Ambati Rambabu: మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar)పై మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాదెండ్ల మనోహర్ పీడీఎస్ రైస్(PDS Rice) దొంగ అని ఆరోపించారు. రాష్ట్రంలో వేలాది టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా రవాణా జరుగుతోందని, నాదెండ్ల అవినీతి చేసి వేల కోట్లు సంపాదిస్తున్నారని విమర్శించారు. కూటమి(Coalition Govt) ప్రభుత్వం మోసపూరిత బడ్జెట్(Budget) ప్రవేశపెట్టిందని మండిపడ్డారు. ఎన్నికల హామీలను అమలు చేయలేకపోతున్నారని విమర్శించారు. జగన్ రూ. 14 లక్షల కోట్లు అప్పులు చేసినట్లు చంద్రబాబు విష ప్రచారం చేశారని, గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర అప్పు రూ. 6 లక్షల కోట్లే అని తేల్చారని మండిపడ్డారు. తమ నాయకుడు జగన్ మీద బురద జల్లుతూ ఇచ్చిన హామీలను ఎగ్గొట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఇక, బడ్జెట్ లో… తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తదితర పథకాలకు అరకొరగా నిధులు కేటాయించారని ఆరోపించారు.
కాగా, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం నాడు ప్రతిపక్ష వైసీపీ(Ycp), అధికార టీడీపీ(Tdp)ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వైసీపీకి హోదా ఇవ్వాలంటూ వైసీపీ సభ్యులు వాదించగా, అదెలా కుదురుతుందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రి లోకేశ్ తీవ్రంగా స్పందించారు. రూలింగ్ ప్రకారం మొత్తం సీట్లలో కనీసం 10శాతమైనా ఉంటేనే హోదా సాధ్యమని రూలింగ్ లో స్పష్టంగా ఉందని మరోక్కసారి తెలియపరిచారు. కానీ జగన్ మాత్రం ప్రతిపక్ష హోదాను స్పీకరే ఇవ్వడం లేదన్నట్లుగా దురుద్దేశాలను ఆపాదిస్తున్నారని అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్… హోదా విషయంలో కూటమి ప్రభుత్వంపై జగన్ విష ప్రచారాలు చేస్తున్నారని, ఇది సభా వ్యవహారాల ఉల్లంఘన కిందకి వస్తుందని జనసేన(Janasena) పార్టీ తరపున ఈ విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై ఇవాళ మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై నాదెండ్ల ఎలా రియాక్టవుతారో చూడాలి మరీ.