Kingdom: విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్‌డమ్’. సత్యదేవ్(Satya Dev), భాగ్యశ్రీ బోర్సే ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి (Gautham Tinnanuri) దర్శకుడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ‘హృదయం లోపల’ అనే పాట మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా ఈ మూవీ నుంచి రెండవ గీతం ‘అన్న అంటేనే’ను బుధవారం (జూలై 16) సాయంత్రం మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట ఎలా ఉందంటే..
Also Read- Nimisha Priya: ఆఖరి ‘నిమిష’oలో ఊహించని ట్విస్ట్.. మళ్ళీ మొదటికి!
వినగానే హృదయాన్ని హత్తుకునేలా ఈ పాటను యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) కంపోజ్ చేశారు. సోదరభావానికి ఒక వేడుకలా ‘అన్న అంటేనే’ గీతం ఇకపై నిలిచిపోతుందనడంలో అతిశయోక్తి లేనే లేదు. వినోదాన్ని అందించే పాటలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. కానీ, బంధాలను గుర్తు చేసే పాటలు, మనసుని తాకే పాటలు చాలా అరుదుగా వస్తుంటాయి. గతంలో అమ్మ, నాన్న, కుమార్తెలపై కన్నీరు పెట్టించే పాటలెన్నో వచ్చాయి. ఫస్ట్ టైమ్ అన్నపై ఓ తమ్ముడు కురిపించే ప్రేమకు అద్ధం పట్టేలా ఈ ‘అన్న అంటేనే’ పాట ఉంది. సోదరులుగా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ ఇందులో కొత్తగా కనిపిస్తున్నారు. నిజ జీవితంలో అన్నదమ్ముల్లాగానే వారిద్దరూ కనిపిస్తుండటం విశేషం. ఇద్దరూ తమదైన నటన, స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటలోని భావోద్వేగాన్ని లోతుగా పండించారు. ఈ గీతం తోబుట్టువుల ప్రేమకు పరిపూర్ణమైన నివాళిలా నిలుస్తుందనేలా అప్పుడే టాక్ మొదలైంది.
Also Read- Nithya Menen: జాతీయ అవార్డు తీసుకునే ముందురోజు నిత్యా మీనన్ ఏం చేసిందో తెలుసా?
ఈ ‘అన్న అంటేనే’ గీతాన్ని అనిరుధ్ రవిచందర్ స్వరపరచడంతో పాటు తనే పాడటం విశేషం. తనదైన సంగీతంతో, గాత్రంతో అనిరుధ్ మరోసారి తన స్పెషల్ ఏంటో తెలియజేశారు. వరుస బ్లాక్‌బస్టర్ గీతాలను అందిస్తూ, పాట పాటకు తన స్థాయిని పెంచుకుంటున్న అనిరుధ్.. ఇప్పుడు ఈ భావోద్వేగ గీతంతో తనలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించారు. కృష్ణకాంత్ ఈ పాటకు సాహిత్యం అందించారు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ సినిమా కోసం అద్భుతమైన కథను రెడీ చేశాడని, ఆ కథను అంతే అద్భుతంగా తెరపైకి తీసుకొచ్చి.. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి సిద్ధమవుతున్నారని నిర్మాతలు చెబుతున్నారు. ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ అంచనాలను అమాంతం పెంచుతూనే ఉంది. తాజాగా విడుదలైన అన్న అంటేనే’ గీతం దర్శకుడి బలమైన భావోద్వేగ దృష్టిని తెలియజేస్తుంది. జూలై 31న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలకు సిద్ధమవుతోన్న ఈ చిత్రం.. ప్రేక్షకులకు మునుపెన్నడూ చూడని గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందిస్తుందని నిర్మాతలు హామీ ఇస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు