Ys Jagan | ఏపీలో రాబోయేది వైసీపీ 2.0 పాలనే అని మాజీ సీఎం జగన్ అన్నారు. తాను రాజకీయాల్లో 25–30 ఏళ్ల దాకా ఉంటానని.. తప్పు చేసిన ఎవరినీ వదిలిపెట్టేది లేదంటూ హెచ్చరించారు. వైసీపీ పార్టీ నేతలను నమ్ముకుని రాలేదని.. ప్రజలకు నమ్ముకుని వచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలును ఇబ్బంది పెడుతుందన్నారు. కూటమి అబద్ధాలను ప్రజలు గుర్తిస్తున్నారని.. త్వరలోనే వారిని కాలర్ పట్టుకుని ప్రశ్నించే రోజులు వస్తాయన్నారు.
బుధవారం ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో జగన్ మీటింగ్ నిర్వహించారు. ప్రభుత్వం చెబుతున్న దాన్ని ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరని.. అభివృద్ధి అంటూ చేతుల్లో ఆకాశాన్ని చూపిస్తున్నారంటూ జగన్ విమర్శించారు. వైసీపీ పార్టీని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నేతలు కృషి చేయాలని సూచించారు. ఇన్ని రోజులు చేసిన దానికి భిన్నంగా రాజకీయాలు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోనే ఎండగట్టాలని.. ఒకింత రాజకీయం మార్చుకోవాల్సిన అవసరం వచ్చిందని జగన్ అన్నారు.