- కొణిదెల నాగబాబుకు మంత్రి పదవి ఏమైంది?
- సంక్రాంతి దాటి శివరాత్రి వస్తున్నా ఊసు ఏది?
- మార్చి తర్వాతే మంత్రి అవుతారని ఊహాగానాలు
- ఇప్పటికే నలుగురు వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామా
- ఇంతవరకూ ఆమోదించని శాసన మండలి ఛైర్మన్
- ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాకే మంత్రిగా ప్రమాణం
- పెద్దల సభకు వెళ్లాలనే యోచనలోనే ఉన్నారా?
- మెగా బ్రదర్ ఢిల్లీకెళ్తే మంత్రి పదవి దక్కేదెవరికి
- రేసులో మహిళా ఎమ్మెల్యే, మరికొందరు నేతలు
- తొలి దఫాలో కొణతాలకు దక్కని మంత్రి పదవి
Janasena Nagababu: జనసేన కీలక నేత కొణిదెల నాగబాబు మంత్రి పదవి సంగతి ఏమైంది? ఇంతకీ ఆయన మంత్రి అవుతారా? లేదా? సంక్రాంతి తర్వాత ప్రమాణ స్వీకారం అన్నారు కానీ, శివరాత్రి దగ్గరపడుతున్నా ఆ ఊసే లేదేం? ఎందుకు ఆలస్యం జరుగుతోంది? మంత్రి పదవి తీసుకోవడానికి మెగా బ్రదర్ సుముఖంగా లేరా? ఆయన మనసులో ఏముంది? ఇంతకుమించి వేరే ఏమైనా కోరుకుంటున్నారా? అమరావతిలో ఉండటం కంటే దేశ రాజధాని ఢిల్లీలో చక్రం తిప్పాలన్నదే ఆయన టార్గెట్‌గా ఉందా? లేదంటే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడీ ప్రశ్నలే జనసేన కార్యకర్తలు, అభిమానులను వెంటాడుతున్నాయి. జనసేనకు అధినేత పవన్ కళ్యాణ్ తర్వాత అన్నీతానై చూసుకున్న వ్యక్తి నాగబాబు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన, పలుమార్లు సీటు త్యాగం చేసిన అన్నను మంచి హోదాలో కూర్చోబెట్టాలన్నది సేనాని కోరిక. మొదట ఎమ్మెల్సీని చేసి ఆ తర్వాత మంత్రి పదవి కట్టబెట్టాలని అనుకున్నారు కానీ మూడు నెలలుగా అదిగో మంత్రి పదవి, ఇదిగో ప్రమాణం అంటూ హడావుడి జరుగుతోందే తప్ప ఎక్కడా అడుగులు ముందుకు పడలేదు. దీంతో మెగాభిమానులు, పార్టీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
ఆలస్యం ఎందుకు?
వైసీపీకి నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. వీరిలో గవర్నర్ నామినేట్ చేసిన కోటాలో కర్రి పద్మశ్రీ, ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికైన బల్లి కల్యాణ్‌చక్రవర్తి, పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ ఉన్నారు. రాజీనామా చేసి మూడు, నాలుగు నెలలు అవుతున్నా ఇంతవరకూ శాసన మండలి ఛైర్మన్ మోషేన్‌రాజు ఆమోదించలేదు. అక్కడ్నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చి ఉంటే ఈపాటికే ఎన్నికలు జరిగేవి. ఎందుకు ఆమోదించలేదో కారణాలు తెలియట్లేదు. మరోవైపు మార్చి 29న ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. టీడీపీ తరఫున ఎన్నికైన దువ్వారపు రామారావు, పరుచూరి అశోక్‌బాబు, తిరుమల నాయుడు, యనమల రామకృష్ణుడు, వైసీపీ నుంచి టీడీపీలో చేరిన జంగా కృష్ణమూర్తిల పదవీకాలం మార్చి నెలఖారకు ముగియనుంది. అయితే అటు వైసీపీకి రాజీనామా చేసిన, ఇటు పదవీకాలం ముగియనున్న అన్ని స్థానాలకు కలిపి ఎన్నికలు నిర్వహించే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. అందుకే ఆలస్యం అవుతోందని రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ప్రక్రియ అంతా మార్చి తర్వాతే పూర్తవుతుంది. అందులోనూ గవర్నర్ కోటాలోనే నాగబాబు ఎమ్మెల్సీ అయ్యే ఛాన్స్ ఉంది. ఎమ్మెల్సీ అయ్యాకే తన సోదరుడు మంత్రిగా ప్రమాణం చేస్తారని ఇదివరకే పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
బాబూ.. ఎందుకిలా?
