గుంటూరు, స్వేచ్ఛ: Posani Krishna Murali: వైసీపీ మాజీ నేత, నటుడు పోసాని కృష్ణమురళి ఎట్టకేలకు జైలు నుంచి విడుదల అయ్యారు. ఇప్పటి వరకూ ఆయనపై రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల్లో బెయిల్ రాగా, శనివారం సీఐడీ నమోదు చేసిన కేసులో కూడా బెయిల్ దక్కడంతో గుంటూరు జైలు నుంచి బయటికొచ్చారు. కాగా, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆయా పార్టీల నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు చేశారు.
ఈ క్రమంలో ఫిబ్రవరి 26వ తేదీన హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి కేసులు నమోదైన జిల్లాల పోలీస్ స్టేషన్లకు, కోర్టులకు, జైళ్లకు పోసాని తిరుగుతూనే ఉన్నారు. అయితే వివిధ జిల్లాల్లో కేసుల నుంచి ఊరట లభించిందని ఇక జైలు నుంచి బయటికొస్తారని అనుకునేలోపే, అనూహ్యంగా సీఐడీ కేసు తెర మీదికి రాకపోవడం విడుదలకు బ్రేక్ పడగా, అధికారులు విచారణకు తీసుకున్నారు. దీంతో పోసాని రిలీజ్ మరింత ఆలస్యమైంది.
అండగా వైసీపీ..
ఆయన వైసీపీకి దూరంగా ఉన్నప్పటికీ, రాజకీయాలకు గుడ్ బై చెప్పినప్పటికీ అరెస్ట్ తర్వాత పోసానికి పార్టీ అడుగడుగునా అండగా ఉన్నది. లీగల్ టీమ్‌ను ఏర్పాటు చేయడంతో పాటు స్వయంగా టాప్ మోస్ట్ లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని వైసీపీ రంగంలోకి దించింది. అరెస్ట్ అయిన రోజు నుంచి విడుదలయ్యే రోజు వరకూ వైసీపీ నేతలు అండగా ఉంటూ వచ్చారు. ఏ జిల్లాకు పోసానిని తరలిస్తే ఆయా జిల్లాల నేతలు పరామర్శించడం, బెయిల్ కోసం జిల్లా కోర్టులు మొదలుకుని హైకోర్టు వరకూ ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చారు.
ఆ ప్రయత్నాలన్నీ సక్సెస్ కావడంతో జైలు నుంచి పోసాని రిలీజ్ అయ్యారు. అయితే ఇప్పుడు ఆయన తిరిగి వైసీపీలో చేరుతారా? లేకుంటే రాజకీయాలకు గుడ్ బై చెప్పేశాక తిరిగి రావొద్దనే మాట మీదనే ఉంటారా? అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒకట్రెండు రోజుల్లో హైదరాబాద్ వేదికగా పోసాని మీడియాతో మాట్లాడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఆయన ఏం మాట్లాడబోతున్నారు? అరెస్టుపై ఎలా రియాక్ట్ కాబోతున్నారు? కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తారా? లేదా? అని వైసీపీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
పోసాని చేసిన నేరమేంటి?
పోసాని రిలీజ్ తర్వాత జైలు బయట మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘ పోసాని దొంగతనం, మర్డర్లు చేయలేదు. మీడియా ముందు మాట్లాడడం తప్ప ఏ తప్పూ చేయలేదు. రెండు సార్లు ప్రెస్‌మీట్‌లలో మాట్లాడితే 18 కేసులు పెట్టి, 24 రోజులు నిర్బంధించారు. పీటీ వారెంట్ల పేరుతో రాష్ట్రమంతటా తిప్పారు. ఆ వయసులో పోసానిని అలా తిప్పటం కన్నా శిక్ష ఇంకేం ఉంటుంది? రెడ్ బుక్ రచయిత నారా లోకేష్ ఆధ్వర్యంలోనే ఈ అక్రమ కేసులు నమోదయ్యాయి.
పోసాని హాస్య నటుడు కాబట్టి కాస్త వ్యంగ్యంగా మాట్లాడారు. అంతమాత్రానికే కేసులు పెడతారా? వినుకొండ నియోజకవర్గానికి చెందిన వ్యక్తిని పోలీసులు ఎత్తుకుపోయారు. మరి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా చంద్రబాబు మీద వ్యంగ్యంగా మాట్లాడారు కదా? మరి ఆయనపై ఎందుకు కేసులు ఎట్టలేదు? అక్రమ కేసులు పెట్టిన ఎవరినీ వదలే ప్రసక్తేలేదు’ అని అంబటి హెచ్చరించారు.