– ఓ వైపు బెయిల్ నిరాకరణ
– ఇంకోవైపు కస్టడీ పొడిగింపు
– కవితను వెంటాడుతున్న కష్టాలు
– హైబీపీ అని సాకు చెప్పినా వినని కోర్టు
– 26 వరకు ఈడీ కస్టడీలోనే
– కేజ్రీవాల్‌తో కలిపి విచారణ
– బంధువుల ఇళ్లలోనూ సోదాలు
Whatever You Think, Whatever Happens : ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ కేసులో ఆమెకు మరో మూడు రోజుల కస్టడీ పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఈడీ వాదనలకు ఏకీభవించిన న్యాయస్థానం ఈనెల 26 వరకు కస్టడీకి అవకాశమిచ్చింది. ముడు రోజుల అనంతరం కోర్టులో హాజరుపరచాలని ఈడీకి సూచించింది. అదేవిధంగా కవిత బెయిల్ పిటిషన్‌పై ఈనెల 26న విచారించడానికి కోర్టు అనుమతించింది.
దీంతో ఢిల్లీ లిక్కర్ కేసులో ఈ మూడు రోజులే కీలకంగా మారనున్నాయి. కవితను కేజ్రీవాల్‌తో కలిపి విచారించనున్నారు ఈడీ అధికారులు. ఇప్పటికే ఫోన్ డేటా, చాటింగ్‌లను ఈడీ సేకరించింది. ఆ చాటింగ్‌లను ఇద్దరి ముందు ఉంచి విచారించే అవకాశం ఉంది. కవిత మొబైల్ ఫోన్ నుంచి డేటా సేకరించి విశ్లేషించామని ఫోరెన్సిక్ ఎవిడెన్స్‌తో దాన్ని సరిపోల్చామని ఈడీ వెల్లడించింది. కొంత డేటా డిలీట్ చేసినట్లు గుర్తించామన్నారు అధికారులు. మరోవైపు, కవిత బంధువుల ఇళ్లలో సోదాలు జరిపారు. కుటుంబసభ్యుల వ్యాపారాల వివరాలు చెప్పడానికి కవిత నిరాకరించారని ఈడీ అంటోంది. ఈ మూడు రోజుల్లో ఆమె బంధువుల ఇళ్ల నుంచి సేకరించిన ఆధారాలపై ప్రశ్నించనుంది. నగదు బదిలీలో ఆమె బంధువులను సమీర్ మహేంద్రు వినియోగించుకున్నట్లు గుర్తించామని కోర్టుకు తెలిపింది ఈడీ.
Read More: నో వేస్టేజ్, కోలుకుంటున్న ఖజానా…!
సమీర్ మహేంద్రు విచారణకు అనుమతించాలని అప్లికేషన్ దాఖలు చేసింది. ఇటు, కవిత తరఫు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కవితను అక్రమంగా అరెస్ట్ చేశారని, రాజకీయ కుట్రలో భాగంగా అక్రమ అరెస్టు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ అరెస్ట్‌పై ఈడీకి నోటీసులు ఇవ్వాలని కోరారు. అలాగే, తనకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయని తీవ్రమైన రక్తపోటుతో బాధపడుతున్నానని కోర్టుకు నివేదించారు కవిత. మందులు వాడుతున్నా కంట్రోల్ కావడం లేదని, ఈడీ అధికారులు వైద్య పరీక్షల నివేదికలు ఇవ్వడం లేదంటూ ఆరోపించారు. తనకు మెడికల్ రిపోర్ట్స్ ఇప్పించాలంటూ కోర్టును కోరారు. ఇరు తరఫు వాదనల అనంతరం కోర్టు కవితను మరో 3 రోజుల కస్టడీకి అనుమతించింది.