స్వేచ్ఛ, సెంట్రల్ డెస్క్: ఎంపీ విజయసాయిరెడ్డి (Vijaysai Reddy) రాజకీయాలకు గుడ్ బై చెప్పిన తర్వాత లేనిపోని అనుమానాలు వైసీపీ శ్రేణులకు వస్తున్నాయి. పార్టీ క్యాడర్‌లో మునుపెన్నడూ లేని భయాందోళనలు మొదలయ్యాయి. ఇకపై పార్టీలో, రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయని క్యాడర్ కంగారు పడుతోంది. ఎందుకంటే ఇన్నాళ్లు వైసీపీకి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న ఆయన అక్రమాస్తుల కేసుల్లో అప్రూవర్‌గా మారే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయని న్యాయ నిపుణులు సైతం చెబుతున్నారు. ఎందుకంటే రాజకీయాలు వద్దనుకున్నాక తన పనుల్లో తాను మునిగినా ఇబ్బందులు తప్పవని, క్లీన్ చిట్ కోసం సాయిరెడ్డి తొలుత ప్రయత్నాలు చేస్తారని అత్యంత సన్నిహితులు చెబుతున్నారు.
అలా జరిగితే గంటల వ్యవధిలోనే వైఎస్ జగన్‌ను ఎమ్మెల్యేగా డిస్ క్వాలిఫై చేయడం పక్కా. ఆ తర్వాత ఆయన అరెస్టై మళ్లీ జైలులో ఊచలు లెక్కపెట్టే పరిస్థితులు తప్పక వస్తాయని రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇదే అయితే పులివెందుల ఉప ఎన్నిక తప్పదని టీడీపీ వర్గాలు ఫుల్ జోష్‌తో ఉన్నాయి. ఉప ఎన్నిక వస్తే వైసీపీ తరఫున పోటీ చేసేది ఎవరు? వైఎస్ భారతి బరిలోకి దిగుతారా? లేకుంటే సతీష్ రెడ్డి లేదా వైఎస్ ఫ్యామిలీ మరొకరు ఎవరైనా పోటీ చేస్తారా? అనేదానిపైనా సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. అయితే ఇన్నాళ్లు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న వైసీపీ శ్రేణులు విజయసాయిరెడ్డి (Vijaysai Reddy) రాజీనామాతో ఒక్కసారిగా డీలా పడిపోయారు. కనీసం కౌంటర్ కూడా ఇచ్చుకునే పరిస్థితులు లేకపోవడం గమనార్హం.
Nara Lokesh: నాలో నమ్మకం పెరిగింది.. డిప్యూటీపై లోకేశ్ క్లారిటీ
నంబర్-2 ఎవరు?
ఒకవేళ జగన్ జైలుకెళ్లే పరిస్థితి వస్తే పార్టీని ముందుకు నడిపేది ఎవరు? అనేది ఇప్పుడు కార్యకర్తల మదిలో మెదులుతున్న మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే అరెస్ట్ అనేది జరిగితే పార్టీ పరిస్థితేంటి? పార్టీలో ఉండేదెవరు? ఊడిపోయేది ఎవరు? అసలు పార్టీ మనుగడే ప్రశ్నార్థకం అని సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు కంగారు పడిపోతున్నారు. పోనీ వైసీపీ అధికారంలోకి వచ్చాక సకల శాఖ మంత్రిగా, ఓడిపోయాక అన్నీ తానై చూసుకుంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి చూసుకుంటారా? భారతి చేతిలోకి పార్టీ పగ్గాలు వస్తాయా? ఇలా లేనిపోని ప్రశ్నలు సైతం వస్తున్నాయి. భారతి ఇన్నాళ్లు తెరవెనుక మాత్రమే ఉన్నారు కానీ రాజకీయంగా ఎలాంటి అనుభవం లేదు. కనీసం అటు క్యాడర్, ఇటు నేతలను సమన్వయం చేసుకునే సత్తా కూడా భారతికి లేనే లేదు.
అలా అని సజ్జల చేతికి వెళ్తే మాత్రం ఉన్న పార్టీ గంగలో కలిసిపోవడం ఖాయం అని, పార్టీని మరిచిపోవాల్సి వస్తే ఆయనకు పగ్గాలు కట్టబెట్టండి అని క్యాడర్ నిట్టూరుస్తోంది. ఇవన్నీ కాకుండా సోదరి వైఎస్ షర్మిల మళ్లీ అన్నకు దగ్గరవుతారా అంటే ఆ సమస్యే లేదు. రేపొద్దున్న ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ తరఫున పోటీ చేయడానికి ముందుంటారే తప్ప అస్సలు కలిసిపోయే సాహసమే చేయరు. పోనీ వైఎస్ విజయమ్మ పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశం ఉందా? అంటే ప్రశ్నార్థకమే. ఇక వైవీ సుబ్బారెడ్డి అంటారా? ఆయన ఎప్పుడు రాజీనామా చేస్తారో, ఇప్పుడున్న కేసుల్లో ప్రభుత్వం ఎక్కడ ఇరుకున పెడుతుందో కూడా తెలియని పరిస్థితి. జగన్ అరెస్ట్ అయితే మాత్రం పార్టీకి గడ్డుకాలమే అని ఒక్క మాటలో చెప్పుకోవచ్చు.