Akhanda 2: నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అఖండ 2’ (Akhanda 2) చిత్రం చివరి నిమిషంలో విడుదల వాయిదా పడటం టాలీవుడ్‌లో సంచలనంగా మారింది. ఈ ఊహించని పరిణామానికి ప్రధాన కారణం.. సినిమా నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ (14 Reels Plus) గత ప్రాజెక్టులకు సంబంధించిన ఫైనాన్స్‌ను క్లియర్ చేయకపోవడం. ఈ ఆర్థిక వివాదం కారణంగా, ఫైనాన్స్ సంస్థ అయిన ఎరోస్ ఇంటర్నేషనల్ (Eros International) మీడియా లిమిటెడ్ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం, ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థకు చెల్లించాల్సిన బాకీలను క్లియర్ చేసిన తర్వాతే సినిమాను విడుదల చేయాలని తీర్పు ఇచ్చింది. దీంతో, ప్రపంచవ్యాప్తంగా ‘అఖండ 2’ విడుదల ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీనికి సంబంధించిన న్యాయపరమైన వివాదం హైకోర్టులో నడుస్తుండగా, దీనికి 14 రీల్స్ సంస్థ రెస్పాండెంట్‌గా ఉంది. ప్రస్తుతం, ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు చిత్ర నిర్మాతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారగా, దీనికి సంబంధించిన మరొక అనూహ్య కోణం తెరపైకి వచ్చింది.
వేణు స్వామిపై ఫ్యాన్స్ ఫైర్!
‘అఖండ 2’ విడుదల వాయిదా పడటంతో ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామిపై నెటిజన్లు, ముఖ్యంగా నందమూరి అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నారు. ఇటీవల వేణు స్వామి (Venu Swamy) ఓ యాగం నిర్వహిస్తూ కనిపించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రస్తుతం త్వరలో విడుదల కాబోతున్న ఒక పెద్ద సినిమా కోసం తాను బగళాముఖి దేవి యాగం చేస్తున్నట్లుగా తెలిపారు. అయితే ఆయన సినిమా పేరును మాత్రం స్పష్టంగా చెప్పలేదు. ఈ యాగం ప్రకటన, సరిగ్గా ‘అఖండ 2’ విడుదల ఆగిపోయిన సమయానికి మ్యాచ్ కావడంతో, ఈ వివాదం పూర్తిగా వేణు స్వామి వైపు మళ్లింది. బాలకృష్ణ అభిమానులు, నెటిజన్లు వేణు స్వామిని నిందిస్తూ, ఆయన చేసిన పూజలు ఈ సినిమాకు కలిసి రాలేదని, ఆయన పూజలు మరోసారి విఫలమయ్యాయని రకరకాలుగా (ఇక్కడ చెప్పకూడని విధంగా) కామెంట్స్ చేస్తున్నారు.
అడ్డంగా బుక్కయ్యాడు
మొత్తంగా చూస్తే… కోర్టు వివాదం కారణంగా ‘అఖండ 2’ విడుదలకు బ్రేక్ పడగా, ఊహించని విధంగా ఈ సమస్యకు నందమూరి అభిమానుల దృష్టిలో వేణు స్వామి అడ్డంగా బుక్కయ్యారని, ఆయనపై విమర్శల జడివాన కురుస్తోందని చెప్పుకోవచ్చు. ఈ ఫైనాన్స్ వివాదం ఎప్పుడు పరిష్కారమవుతుందో, బాలయ్య ‘అఖండ 2’ ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందో తెలియక ఫ్యాన్స్ నిరీక్షిస్తున్నారు. ఈ సమస్యను ఓ కొలిక్కి తెచ్చేందుకు తెలుగు సినిమా ఇండస్ట్రీ (Tollywood)లోని పెద్దలు కూడా ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

