకు ప్రాజెక్టులు రాకపోయినా, ఆ సమయాన్ని తన కుటుంబంతో గడపడానికి, పిల్లలకు సంగీత పాఠాలు నేర్పడానికి ఉపయోగించుకున్నానని ఆయన పరిణతితో సమాధానమిచ్చారు.
Also Read- Gandhi Talks Teaser: ఒక్క మాట లేదు, అంతా మౌనం.. టీజరంతా డబ్బు, మ్యూజిక్కే!
భగ్గుమంటున్న బాలీవుడ్ వర్గాలు
రెహమాన్ వ్యాఖ్యలపై బాలీవుడ్‌లోని పలువురు నిర్మాతలు, దర్శకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. సినిమా అనేది చరిత్ర ఆధారంగా తీసినప్పుడు కొన్ని వాస్తవాలు చెప్పాల్సి ఉంటుందని, దానిని మతపరంగా చూడకూడదని వారు వాదిస్తున్నారు. రెహమాన్ వంటి పెద్ద వ్యక్తి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తగదని కొందరు ప్రముఖులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. సంగీత దర్శకుడిగా తన పని తాను చేసుకుపోయే రెహమాన్, ఇప్పుడు బాలీవుడ్ నైజాన్ని ప్రశ్నించడం ద్వారా ఒక పెద్ద చర్చకు తెరలేపారు. ఇది సినిమా పరిశ్రమలో రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తుందో చూడాలి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

