Temple Tragedy: ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. కార్తీక మాసం, ఏకాదశి సందర్భంగా భారీ సంఖ్యలో ఆలయానికి భక్తులు తరలివచ్చారు. దీంతో క్యూలైన్ లో తొక్కిసలాట చోటుచేసుకొని 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటీనా స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
పవన్ కీలక ఆదేశాలు
కాశీబుగ్గ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటపై ఉపముఖ్యమంత్రి పవన్ సంతాపం తెలియజేశాడు. తొక్కిసలాటలో భక్తులు మరణించడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. వారిలో చిన్నారి కూడా ఉండటం తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. క్షతగాత్రులు త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని స్పష్టం చేశారు. ‘ఆధ్యాత్మికంగా విశిష్టమైన రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాల వద్ద భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేలా, ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా చూడాలని అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాను’ అని పవన్ పేర్కొన్నారు.
శ్రీకాకుళం జిల్లా, పలాస – కాశీబుగ్గ పట్టణం లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనానికి వేలాదిగా భక్తులు పోటెత్తడంతో జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు మరణించడం అత్యంత దురదృష్టకరం. వారిలో చిన్నారి కూడా ఉండటం తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటనలో గాయపడిన…
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) November 1, 2025
ఘటన కలిచివేసింది: షర్మిల
తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల ఎక్స్ వేదికగా స్పందించారు. ఘటనలో భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని చెప్పారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. శ్రీకాకుళం కాంగ్రెస్ నేతలు వెంటనే సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టకపోవడం బాధాకరమని షర్మిల అన్నారు.
అది ప్రైవేటు గుడి: దేవాదయశాఖ
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయ తొక్కిలాట దుర్ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జరిగిన ఘటన గురించి దేవాదాయ శాఖ ఉన్నత అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు మంత్రి ఆనం ప్రగాఢ సానుభూతి తెలిజయేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందచేయాలని ఆధికారులను ఆదేశించారు. మరోవైపు దేవదాయశాఖ అధికారులు.. తొక్కిసలాట జరిగిన గుడి గురించి కీలక స్టేట్ మెంట్ విడుదల చేశారు. అది ప్రైవేటు గుడి అని దేవాదయశాఖ అధికారులు చెబుతున్నారు. గుడికి ఎంతమంది భక్తులు వస్తారోనన్న సమాచారాన్ని ఆలయ నిర్వాహకులు తమకు ఇవ్వలేదని పేర్కొన్నారు.
నారా లోకేశ్ సంతాపం
తొక్కిసలాట ఘటనపై మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) స్పందించారు. ‘కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఏకాదశి రోజు తీవ్ర విషాదం నెలకొంది. మృతి చెందిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. తొక్కిసలాటలో గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్య చికిత్స అందిస్తోంది. సమాచారం అందిన వెంటనే అధికారులు, జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడుతో, స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీషతో మాట్లాడాను. బాధితులకు తక్షణ సహాయం అందజేయాలని ఆదేశించాను’ అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో విషాదం..
కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట
నలుగురు భక్తులు మృతి.. పలువురికి గాయాలు
ఏకాదశి సందర్భంగా భారీగా వచ్చిన భక్తులు
రెయిలింగ్ ఊడిపోవడంతో ఒకరిపై ఒకరు పడిపోయిన భక్తులు pic.twitter.com/NLlv19tlNT
— BIG TV Breaking News (@bigtvtelugu) November 1, 2025
సీఎం దిగ్భ్రాంతి..
కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటన తనను కలిచివేసిందని చెప్పారు. తొక్కిసలాటలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరమని అన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరోవైపు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఘటనాస్థలిని పర్యవేక్షించాలని స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులును ఆదేశించారు.
తొక్కిసలాటకు కారణమిదే..
కార్తికమాసంలో వచ్చిన ఏకాదశి కావడంతో పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలి వచ్చారు. దేవాలయ సామర్థ్యం 2-3 వేలు కాగా.. ఏకాదశి కావడంతో ఏకంగా 25వేల మంది వరకూ భక్తులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మెట్లగుండా ఆలయంలోకి ప్రవేశిస్తుండగా భక్తుల తాకిడికి రెయిలింగ్ ఊడిపోయింది. దీంతో మెట్లమార్గం నుంచి పదుల సంఖ్యలో భక్తులు కిందపడిపోయారు. ఒకరిమీద ఒకరు భక్తులు పడిపోవడం.. కింద పడిపోయిన వారికి ఊపిరి ఆడకపోవడంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరారు. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం 8 మంది మృత్యువాత పడగా.. ఆస్పత్రికి తీసుకెళ్లిన వారిలో ఐదుగురు పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అందులోనూ ముగ్గురు భక్తుల ఆరోగ్యం మరింత ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
WARNING : DISTURBING CONTENT
Stampede at Venkateswara swamy temple at Kashibugga in Srikakulam . Several injured are being rushed to the hospital
(Videos courtesy : social media)#AndhraPradesh #KarthikaMaasam#Srikakulam#Stampede#Ekadashi#Tragedy pic.twitter.com/wmCADl1IK3— Deccan Chronicle (@DeccanChronicle) November 1, 2025
ఘటనాస్థలికి టీడీపీ ఎమ్మెల్యే
మరోవైపు కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనాస్థలిని టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష పరిశీలించారు. శోకసంద్రంలో మునిగిపోయిన బాధితులకు ఆమె ధైర్యం చెప్పారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఎమ్మెల్యే ధైర్యం చెప్పారు. మరోవైపు జిల్లా యంత్రాంగం సైతం ఘటనాస్థలికి చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. కలెక్టర్ తో పాటు పలువురు జిల్లా ఉన్నతాధికారులు ఘటనస్థలికి బయలుదేరారు.
