AP Politcs: భారత రాజకీయాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో, రాజకీయ వారసత్వం అనేది ఒకప్పుడు విజయాన్ని సులభతరంగానే ఉండేది. అయితే, ప్రస్తుత కాలంలో పరిస్థితి మారుతోంది. కేవలం వారసత్వం మాత్రమే కాకుండా, వ్యక్తిగత సామర్థ్యం.. ప్రజలతో సంబంధాలు చాలా ముఖ్యమైనవిగా మారాయి. ఒకప్పుడు పేరుగాంచిన కుటుంబాలు ఎన్నికల తలుపులు ఎప్పుడు తెరిచినా గెలుపు తథ్యం అన్నట్లుగా ఉండేది. ఇప్పుడు అది గెలుపునకు ఏ మాత్రం సహకరించని పరిస్థితి. ఎందుకంటే.. ఓటర్లు ఎంతో వివేకంతో, నాయకుల పనితీరు, ప్రజలకు అందుబాటులో ఉండటాన్ని ఇలా ప్రతి విషయాన్ని గమనిస్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా.. యువ ఓటర్లు ముఖ్యంగా, నాయకులు తమ కుటుంబం గతంలో చేసిన పనిపై మాత్రమే ఆధారపడట్లేదు. వారసుల విషయంలో పార్టీల లోపల కూడా టిక్కెట్ల కోసం తీవ్ర పోటీ ఉంటున్న పరిస్థితి. ఆచరణాత్మక అనుభవం లేదా బలమైన స్థానిక నెట్‌వర్క్‌లు లేని రాజకీయ వారసుడి కంటే, బలమైన స్థానిక నాయకులు, సీనియర్ నాయకులకు పార్టీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. రేసు గుర్రాలకు మాత్రమే పార్టీలు ఎన్నికల బరిలోకి దించుతున్నాయి. రాజకీయ వారసుడు గెలిచే అవకాశం తక్కువగా ఉందని భావిస్తే.. పార్టీ బయటి వ్యక్తిని లేదా కుటుంబేతర అభ్యర్థిని ఎంచుకోవడానికి పార్టీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి.
Read Also- Hardik Pandya: హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితంలో మరో కీలక పరిణామం?
2029లో పరిస్థితేంటి?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వారసత్వం ఎక్కువ. ఇప్పుడున్న రాజకీయ నేతలు దాదాపుగా అలాగే వారసత్వం నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారు. ఇప్పటికే పలువురు రాజకీయాల్లో రాణిస్తుండగా.. మరికొందరు మాత్రం రాణించలేక సతమతం అవుతున్న పరిస్థితి. వాస్తవానికి 2024 ఎన్నికల్లోనే చాలా మంది వారసులకు టికెట్లు దక్కాయి.. గెలిచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అయ్యి చట్ట సభల్లోకి అడుగుపెట్టారు. మరికొందరికి టికెట్లు లేవు.. ఆ తర్వాత పార్టీలు ఇచ్చే నామినేటెడ్ పోస్టులు కూడా లేవు. ఇందులో పరిటాల శ్రీరాం, దేవినేని అవినాష్, నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి, కావలి గ్రీష్మ, వంగవీటి రాధా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు. వీళ్ల తల్లిదండ్రులు, కుటుంబీకులు చాలా మందే ఆయా నియోజకవర్గాలు, జిల్లాలను ప్రభావితం చేసిన వాళ్లే. నాటి నుంచి నేటి వరకూ అదే పలు ప్రాంతాల్లో కొనసాగుతుండగా.. 2024 ఎన్నికల్లో వీరిలో చాలా మందికి టికెట్లు దక్కలేదు. అయితే 2029 ఎన్నికల్లో అయినా టికెట్లు దక్కుతాయనే గంపెడాశలతో ఉన్నారు. పోనీ టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఎంత? టికెట్ వస్తే కచ్చితంగా గెలిచే పరిస్థితి ఉందా? లేదా? అన్నదానిపై సందిగ్ధత సైతం నెలకొన్నది. అందుకే అసలు వారసులకు టికెట్లు ఇవ్వాలా? వదా? అని పార్టీలు ఆలోచనలో పడుతున్నాయి. అయితే వారి కుటుంబీకులు మాత్రం టికెట్లు ఇచ్చి తీరాల్సిందేనని హైకమాండ్‌ను పట్టుబడుతున్నారు.
