Dinesh Karthik : టీమ్ ఇండియా మాజీ ప్లేయర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్, 38 ఏళ్ల దినేష్ కార్తీక్ క్రికెట్ కి గుడ్ బై చెప్పనున్నట్టు వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 17వ సీజన్‌తో లీగ్ మ్యాచ్ ల నుంచి కూడా దూరం అవుతున్నాడని సమాచారం.
2008 ఐపీఎల్ ప్రారంభం నుంచి లీగ్‌లో కొనసాగుతున్న కార్తిక్ గత 16 సీజన్లలోనూ ఆడాడు. ఐపీఎల్ కెరీర్‌లో కేవలం రెండే రెండు మ్యాచ్‌లకు మాత్రమే దూరమయ్యాడు. తర్వాత ప్రతి మ్యాచ్ లో ఆడాడు.
ఢిల్లీ డేర్ డెవిల్స్, కోల్ కతా నైట్ రైడర్స్, గుజరాత్ లయన్స్, ముంబాయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ఇలా ఆరు ఫ్రాంచైజీల తరఫున ఆడాడు. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఉన్నాడు.
మొత్తంగా 240 మ్యాచ్‌లు ఆడిన దినేశ్ కార్తీక్ 4,516 పరుగులు చేశాడు. 50 అర్ధ శతకాలు బాదాడు. అత్యధిక మందిని అవుట్ చేసిన రెండో వికెట్ కీపర్‌గా ధోనీ తర్వాతి స్థానంలో కార్తీక్ నిలిచాడు. మొత్తం 133 మందిని తన చేతుల మీదుగా అవుట్ చేసి పెవిలియన్ కు పంపించాడు.
టీమ్ ఇండియాలో చూస్తే తన ప్రస్థానం పడుతూ లేస్తూనే సాగింది. అప్పుడప్పుడు రావడం హడావుడి చేయడం తిరిగి వెళ్లిపోవడం జరిగింది. మొత్తానికి 26 టెస్ట్ మ్యాచ్ లు ఆడి 1,025 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 7 ఆఫ్ సెంచరీలు ఉన్నాయి. వికెట్ కీపర్ గా 57 క్యాచ్ లు పట్టాడు. 6 స్టంపింగ్ లు చేశాడు. వన్డేల్లో చూస్తే 94 మ్యాచ్ లు ఆడి 1,752 పరుగులు చేశాడు. 9 ఆఫ్ సెంచరీలు చేశాడు. 64 క్యాచ్ లు పట్టాడు. 7 స్టంపింగ్ లు చేశాడు. టీ 20ల్లో చూస్తే 56 మ్యాచ్ లు ఆడి 672 పరుగులు చేశాడు. 26 క్యాచ్ లు పట్టాడు, 8 స్టంపింగ్ లు చేశాడు.
ప్రస్తుతం దినేశ్ కార్తిక్ కామెంటేటర్ అవతారం ఎత్తాడు. ఇంగ్లాండ్- ఇండియా మ్యాచ్ లో కామెంటేటర్ గా స్టార్ట్ చేశాడు. ఇంతవరకు ఐపీఎల్ ట్రోఫీ అందని ఆర్సీబీకి మరి కప్ అందించి ఘనంగా క్రికెట్ కు వీడ్కోలు పలుకుతాడని అభిమానులు నెట్టింట కామెంట్ చేస్తున్నారు.
జాతీయ జట్టుకన్నా ఐపీఎల్ లోనే తనకి మంచి పేరు వచ్చింది. మొత్తానికి మరో మంచి క్రికెటర్ క్రికెట్ కి గుడ్ బై చెబుతున్నాడు.