Karimnagar Crime: భర్తలని భార్యలు చంపుతున్న ఘటనలు ఇటీవల కాలంలో భారీగా పెరిగిపోయాయి. కుటుంబ కలహాలు, అక్రమ సంబంధాల కారణంగా భర్తలను అత్యంత దారుణంగా కొందరు భార్యలు చంపేస్తున్నారు. తాజాగా కరీంనగర్ లో కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. చెడు వ్యసనాలకు అలవాటు పడి.. భర్తను మరో ఐదుగురి సహాయంతో భార్య దారుణంగా హత్య చేసింది.
వివరాల్లోకి వెళ్తే..
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సప్తగిరి కాలనీలో కత్తి సురేష్, మౌనిక నివాసం ఉంటున్నారు. పదేళ్ళ క్రితం ప్రేమించి పెళ్ళి చేసుకున్న వీరిద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా సురేష్ టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. పెళ్లైన కొంతకాలం వరకూ బాగానే ఉన్న ఈ జంట.. ఆ తర్వాత నుంచి తరుచూ గొడవ పడటం ప్రారంభించారు. మరోవైపు భార్య మౌనిక చెడు వ్యసనాలకు బానిస కావడంతో వాటికి అడ్డుగా వస్తున్న భర్తపై మరింత కోపం పెంచుకుంది. ఎలాగైన అతడ్ని తప్పించాలని నిర్ణయించుకుంది.
మెడికల్ ఏజెన్సీ యజమాని సూచనతో..
కత్తి సురేష్ ను హత్య చేసేందుకు భార్య మౌనిక ప్లాన్ వేసింది. ఇందుకోసం తనకు పరిచయమున్న ఐదుగురు వ్యక్తుల సాయం కోరింది. ముందుగా తన ప్లాన్ గురించి బంధువైన అరిగే శ్రీజకు తెలియజేసింది. అమె మెడికల్ ఏజెన్సీ యజమాని పోతు శివకృష్ణ మరో స్నేహితురాలు సంధ్యను మౌనికకి పరిచయం చేసింది. వీరంతా కలిసి సురేష్ ని హత్య చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. మెడికల్ ఏజెన్సీ యజమాని శివకృష్ణ వయాగ్రా, బీపీ మాత్రలతో సురేష్ ని చంపవచ్చని వారికి సూచించారు.
కూరలో 15 వయాగ్రా మాత్రలు కలిపి..
శివకృష్ణ సూచన మేరకు మెడికల్ షాపులోకి వెళ్ళి పదిహేను వయగ్రా మాత్రలను మౌనిక తీసుకువచ్చింది. వాటిని భర్తకు పెట్టే కూరలో కలిపేసింది. అయితే కూర వాసన రావడంతో దానిని తినకుండా సురేష్ ప్లేటును పక్కన పెట్టేయడంతో ఆమె ప్లాన్ బెడిసికొట్టింది. ఇక రెండో ప్లాన్ లో భాగంగా బీపీ, నిద్ర మాత్రలను చూర్ణం చేసి మద్యంలో కలిపి సురేష్ కు ఇచ్చింది. అది తాగిన వెంటనే కత్తి సురేష్ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. తరువాత చీరని ఒక ప్రక్క కిటికి గ్రిల్ కి కట్టి మరో ప్రక్క సురేష్ మెడకి బిగించి ఉరేసి చంపింది.
Also Read: Singareni Bonus 2025: సింగరేణి అదిరిపోయే గుడ్ న్యూస్.. ఉద్యోగులకు భారీగా బోనస్.. ఎంతో తెలిస్తే షాకే!
హత్యను కప్పిపుచ్చే యత్నం
అయితే మౌనిక ఈ హత్యని కప్పి పుచ్చుకోవడానికి సురేష్ లైంగిక చర్య సమయంలో సృహ కోల్పోయాడని అత్తమామలకి ఫోన్ చేసి చెప్పింది. అసుపత్రికి తీసుకు వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించడానికి యత్నించింది. అప్పటికే సురేష్ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. దీంతో సాధారాణ మరణంగానే బంధువులు అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే పోలీసు స్టేషన్ లో కేసు పెడితే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని కొందరు సూచించడంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగు చూసింది. పక్కా ప్లాన్ ప్రకారమే భర్త కత్తి సురేష్ ను మౌనిక హత్య చేసిందని తేల్చారు. మౌనికతో పాటు హత్యకు సహకరించిన శ్రీజ, శివకృష్ణ, అజయ్, సంధ్య, దేవదాసులని అరెస్టు చేసి రిమాండ్ కి పంపించారు.
