YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో రైతుల సమస్యలు పై చర్చించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడం లేదన్న షర్మిల.. అందుకే ఆత్మహత్య లు పెరిగాయని ఆరోపించారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందంటే కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. రైతులకు రూ.20 వేలు ఇస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పి మాట తప్పారని షర్మిల విమర్శించారు.
‘కేంద్రానికి మద్దతు ఎందుకు’
గతంలో తన తండ్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి.. రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని షర్మిల గుర్తు చేశారు. ‘చంద్రబాబు వల్లే మోడీ అధికారంలో ఉన్నా ఏపీకి మేలు చేయలేక పోతున్నారు. యూరియా కూడా ఇవ్వలేక పోతే… మీరు మద్దతు ఎందుకు ఇస్తున్నట్లు. రైతుల పక్షాన కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తుంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడాన్ని కాంగ్రెస్ ఖండిస్తోంది. జగన్ ప్రభుత్వం పూర్తి చేయలేక పోతే.. చంద్రబాబు ప్రభుత్వం పూర్తి చేయకూడదా? పిపిపి విధానంలో నిర్మాణం చేస్తే ఫీజుల భారం పడుతుంది. ఇలా ప్రైవేటు పరం చేస్తే పేదలకు చదువుకునే అవకాశం ఉండదు. చంద్రబాబు మీరు అధికారంలో ఉన్నారు. ప్రధాని మోదీని ఒప్పించి ప్రభుత్వమే నిర్మాణం చేయాలి’ అని షర్మిల అన్నారు.
సూపర్ సిక్స్.. సూపర్ ఫ్లాప్!
సూపర్ సిక్స్ సూపర్ ప్లాప్ అయినా ఏపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని వైఎస్ షర్మిల విమర్శించారు. ‘మహిళలకు రూ.1,500 పథకం ఎక్కడ అమలు చేశారు. రైతులకు ఇచ్చే డబ్బులు కేంద్రంతో ముడి పెట్టి ఇస్తున్నారు. 20 లక్షల మంది బిడ్టలు ఉంటే కొంతమందికే ఇస్తున్నారు’ అని షర్మిల ఆరోపించారు.
‘నా బిడ్డ వైయస్సార్ వారసుడే’
తన బిడ్డ రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తారంటే వైసీపీకి ఎందుకంత కలవపాటు అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ‘నా బిడ్ట ఇంకా రాజకీయాల్లోకి అడుగు పెట్టలేదు. వైసీపీ ఇంతలా రియాక్ట్ అవుతుందంటే వారికి భయమా? బెదురా?. నా బిడ్డకు రాజారెడ్డి అని వైయస్సార్ పేరు పెట్టారు. నా బిడ్డ వైయస్సార్ వారసుడే. ఎవరెన్ని వాగినా అది ఎవరూ కాదనలేరు. చంద్రబాబు చెబితే.. నా బిడ్ట ను రాజకీయాల్లోకి తెచ్చాం అంటున్నారు’ అంటూ షర్మిల మండిపడ్డారు.
Also Read: Viral Video: బాత్రూం ఖాళీగా లేదా? ఈ పని చేయడానికి మెట్రోనే దొరికిందా!
జగన్‌పై ఘాటు విమర్శలు
మరోవైపు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి వైసీపీ అధినేత జగన్ మద్దతు ఇవ్వడాన్ని వైఎస్ షర్మిల తప్పుబట్టారు. ‘జగన్ నిస్సిగ్గుగా ఆర్.యస్ యస్ అభ్యర్దికి కు ఎలా మద్దతు ఇచ్చారు. బీజేపీని, ఆర్.యస్.యస్ ను దూరం పెట్టిన నేత వైయస్సార్. నా తండ్రి బతికి ఉంటే జగన్ చేసిన పనికి తల దించుకునే వారు. మోదీకి జగన్ దత్త పుత్రుడు. అందుకే ఆయన చెప్పినట్లు ఆడుతున్నాడు. వైఎస్ మరణం వెనుక రిలయన్స్ ఉందన్న జగన్.. మోదీ వల్లే వారికి రాజ్యసభ ఇచ్చారు. జగన్ ఏ ముఖం పెట్టుకుని ప్రజలకు సమాధానం చెబుతారో చెప్పాలి. కూటమి బహిరంగంగా పొత్తు పెట్టుకుంటే.. జగన్ మోదీతో అక్రమ పొత్తు పెట్టుకున్నారు. జగన్ కు అసలు ఐడియాలజీ మిగిలి ఉందా? బీజేపీ ఐడియాలజీనే వైసీపీ ఐడియాలజీనా?. జగన్ మీ చేతి మీద బీజేపీ అని పచ్చ బొట్టు వేసుకోండి. చేయి ఎత్తగానే అందరికీ కనిపిస్తుంది’ అంటూ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.