భవిష్యత్తు ఏంటి?
పరిటాల శ్రీరాం (Paritala Sriram).. తండ్రి పరిటాల రవి వంటి బలమైన రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ, గత ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. పార్టీ నుంచి 2029 ఎన్నికల్లో టికెట్ వస్తుందని ఆశపడుతున్నారు కానీ, ధర్మవరం సీటు ఈసారైనా దక్కుతుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగానే మారింది. వాస్తవానికి ఈ దఫా ఎమ్మెల్సీ అయినా ఇస్తారని అభిమానులు, కార్యకర్తలు ఆశించారు కానీ అధిష్టానం ఎందుకో ఉసూరుమనిపించింది. ఇక దేవినేని ఫ్యామిలీకి విజయవాడలో ఎంత పట్టు, గుర్తింపు ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆ కుటుంబం నుంచి వచ్చిన అవినాష్(Devineni Avinash) రాజకీయంగా రాణించలేకపోతున్నారు. విజయవాడ తూర్పు నుంచి వైసీపీ తరఫున పోటీచేయడానికి ఉత్సాహపడుతున్నారు. ఇదివరకే పోటీచేసినప్పటికీ ఓట్లు రాల్లేదు. దీంతో ఆయన్ను విమర్శకులంతా ఐరన్ లెగ్ అని విమర్శిస్తున్న పరిస్థితి. నేదురుమల్లి కుటుంబం (Nedurumalli Family) రాష్ట్రాన్ని ఏలిన రోజులు ఉన్నాయి. అయితే ఆ కుటుంబం నుంచి వచ్చిన రామ్‌కుమార్ రెడ్డికి నెల్లూరు జిల్లా వెంకటగిరి ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్నప్పటికీ, గత ఎన్నికల్లో గెలుపొందలేకపోయారు. రానున్న ఎన్నికల్లో పార్టీ తిరిగి టికెట్ ఇస్తుందా? లేదా? అనే దానిపై అనిశ్చితి నెలకొంది. ఎందుకంటే.. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీచేసి ఘోర పరాజయం పాలైన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను ఇక్కడ్నుంచి బరిలోకి దింపాలని అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
Read Also- Viral News: సీఈవో హగ్ వైరల్.. గట్టిగా వాడేస్తున్న ప్రముఖ కంపెనీలు
వీళ్ల పరిస్థితేంటో?
ఇక కావలి గ్రీష్మ (Kavali Greshma) విషయానికొస్తే.. రాజాం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఎంతో ఆశపడ్డారు. మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతి కుమార్తె గతంలో టికెట్ ఆశించినా దక్కలేదు. దీంతో ఎమ్మెల్సీగా టీడీపీ అవకాశం ఇచ్చింది. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఎంత మాత్రం ఉంటుందో తెలియట్లేదు. ఇక వంగవీటి విషయానికొస్తే మోహన రంగ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కానీ ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రాధా (Vangaveeti Radha) మాత్రం 2004లో ఒకే ఒక్కసారి మాత్రమే విజయం సాధించారు. ఆ తర్వాత పదవులు దక్కలేదు. 2024 ఎన్నికల్లో కనీసం టికెట్ కూడా రాలేదు. ప్రస్తుతం టీడీపీ నుంచి నిష్క్రమించే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తున్నది. ఇలా ఒక్కరా ఇద్దరా అటు రాయలసీమలో.. ఇటు కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో తమ వారసుల చేత పొలిటికల్ ఎంట్రీ ఇప్పించడానికి తహతహలాడుతున్నారు. అయితే టికెట్లు దక్కుతాయా లేదా? అనేది ప్రశ్నార్థకమే. టికెట్ దక్కితే సరే విజయావకాశాలు ఎంత? అనేది పెద్ద డౌటే. మొత్తానికి చూస్తే.. 2029 ఎన్నికలు ఈ రాజకీయ వారసుల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని చెప్పుకోవచ్చు. ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి మరి.
Read Also- Midhun Reddy: మిథున్ రెడ్డి అరెస్ట్.. తర్వాత జాబితాలో ఉన్నది వీళ్లే!