Vontimitta Temple: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 6 నుంచి 14 వరకు వైభవంగా జరగనున్నాయి. ఇందుకు అంకురార్పణ ఇవాళ జరగనుంది. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా పెద్ద సంఖ్యలో విచ్చేయనున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.
ఆలయంలో ప్రత్యేక క్యూలైన్లు, ఎండవేడిని తట్టుకునేలా చలువపందిళ్లు ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాల్లో బారీకేడ్లు ఏర్పాటు చేశారు. ఆలయ గోపురాలు, కల్యాణవేదిక, ఇతర ప్రాంతాల్లో పుష్పాలంకరణలు, రంగురంగుల విద్యుత్ దీపాలు, విద్యుత్ కటౌట్లతో శోభాయమానంగా అలంకరించారు. భక్తుల కోసం అన్నప్రసాద వితరణ కౌంటర్లు తదితర ఏర్పాట్లు చేశారు.
ఏప్రిల్ 6న ధ్వజారోహణంతో శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని టీటీడీ వెల్లడించింది. ఉదయం 9.30 గంటల నుంచి 10.15 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శేష వాహనసేవ జరగనున్నట్టు వివరించింది.
బ్రహ్మోత్సవాల షెడ్యూల్ ఇదే
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 6న శ్రీ రామనవమి, ఏప్రిల్ 9న హనుమత్సేవ, ఏప్రిల్ 10న గరుడసేవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 11న సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు శ్రీ సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఆ తర్వాత, గజ వాహనసేవ నిర్వహిస్తారు. ఏప్రిల్ 12న రథోత్సవాన్ని నిర్వహిస్తారు. ఏప్రిల్ 14న ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగిసిపోనున్నాయి. ఏప్రిల్ 15న సాయంత్రం 5.30 నుంచి రాత్రి 9 గంటల వరకు పుష్పయాగం వైభవంగా చేపట్టనున్నారు.
Also Read: AP Govt: ఏపీలో దరఖాస్తుల ఆహ్వానం.. అర్హులైతే ఇప్పుడే అప్లై చేయండి..
ఇక, ప్రతిరోజూ ఉదయం 7.30 నుంచి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు జరుగనున్నాయి. మరోవైపు, శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శ్రీరామనవమి పర్వదినం, శ్రీ పోతన జయంతిని పురస్కరించుకుని టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఏప్రిల్ 6 సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల వరకు పోతన భాగవతం అంశంపై కవి సమ్మేళనం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7వ తేదీ రామయాణంలోని కాండలపై కవి సమ్మేళనం జరుగుతుందని అధికారులు తెలిపారు. కాగా, ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయ చరిత్ర విషయానికి వస్తే పురాతన, చారిత్రక ప్రాశస్త్యం ఉంది. ఒకే శిలపై సీతారామ లక్ష్మణ దేవతామూర్తులు ఉండడంతో ఒంటిమిట్టను ఏకశిలానగరం అని కూడా పిలుస్తారు.