Aditya 369 4K: తొలి భారతీయ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ఆదిత్య 369’ రీ-రిలీజ్‌కు రెడీ అవుతోంది. అందునా 4K వెర్షన్‌లో ఈ సినిమాను రెడీ చేస్తున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు ఉన్నాయి. అందులో కొన్ని ప్రజల హృదయాల్లో, కళాభిమానుల లైబ్రరీలలో ఉండేవి మాత్రం కొన్నే. అందులో సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ‘ఆదిత్య 369’ ఒకటని ఘంటాపథంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా వచ్చి చాలా కాలం అవుతుంది. కానీ ఎప్పుడు చూసినా కూడా ఫ్రెష్‌గానే అనిపిస్తుంది. సినిమా చూసిన ప్రతిసారి సరికొత్త అనుభూతిని ఇస్తూ వస్తున్న ఈ సినిమాకు అప్పుడు, ఇప్పుడు అని తేడా లేకుండా అన్ని తరాలు ఫిదా అవుతుంటాయి. అలాంటి కంటెంట్ ఈ సినిమా సొంతం. ఇప్పుడీ సినిమాను 4కె వెర్షన్‌లో మేకర్స్ రీ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
Also Read- Rashmika Mandanna: రష్మికకు వింత అలవాటు.. అదేం పని?
Aditya 369 హైలెట్స్ ఇవే
నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శ్రీ దేవి మూవీస్ సంస్థ నిర్మించిన తొలి భారతీయ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ఆదిత్య 369’. ఈ సినిమాను నేటి సాంకేతికతలకి అనుగుణంగా డిజిటలైజ్ చేసి ఈ సమ్మర్‌లో గ్రాండ్ రీ-రిలీజ్‌కి సిద్ధం చేస్తున్నా మేకర్స్. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ నేపథ్యంలో వచ్చిన మొదటి సినిమాగా పేరొందిన ఈ సినిమా.. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో శ్రీ కృష్ణదేవరాయలుగా నందమూరి బాలకృష్ణ నటన, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వ నైపుణ్యం, ఎస్.పి బాల సుబ్రహ్మణ్యం గాత్రం-సమర్పణ, జంధ్యాల సంభాషణలు, ఇళయరాజా అద్భుతమైన సంగీతం, శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణ విలువలు, ఇతర నటీనటుల ప్రతిభ, అబ్బుర పరిచే సెట్స్, ఫైట్స్, దుస్తులు, నృత్యం ఇలా ఒక్కటేమిటి.. సినిమాలోని ప్రతి సన్నివేశం చరిత్రలో నిలిచిపోయేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఇప్పుడీ సినిమా రీ రిలీజ్ అంటే నందమూరి అభిమానులకే కాదు, ప్రేక్షకులందరికీ పండగే అని చెప్పుకోవచ్చు.
ఇప్పుడూ అదే ఉత్సాహం, ఆసక్తి
ఈ సినిమా రీ- రిలీజ్ ప్రకటన సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘ఆదిత్య 369’ మొదటిసారి విడుదల సమయంలో ఎంత ఉత్సాహంగా, ఆసక్తిగా ఉన్నానో, ఇపుడు రీ-రిలీజ్ విషయంలో కూడా అలాగే ఉన్నాను. ఎన్ని సార్లు చూసినా కనువిందు చేసే ఈ ట్రెండ్ సెట్టింగ్ సినిమాను డిజిటలైజ్ చేసి 4Kలో ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దాo. అన్ని వయసుల, వర్గాల ప్రేక్షకులని, నందమూరి అభిమానులను అలరించిన ఈ చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎన్నో మంచి చిత్రాలు తెరకెక్కించిన నాకు, మా నిర్మాణ సంస్థకి ఒక గొప్ప గుర్తింపు, అద్భుతమైన పునాది పడింది ఈ ‘ఆదిత్య 369’ సినిమాతోనే. ఈ సమ్మర్‌లో గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేయడానికి అన్నీ సిద్ధం చేస్తున్నామని తెలిపారు.