Kolikapudi Srinivasa Rao: తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చుట్టూ ఏదో ఒక వివాదం ముసురుకుంటూనే ఉంది. ఇప్పటికే ఆయన చేసిన పనులతో హాట్ టాపిక్ అయ్యి, ఆఖరికి అధిష్టానం సైతం సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మొదటి నుంచి తన దూకుడుతో వివాదాస్పదం అవుతూనే ఉన్నారు. అయితే తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు కొలికపూడి. ఈసారి ఏకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. టీడీపీ నేత రమేష్ రెడ్డిపై అధిష్ఠానం చర్యలు తీసుకోకపోతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన సంచలన ప్రకటన చేశారు.
ఎమ్మెల్యేగా నేనెందుకు?
కాగా, రమేష్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఓ గిరిజన మహిళతో ఆయన అసభ్యకరంగా మాట్లాడారంటూ సోషల్ మీడియాలో ఫోన్ కాల్ సంభాషణ వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలంటూ గిరిజన మహిళలు ఆందోళన చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే కొలికపూడి స్పందిస్తూ రమేష్ వ్యవహారాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. అయితే, పార్టీ అధిష్టానానికి తెలియజేసి పది రోజులు అవుతున్నా పట్టించుకోలేదని, 48 గంటల్లోగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేయలేకపోతే ఎమ్మెల్యేగా తానెందుకని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. హైకమాండ్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? రాజీనామా చేసేస్తారా? లేదా నిర్ణయం, మనసు మార్చుకుంటారా? అనేదానిపై కొలికపూడి అభిమానులు, కార్యకర్తల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.