Vijaya Sai On Jagan: విజయ సాయి రెడ్డి(Vijayasai Reddy) ఒకప్పుడు వైసీపీ(YCP)లో నెంబరు2. కానీ ఆయన హఠాత్తుగా ఇటీవల పార్టీకి రాజీనామా చేశారు. అంతేగాకుండా అసలు ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. అయితే పార్టీలో నెంబరు 2గా ఉన్న దృష్ట్యా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆయనపై పలు కేసులు నమోదవడంతో నిందితుల్లో నెంబరు 2 (A2)గా ఉన్నారు. కాకినాడ పోర్టు బదిలీల కేసులో ఆయన సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
వైసీపీలో జగన్(Ys Jagan) చుట్టూ కోటరీ ఉందని, అందులో ఉన్న నాయకుల మాటలే చెల్లుబాటు అవుతున్నాయంటూ బాంబ్ పేల్చారు. నిజానికి రాజీనామా సమయంలోనూ జగన్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయని సాయిరెడ్డి సడెన్ గా ఇలా మాట్లాడటం తీవ్ర చర్చనీయాంశమైంది. అంతేగాక ఆయన పార్టీలో నెంబరు 2 అన్నది అందరూ భావిస్తున్నది భ్రమ అని తేలిపోయింది. ఎందుకంటే.. కోటరీలో తనకు స్థానం లేదని ఆయనే చెప్పారు.
ఇప్పుడెందుకు చెప్పినట్లు
తమ నాయకుడి మనుసులో స్థానం లేనప్పుడు. పార్టీలో స్థానమెందుకని బయటికి వచ్చినట్లు సాయిరెడ్డి వెల్లడించారు. తన మనసు విరిగి పోయిందని, గుండె పగిలిపోయిందని చెప్పకొచ్చారు. అయితే ఇదీ ఆయన అక్కసుతో బయటపెటుతున్నట్లు లేదని తన ఆవేదనే చెప్పుకున్నట్లు ఉందనే చాలా మంది భావిస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హాయాం నుంచే విజయసాయిరెడ్డి ఆ కుటుంబానికి సన్నిహితుడు. వైఎస్ జగన్ కు ఆంతరంగికుడు కూడా. కానీ జగన్ కు ఆయనకు మధ్య గ్యాప్ ఉందని, అది చాన్నాళ్లుగా కొనసాగుతోందని అర్థమవుతున్నది.
ఓ విషయం గమనిస్తే… పార్టీకి రాజీనామా చేసిన సమయంలో సాయిరెడ్డి జగన్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నట్లు అంటే… ఆయా కేసుల్లో ఆయన పోలీసులు ఏ2 గా చేర్చడమేనా అనుమానం వస్తున్నది. తన మాటలు పట్టించుకొని, తనను కోటరీలోకి అనుమతించని తమ నాయకుడి తరఫున తానేందుకు కేసులు భరించాలి? ఎందుకు విచారణకు హాజరుకావాలి? అని కాబోలు ఆయన బాధ.
మొత్తానికి ఎంతటి సాన్నిహిత్యమైనా ఒకనాడు ఎడబాయక మానదు. ఆ విధంగా ఒకనొక సమయంలో జగన్ కు తోడుగా ఉన్న సాయిరెడ్డి… పార్టీ ఓడిపోయి, నేతలు ఒకరి తర్వాత ఒకరు కేసుల పాలు, జైలు పాలు అవుతున్న ఈ క్లిష్ట సమయంలో బయటికి వెళ్లిపోయారు. మనసు విరిగిపోయింది.. అది అతకదని చెప్తున్నారు. కేసుల వల్ల ఏమన్నా అవుతుందని భయమో, బీజేపీకి తద్వారా కూటమికి దగ్గరవ్వాలన్న వ్యూహామో తెలియదు.
ఇదిలావుంటే… జగన్ కోటరీలో విజయ్ సాయి రెడ్డి లేడు సరే! మరీ ఎవరున్నట్లు? అనేదే ఇప్పుడు ప్రశ్న. మరో విషయం ఏంటంటే… ఆయన సీఐడి విచారణకు హాజరైన సందర్భంగా… విలేకర్లతో మాట్లాడుతూ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి(Kasireddy Rajasekharreddy)పై ఆరోపణలు చేశారు. మద్యం కుంభకోణం(Liquor scam)లో ఆయనే కీలక పాత్రధారి అని చెప్పారు. మొత్తానికి కోటరీని నమ్ముకుంటే… అందులో ఉన్న నాయకుల చెప్పుడు మాటలు వింటే … జగన్ ప్రమాదంలో పడతారని, భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుందని హెచ్చరిస్తున్న సాయిరెడ్డి ముందుముందు ఇంకెన్ని సంచలన విషయాలు బయటపెడతారో చూడాలి.