Akira Nandan: ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ తన వ్యక్తిగత హక్కుల రక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అకీరా నందన్ దాఖలు చేసిన ఈ పిటిషన్ ప్రధానంగా ‘పర్సనాలిటీ రైట్స్’ (Personality Rights) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) దుర్వినియోగానికి సంబంధించింది. తన అనుమతి లేకుండా తన పేరు, ఫోటోలు, వాయిస్, వ్యక్తిగత వివరాలను ఏఐ టెక్నాలజీ ఉపయోగించి సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. కొందరు వ్యక్తులు, సంస్థలు అకీరా నందన్ పేరుతో ఫేక్ అకౌంట్లు సృష్టించి, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని, ఇది తన ప్రతిష్టకు భంగం కలిగిస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ విధమైన కంటెంట్ వల్ల తన వ్యక్తిగత భద్రతకు ముప్పు పొంచి ఉందని, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు.
Read also-Peddi Special Song: ‘పెద్ది’లో స్పెషల్ సాంగ్ కోసం రెడీ అవుతున్న టాప్ హీరోయిన్.. ఎవరంటే?
అనుమతి తప్పనిసరి..
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తన అనుమతి లేకుండా ఉన్న అభ్యంతరకరమైన ఫోటోలు, వీడియోలు, వాయిస్ క్లిప్‌లను తక్షణమే తొలగించాలని ఆయన కోరారు. అంతే కాకుండా భవిష్యత్తులో కూడా తన వ్యక్తిగత వివరాలను వాణిజ్య ప్రయోజనాల కోసం లేదా తప్పుడు ప్రచారం కోసం వాడకుండా ‘ఇంజంక్షన్ ఆర్డర్’ (Injunction Order) ఇవ్వాలని అన్నారు. ఐటీ నిబంధనల ప్రకారం ఇటువంటి కంటెంట్‌ను నియంత్రించడంలో విఫలమైన సోషల్ మీడియా సంస్థలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Read also-Barabar Premista: యాటిట్యూడ్ స్టార్ ‘బరాబర్ ప్రేమిస్తా’ అంటూ మళ్లీ వస్తున్నాడు.. ఎప్పుడంటే?
పర్సనాలిటీ రైట్స్ అంటే?
భారతదేశంలో సెలబ్రిటీలు తమ పేరు, రూపం, గొంతును ఇతరులు వ్యాపారాల కోసం వాడుకోకుండా ఉండేందుకు ఈ హక్కును వాడుకుంటారు. గతంలో అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్ వంటి ప్రముఖులు కూడా ఇలాగే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి తమ పర్సనాలిటీ రైట్స్ కాపాడుకున్నారు. అకీరా నందన్ కూడా అదే బాటలో ప్రైవసీ కోసం చట్టపరమైన పోరాటం మొదలుపెట్టారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం, సంబంధిత సోషల్ మీడియా సంస్థలకు, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. అకీరా నందన్ ఇంకా సినిమాల్లోకి రాకముందే తన డిజిటల్ ప్రెజెన్స్ విషయంలో ఇంత కఠినంగా వ్యవహరించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

