Eluru District: ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ యువకుడ్ని.. అమ్మాయి బంధువులు చితకబాదారు. స్తంభానికి కట్టి అందరూ చూస్తుండగానే పిడిగుద్దులు కురిపించారు. అనంతరం స్తంభానికే వదిలేసి.. యువతికి బలవంతంగా తీసుకెళ్లారు. కాగా దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే..
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటలో ఈ దాడి ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండవల్లి మండలం కానుకొల్లు గ్రామానికి చెందిన సాయిదుర్గ, సాయిచంద్ ఒకరినొకరు 8 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సాయిదుర్గ రమణక్కపేటలోని పోస్టాఫీసు పోస్ట్ ఉమెన్ గా పనిచేస్తుంది. అయితే తమ ప్రేమ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లగా.. పెళ్లికి నిరాకరించారు. దీంతో రెండ్రోజుల క్రితం పెద్దలకు తెలియకుండా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాల నుంచి ప్రాణ హానీ ఉందంటూ మండవల్లి పోలీసు స్టేషన్ ను సైతం ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
‘మా బిడ్డను పెళ్లి చేసుకుంటావా’
అయితే సాయి దుర్గ, సాయి చంద్ వివాహం చేసుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలో యువతీ, యువకుడు పోస్టాఫీసు వద్ద ఉండగా.. అమ్మాయి తరపు బంధువులు అక్కడకు వచ్చారు. సాయిచంద్ ను కొట్టుకుంటూ తీసుకెళ్లారు. చొక్కా లేకుండా స్తంభానికి కట్టేసి గ్రామస్తులు చూస్తుండగానే దాడి చేశారు. తమ బిడ్డనే పెళ్లి చేసుకుంటావా అంటూ చెంప దెబ్బలు కొట్టారు. గ్రామం నడిబొడ్డున యువకుడిపై దాడి చేస్తుండటంతో అక్కడికి పెద్ద ఎత్తున ప్రజలు చేరారు. ఏం జరుగుతుందో అర్థంకాక చూస్తూ ఉండిపోయారు. అయితే దాడి అనంతరం సాయిచంద్ ను స్తంభానికే వదిలేసి యువతిని తీసుకెళ్లిపోయారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు యువకుడిని స్తంభానికి కట్టేసి కొట్టిన యువతి బంధువులు
ఏలూరు జిల్లా ముసునూరులో దారుణం
ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్న సాయిచంద్, సాయి దుర్గ
ఇంట్లో పెళ్లికి నిరాకరించడంతో రెండు రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న జంట
దింతో సాయి చంద్ ని… pic.twitter.com/jGGP1BVXI9
— BIG TV Breaking News (@bigtvtelugu) January 1, 2026
Also Read: Drunk And Drive Test: హైదరాబాద్‌లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. లెక్కలు చూస్తే మతిపోవాల్సిందే!
నన్ను చంపాలని చూశారు: బాధితుడు
దాడి ఘటనపై బాధిత యువకుడు సాయి చంద్ స్పందించారు. యువతి పట్టుబట్టడంతోనే తాను గుడిలో పెళ్లి చేసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే యువతి బంధువులు ఆరుగురు తన వద్దకు వచ్చినట్లు అతడు తెలిపాడు. తొలుత తనను చంపాలనే చూశారని బాధితుడు ఆరోపించాడు. ఈ క్రమంలోనే స్తంభానికి కట్టేసి కొట్టారని ధ్రువీకరించాడు. అయితే జనం పోగుబడుతుండటంతో స్తంభానికే వదిలేసి వారు వెళ్లిపోయారని స్పష్టం చేశారు. అయితే సాయిదుర్గను ఏమైనా చేస్తారేమోనని భయంగా ఉందని యువకుడు ఆందోళన వ్యక్తం చేశాడు.

