– వర్కవుట్ అయిన అసెంబ్లీ ఎన్నికల ప్లాన్స్
– లోక్‌సభ ఎలక్షన్‌లోనూ అదే సెంటిమెంట్
– ఏప్రిల్ మొదటి వారంలో తుక్కుగూడలో భారీ బహిరంగ సభ
– ఇదే వేదిక నుంచి గతంలో ఆరు గ్యారెంటీల ప్రకటన
– లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈసారి తెలుగు మేనిఫెస్టో విడుదల
– ప్రచారాన్నీ మొదలు పెట్టనున్న రాష్ట్ర నేతలు
CM Revanth reddy Tukkuguda Sentiment : తెలంగాణలో అధికారం చేపట్టడానికి కాంగ్రెస్ పదేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన పార్టీగా ముద్రపడినా అధికారం కోసం ప్రజలు పదేళ్లపాటు ఎదురుచూసేలా చేశారు. ఎట్టకేలకు రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ కాంగ్రెస్ ఈ మధ్యే అధికార పీఠాన్ని దక్కించుకుంది. తనదైన రీతిలో పాలన సాగిస్తోంది. అయితే, పార్లమెంట్ ఎన్నికలు ఇప్పుడు కాంగ్రెస్ ముందున్న పెద్ద టాస్క్. అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన మాదిరిగానే లోక్‌సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని వ్యూహాల్లో ఉంది. అసెంబ్లీలో గ్రామస్థాయిలో విజయకేతనం ఎగురవేసినా, గ్రేటర్ పరిధిలో అంతగా రాణించలేదు. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి చేరికలను ప్రోత్సహిస్తోంది. బీఆర్ఎస్ నుంచి వరదలా కాంగ్రెస్‌లోకి నేతలు వస్తున్నారు. ఎలాగైనా సరే 14 సీట్లలో జయకేతనం ఎగురవేయాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదలకుండా ముందుకు వెళ్లాలని చూస్తోంది. ఈ క్రమంలోనే సెంటిమెంట్‌ను కూడా నమ్ముకుంటోంది.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో విజయభేరి పేరుతో తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహించింది కాంగ్రెస్. పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే సహా అందరూ హాజరయ్యారు. ఇదే వేదిక పైనుంచి ఆరు గ్యారెంటీల ప్రకటన చేశారు సోనియా గాంధీ. తెలంగాణలో హస్తం పార్టీ విజయానికి ఇక్కడి నుంచే పునాది పడింది. ఈ ఆరు గ్యారెంటీలు అప్పటికి కేసీఆర్ పాలనలో అవస్థ పడుతున్న ప్రజలకు ఆశాదీపంగా కనిపించాయి. గ్రామీణస్థాయి ప్రజానీకం హస్తానికి జేజేలు పలికింది. ఈవీఎంలలో హస్తం గుర్తుకు వరుసబెట్టి నొక్కేశారు జనం.
Read Also : అనుకున్నదొక్కటి, అయినదొక్కటి..!
ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇదే సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తోంది కాంగ్రెస్. ఏప్రిల్ మొదటి వారంలో తుక్కుగూడలో భారీ బహిరంగ సభకు నిర్ణయించింది. ఈ సభకు అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే హాజరుకానున్నారు. ఇదే వేదిక నుంచి తెలుగులో ఏఐసీసీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడులైన తరువాత ఏర్పాటు చేస్తున్న మొదటి సభ కావడంతో రాష్ట్ర నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడ నుంచే లోక్‌సభ ఎన్నికలకు ప్రచారాన్ని మొదలు పెట్టనున్నారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.