మంత్రి పదవి తీసుకోవడానికి ఆ మధ్య సుముఖంగానే ఉన్న నాగబాబు పెద్దల సభకు (రాజ్యసభ) వెళ్లాలని మనసులో ఉందని తెలిసింది. ఇదివరకే రాజ్యసభకు వెళ్లాలని ప్రయత్నాలు చేసినప్పటికీ, వైసీపీ రాజీనామా చేసిన స్థానాలను బీజేపీ, టీడీపీ పంచుకున్నాయి. అయితే విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో మళ్లీ మెగా బ్రదర్‌లో ఆశలు చిగురించాయి. తమ్ముడు పవన్ అమరావతిలో ఉంటారు గనుక, తాను ఇక్కడ ఉండటం కంటే ఢిల్లీ వేదికగా చక్రం తిప్పాలన్నది ఆయన మనసులో ఉందట. అందుకే మంత్రి పదవి కంటే పెద్దల సభకు వెళ్లడానికే ఆసక్తిగా ఉన్నారట. దీనికి తోడు కుటుంబ రాజకీయాలు అనే ముద్ర కూడా పడుతుందని పవన్ కూడా పునరాలోచన చేస్తున్నారని తెలుస్తున్నది. అందుకే మంత్రి పదవిపై సందిగ్ధత నెలకొందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే మొదట్నుంచీ ఎంపీగా పోటీ చేయాలన్నది నాగబాబు కోరిక. తొలిసారి 2019 ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో అనకాపల్లి లేదా వైజాగ్ నుంచి పోటీచేయాలని భావించారు కానీ కూటమిగా పోటీచేయడంతో బీజేపీ కోసం తన సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. అయితే లోక్‌సభకు వీలుకాకపోయే సరికి రాజ్యసభకు అయినా వెళ్లొచ్చని కలలు కన్నారు కానీ, ఇక్కడా అదే సీన్. ఈసారి బీజేపీతో పాటు టీడీపీ కోసం కూడా త్యాగం చేయాల్సి వచ్చింది. దీంతో విజయసాయి స్థానాన్ని తనకే దక్కాలని గట్టిగానే పవన్‌ను పట్టబట్టారట. అంతేకాదు సాయిరెడ్డి రేంజిలో కేంద్రంలో చక్రం కూడా తిప్పాలని భావిస్తున్నారని తెలిసింది.
మెగా బ్రదర్ తప్పుకుంటే?
నాగబాబు రాజ్యసభకు వెళ్తే సంతోషమేనని జనసేన సీనియర్లు, ఎమ్మెల్యేలు, వైసీపీ నుంచి పార్టీలోకి వచ్చిన నేతలు అనుకుంటున్నారు. ఎందుకంటే ఆ పదవి తనకంటే తనకు దక్కుతుందని పోటీ పడుతున్నారు. రేసులో కొణతాల రామకృష్ణ, వంశీకృష్ణ శ్రీనివాస్, లోకం నాగ మాధవి, పంచకర్ల రమేశ్ బాబు, పంతం నానాజీ, మండలి బుద్ధప్రసాద్, ఆరణి శ్రీనివాసులు ఉన్నారు. వాస్తవానికి తొలి దఫాలోనే సీనియర్ నేత కొణతాలకు కేబినెట్‌లో బెర్త్ దక్కాల్సి ఉన్నప్పటికీ కొన్ని సమీకరణాల దృష్ట్యా వీలుకాలేదు. నాగబాబు అటు వెళ్తే తప్పకుండా తనకేనని అనుచరులు, అభిమానులతో చెప్పుకుంటున్నారట. మరోవైపు మహిళకు పార్టీ తరఫున పదవి ఇస్తే బాగుంటుందనే ఆలోచన చేస్తే మాత్రం తాను మంత్రిని అవుతానని లోకం మాధవి ధీమాగా ఉందట. ఇప్పటి వరకూ కోస్తాంధ్ర, గోదావరి జిల్లాల నుంచి మంత్రులు అయ్యారు గనుక ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ రాయలసీమకు మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉందని టాక్. అయితే సీనియర్‌ను తానే కాబట్టి సీమ నుంచి మంత్రి పదవి తనకే దక్కుతుందని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నమ్మకంతో ఉన్నారని తెలుస్తున్నది. వీరు కాకుండా సీనియర్లను లెక్కలోకి తీసుకుంటే పంతం నానాజీ, మండలి బుద్ధ ప్రసాద్ ఉన్నారు. ఉన్నది ఒకే ఒక్క పదవి, రేసులో ఉన్నది మాత్రం బోలెడంత మంది వీరిలో ఎవరికి దక్కుతుందో అని జనసేన శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.
బాలినేనికి లైన్ క్లియరేనా?
వైసీపీ, వైఎస్ ఫ్యామిలీ మెంబర్‌గా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరారు. అప్పట్లోనే తగిన ప్రాధాన్యత ఇస్తానని స్పష్టమైన హామీతోనే పార్టీ మారినట్లుగా చర్చలు జరిగాయి. ఈయనకు మంచి హోదా కల్పించి ‘రెడ్డి’ సామాజిక వర్గాన్ని అక్కున చేర్చుకోవాలన్నది పవన్ కళ్యాణ్ టార్గెట్. బాలినేనికి వైసీపీతో పాటు కాంగ్రెస్, టీడీపీతోనూ మంచి సత్సంబంధాలు ఉన్నాయి. పార్టీలో చేరికలకు, సీనియర్లును తీసుకురావడంతో బాలినేని ముందుపెట్టి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆడించొచ్చని సేనాని భావిస్తున్నారట. ‘కాపు’ తర్వాత పార్టీకి ‘రెడ్డి’ సామాజికవర్గమే కొండంత బలం అన్నట్లుగా బలోపేతం చేయాలని మాస్టర్ ప్లాన్ ఉందట. ఎలాగో రాయలసీమలో రెడ్లతో బాలినేనికి మంచి పరిచయాలు ఉన్నాయి. వైసీపీలో ఉంటూ అసంతృప్తిగా ఉంటున్న నేతలు కూడా చాలా మందే ఉన్నారు. వీటన్నింటినీ క్యాష్ చేసుకోవాలంటే తొలుత బాలినేనికి ఎమ్మెల్సీ పదవి కట్టబెడితే అన్నీ సెట్ అవుతాయి, ఆ తర్వాత రెడ్డి కోటాలో మంత్రి పదవి కూడా ఇచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయట. అటు సొంత పార్టీ తరఫున గెలిచిన వాళ్లూ 18 మంది ఉంటే, బాలినేని మాత్రం జంపింగ్ నేత వీరిలో ఎవరికి ప్రాధాన్యత ఇస్తారో? అసంతృప్తులను ఎలా మెప్పిస్తారో? అనేది పవన్ కళ్యాణ్ ముందున్న పెద్ద టాస్క్.