YS Sharmila: రాష్ట్రంలో మిర్చి ధరలు రైతులకు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. పెట్టుబడి కూడా రాకపోవడంతో రైతన్న దిగాలు పడ్డాడు. ఎన్నడూ లేనివిధంగా ఈసారి ధర తగ్గిపోవడంతో ఏం చేయాలో తెలియని అయోమయంలో పడ్డాడు. ప్రభుత్వం తన వంతుగా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నది. రైతులు ఎవరూ ఆధైర్యపడొద్దని సీఎం చంద్రబాబు భరోసానిస్తున్నారు. కానీ, విపక్షాలు ఈ పాపం అంతా కూటమి ప్రభుత్వానిదేనని విమర్శలు చేస్తున్నాయి. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మాట్లాడుతూ, ప్రభుత్వంపై మండిపడ్డారు.
రైతుల కళ్లలో కారం
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎర్ర బంగారం రైతులను ఏడిపిస్తున్నదని షర్మిల అన్నారు. మిర్చి పంట నష్టాల ఘాటుకు రైతన్న ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడని, పెట్టుబడి మందం రాక అడ్డికి పావుషేరు కింద అమ్ముకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. క్వింటాకు 15 వేల రూపాయల నష్టంతో అమ్ముకుంటుంటే, అండగా నిలవాల్సిన కూటమి ప్రభుత్వం, మిర్చి రైతుల కళ్లలో కారం కొడుతున్నదని ఆరోపించారు. మిర్చి రైతులకు 11 వేల రూపాయల మద్దతు ధర ఇచ్చి ఉద్దరించినట్లు, ప్రభుత్వం గప్పాలు కొడుతున్నదని మండిపడ్డారు. రైతులు ఎకరాకు లక్షన్నర వరకు పెట్టుబడి పెట్టారని వివరించారు. చివరకు ఆ లక్షన్నర కూడా రాని పరిస్థితి ఏర్పడిందని, కన్నీళ్లు పెట్టుకుంటున్నట్టు చెప్పారు. కౌలు రైతుకు అదనంగా 50 వేల రూపాయల వరకు నష్టమేనని తెలిపారు.
కేంద్రం కూడా అంతే
రాష్ట్ర రైతులపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదని షర్మిల విమర్శించారు. నిజంగా ప్రేమనే ఉంటే, వెంటనే మిర్చి పంటకు కనీస ధర 26 వేల రూపాయలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలన్నారు. నష్టపోతున్న మిర్చి రైతును ఆదుకోవాలని చెప్పారు. ధరల స్థిరీకరణ నిధి వెంటనే అమలు చేయాలన్నారు. కేంద్రం ఇచ్చే ధరతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మిర్చి రైతుకు బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
టమాటా రైతుదీ ఇదే దుస్థితి
ఓవైపు మిర్చి రైతు విలవిలలాడుతుండగా, ఇంకోవైపు టమాటా రైతులకు కూడా తీరని కష్టాలు వచ్చి పడ్డాయి. గిట్టుబాటు ధర లేక, కనీసం పెట్టుబడి రాక వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పడిపోవడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని వివరించారు. మార్కెట్‌లో కేజీ టమాటా రూ.15 పలుకుతుంటే, రైతుకు రూ.3, రూ.4 దక్కడం ఏంటని ప్రశ్నించారు. ఎకరాకు రెండున్నర లక్షల పెట్టుబడి పెట్టిన చోట రూ.50 వేల మందం కూడా ఆదాయం లేదన్నారు. వెంటనే టమాటా రైతును ఆదుకోవాలని, ధరలు పడిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.