ఆంధ్రప్రదేశ్ స్వేచ్చ: TDP vs Janasena: పిఠాపురంలో జనసేన-టీడీపీ మధ్య పోరు ఇప్పట్లో ఆగేలా లేదు. అటు జనసైనికులు, ఇటు తెలుగు తమ్ముళ్లు ఎవ్వరూ తగ్గట్లేదు. నియోజకవర్గం నీదా నాదా? అన్నట్లుగా జనసేన ఎమ్మెల్సీ నాగబాబు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పంథం నెగ్గించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న వర్మ ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. నా నియోజకవర్గానికే వచ్చి హడావుడి చేస్తారా? అంటూ తాను రంగంలోకి దిగకుండానే అభిమానులు, కార్యకర్తలు, అనుచరులతో తన మార్క్ గేమ్‌ను వర్మ షురూ చేశారు.
ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, స్థానిక, జిల్లా నేతలను ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తనకు తానుగా సీఎం రిలీఫ్ ఫండ్‌తో పాటు పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి పిఠాపురం గడ్డ.. ఎప్పటికైనా వర్మ అడ్డా అనేలా హడావుడి చేశారు. దీంతో ఎక్కడ నియోజకవర్గం వర్మది అవుతుందని నాగబాబు ఆందోళన చెందారో లేదంటే పిఠాపురంలో తనదే పైచేయి కావాలనుకున్నారో కానీ ఎమ్మెల్సీగా ప్రమాణం చేసినా రెండ్రోజుల వ్యవధిలోనే రంగంలోకి దిగిపోయారు. ఆయనకు ఎలాంటి సంబంధంలేని నియోజకవర్గంలో వాలిపోయి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సావాలు చేయడం మొదలుపెట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఫుల్‌స్టాప్ పడేదెప్పుడు?
నాగబాబు పిఠాపురం పర్యటనలో తొలిరోజు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండో రోజు అయినా పరిస్థితులు అనుకూలిస్తాయని అనుకున్న మెగా బ్రదర్‌కు వర్మ వర్గం ఊహించని ఝలక్ ఇచ్చింది. శనివారం పిఠాపురం మండలం కుమారపురంలో టీడీపీ జనసేన కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. రోడ్డు ప్రారంభోత్సవానికి వచ్చిన నాగబాబు ఎదుటే టీడీపీ కార్యకర్తల జై వర్మ జై టీడీపీ అంటూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో జనసేన కార్యకర్తలు కూడా, వారికి పోటీగా జై పవన్ జై నాగబాబు జై జనసేన అంటూ నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య పోటాపోటీ ఘర్షణ వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు రెండు వర్గాలను వారించే ప్రయత్నం చేశారు.
టీడీపీ కావాలనే జనసేనను రెచ్చగొడుతుందని జనసైనికులు అంటుంటే.. జనసేన కార్యకర్తలు, నాయకులు టీడీపీని లెక్కచేయకుండా ఉండటంతోనే ఇలా జరుగుతోందని ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. రెండ్రోజుల పర్యటనతో పిఠాపురంలో టీడీపీ- జనసేన మధ్య రచ్చ మరోసారి బయటపడింది. రేపొద్దున్న పవన్ కళ్యాణ్ పర్యటనకు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇలా ఎవ్వరూ తగ్గకుండా ఉంటే పరిస్థితులు శృతి మించుతాయే తప్ప ఏ మాత్రం అదుపులోకి రావు. ఈ రచ్చలు, వివాదాలకు ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందా? అని ఇరు పార్టీల కార్యకర్తలు వేచి చూస్తున్నారు.
Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/